Home News Stories

ఏపీలో ఎవరి పంతం నెగ్గుతుంది?

పంతం నీదా నాదా సై…అన్నట్లే ఉంది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే ముందు ప్రభుత్వం అనుకోవాలి. ఎన్నికలసంఘం దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వ్యవహారం రివర్సులో ఉంది. ఎడ్డెమంటే తెడ్డెమన్నట్లున్నాయి ప్రభుత్వం, ఎన్నికల సంఘం.ప్రభుత్వం పెట్టాలనుకున్నప్పుడు ఎన్నికల సంఘం అప్పుడొద్దంది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలక్షన్లకుఉత్సాహపడుతుంటే….ప్రభుత్వం ఇప్పుడే కుదరంటోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టే నడుస్తోంది ఎన్నికల వివాదం. అత్యంత వ్యూహాత్మకంగా నిమ్మగడ్డను సీఈసీ పోస్టు నుంచి తప్పించాక కూడా….కోర్టుకెళ్లి ఆయన మళ్లీ ఆ సీట్లో కూర్చోవడాన్ని ఏపీ ప్రభుత్వం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. కంట్లో నలుసులా మారిన నిమ్మగడ్డ ఆ బాధ్యతల్లో ఉండగా ఎన్నికలు నిర్వహించొద్దనే పట్టుదలతో ఉంది. అయితే వివాదం మాత్రం కోర్టుదాకా వెళ్లింది. చివరికి గవర్నర్ గడప కూడా తొక్కొచ్చిందఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడు జరుగుతాయన్నది ఇప్పుడు జవాబులేని ప్రశ్న. ఎందుకంటే వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలనే పట్టుదలతో ఉంది వైసీపీ ప్రభుత్వం.

వైసీపీ వద్దంటే టీడీపీ కావాలనే అంటుందిగా. అదిగో…అదే జరుగుతోంది ఏపీలో. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే ఎన్నికల జరిగిపోవాలని కోరుకుంటోంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. వైసీపీ అంత గట్టిగా పట్టుబట్టడానికి కారణం…ఏప్రిల్ దాకా మంచి ముహూర్తాలు లేవని కాదు. అప్పుడైతే వైసీపీ కోరుకునే వాతావరణం ఉంటుంది. ఇప్పుడేదో వ్యతిరేకత ఉందని కాదు. వైసీపీ లెక్క వేరే. వచ్చే ఏడాది మార్చి నెలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తవుతుంది. ఆయన ఆ పోస్టునుంచి దిగిపోయాకే ఎన్నికలు జరపాలనే ఆలోచన చేస్తోంది వైసీపీ. కానీ టీడీపీ మాత్రం… నిమ్మగడ్డ సీఈసీగా ఉండగానే ఎన్నికలు జరిగిపోవాలని కోరుకుంటోంది. ప్రజల్లో బలం పుంజుకుని గెలిచేస్తామని కాదు. గెలిచినా, ఓడినా వైసీపీ పంతం నెరవేరకూడదని.

రమేష్ కుమార్ నేతృత్వంలో అయితే వైసీపీని ఎన్నికల్లో కాలూ చేయీ ఆడకుండా అష్ట దిగ్బంధనం చేయొచ్చని. పరోక్షంగా ఎన్నికల కమిషనర్ మద్దతు ఉండటం ఏదో రూపంలో తమకు కలిసొస్తుందనేది టీడీపీ దింపుడు కళ్లెం ఆశ.
అర్జంటుగా ఎన్నికలు జరిగిపోవాలని టీడీపీ తహతహలాడిపోతున్నా, సీఈసీ కూడా తన నిర్ణయాన్ని వెంటనే అమలులోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా…మిగిలిన పార్టీలు మాత్రం కలిసి రావడం లేదు. ఎన్నికలను కనీసం మరో రెండు నెలలు వాయిదా వేయాలంటోంది బీజేపీ కూడా. కరోనా సమస్యే కాదనీ, రాష్ట్రంలో అది నియంత్రణలోనే ఉందని, ఎన్నికల నిర్వహణలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు కూడా చెప్పారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగించుకునే ప్రయత్నాల్లో ఓ పక్క సీఈసీ ఉంటే… బీజేపీ మరో కొత్త వాదన తెరపైకి తెచ్చింది.

రెండు నెలలు ఆగితే కొత్త ఓటర్లు వస్తారని, వారికి కూడా ఓటేసే అవకాశం వస్తుందనేది ఏపీ బీజేపీ అధ్యక్షుడి వాదన. ఇదే పాయింట్.తో ఎన్నికల సంఘానికి లేఖరాశారు సోమువీర్రాజు. 2021 జనవరి నాటికి 18 ఏళ్లు నిండినవారంతా ఓటేసేందుకు అర్హులవుతారు. ఈ పాయింట్.తో దాదాపు అన్ని పార్టీలు ఏకీభవిస్తున్నాయి. అప్పటికి కరోనా కూడా ఫుల్ కంట్రోల్లో ఉంటుందన్న అభిప్రాయంతో రాజకీయ పక్షాలున్నాయి. కొత్త జిల్లాల వ్యవహారం తేలేదాకా వెయిట్ చేస్తే మంచిదని కాంగ్రెస్ అంటుంటే…చివరికి టీడీపీ తానా అంటే తందానా అనే జనసేన కూడా…ఎన్నికల సంఘం మీదే భారమేసింది. దీంతో ఎటుచూసినా నిమ్మగడ్డ నేతృత్వంలో ఎన్నికలు జరిగిపోవాలని బలంగా కోరుకుంటున్న పార్టీ…టీడీపీ ఒక్కటే కనిపిస్తోంది.తన చేతిలో పవర్ ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతే….న్యాయపోరాటం చేసి సాధించిన పదవికి అర్ధమే ఉండదన్న పట్టుదలతో ఉన్నారు సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

ఆయన నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్.కి అధికారపార్టీ హాజరుకాలేదు. అయినా నిమ్మగడ్డ ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. మొదట కోర్టుల్లో క్లియరెన్సు వస్తే నెక్ట్స్ స్టెప్ వేయొచ్చనుకుంటున్నారు. అటు ప్రభుత్వం మాత్రం ఆ సీట్లో ఉత్సవ విగ్రహంగానే నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిపోవాలని కోరుకుంటోంది. అందుకే నాలుగైదు నెలలదాకా ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదంటోంది. మరోవైపు స్థానిక సంస్థ‌ల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ ప్ర‌భుత్వం. 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో టెక్నికల్.గా స్థానిక సంస్థ‌ల ఎన్నికలు కాస్త ఆలస్యమైనా ఇబ్బందేమీ లేదు.

మరోవైపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.తో భేటీ అయి.. అన్ని విషయాలు మాట్లాడారు సీఎం వైఎస్ జగన్. నిమ్మగడ్డ స్పీడుకి బ్రేకులేస్తూనే….రాజ్యాంగపరంగా కూడా ఎలాంటి సవాళ్లు ఎదురుకాకుండా ముందే జాగ్రత్తపడుతున్నారు ఏపీ సీఎం. సో… సిట్యువేషన్ చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో… చివరికి ప్రభుత్వ ఎత్తుగడే ఫలించేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here