Home News

ఆ కలెక్టర్ల తీరు మంత్రుల మధ్య విభేదాలకు దారి తీసిందా..?

ఏపీలో కొందరు జిల్లా కలెక్టర్ల పై సచివాలయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ప్రత్యేకించి కొన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ప్రభుత్వానికి అదేపనిగా ఫిర్యాదులు అందుతున్నాయి. కృష్ణా, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఈ మధ్య వరుసగా బదిలీ అయ్యారు. కొన్ని జిల్లాల కలెక్టర్లపై ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందాయట. కొందరు కలెక్టర్లయితే మంత్రుల మధ్య వివాదాలకు కారణమయ్యారట. దీంతో త్వరలో జరగబోయే ఐఏఎస్ ట్రాన్స్‌ఫర్లలో కలెక్టర్లు కూడా ఉండొచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది.

జిల్లాల్లో స్థానికంగా ఉండే మంత్రులు.. ఎమ్మెల్యేల మాటను పెడచెవిన పెట్టి కొందరు కలెక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధాన అభియోగం. ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోస్తాలో పనిచేస్తున్న ఓ కలెక్టర్ తన జిల్లాకు చెందిన మంత్రులను.. ఎమ్మెల్యేలను ఎంతమాత్రం పట్టించుకోరట. ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకోవడం లేదట. సమావేశాల వివరాలు సైతం చెప్పకుండా..అదేమంటే ఇంఛార్జ్‌ మంత్రికి తెలియజేశానని ఆన్సర్‌ ఇస్తున్నట్టు చెబుతున్నారు. సమావేశంలో పాల్గొనాల్సిందిగా సూచిస్తూ ఓ జూమ్ లింక్ ఓ మంత్రి ఫోనుకు వచ్చిందట. దీనిపై ముందస్తు సమాచారం లేకపోవడంతో పెద్ద రగడే జరిగినట్లు తెలుస్తుంది.

ఇటీవల వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఓ ఎమ్మెల్యే ఏదో చిన్నపాటి సూచన చేస్తే.. దాన్ని అమలు చేసినందుకు ఓ మండలస్థాయి అధికారిపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. కానీ అదే కలెక్టర్ వ్యాక్సిన్ విషయంలో నిబంధనల విరుద్దంగా వ్యవహరించారని సమాచారం. వ్యాక్సిన్ విషయంలో ఎమ్మెల్యే చేస్తే తప్పు.. అదే తప్పు కలెక్టర్ చేస్తే ఒప్పు అయిపోతుందా..అని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట. సదురు కలెక్టరుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చెప్పినా ప్రతి దానికీ ఏదో ఒక కొర్రీ వేస్తున్నారని చెబుతున్నారు. సీఎం పేషీలో తనకు పలుకుబడి ఉందని.. బాహటంగానే చెప్పేస్తున్నారని మంత్రులు గగ్గోలు పెడుతున్నారట.

ఇదే తరహాలో రాయలసీమ జిల్లాలకు చెందిన ఓ కలెక్టర్ కూడా వ్యవహరిస్తున్నారట. ఓ మంత్రి శాఖాపరంగా చేసిన బదిలీలను మార్చేందుకు కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో ఆ శాఖకు చెందిన మంత్రికి..జిల్లా మంత్రికి గ్యాప్ వచ్చిందట. ఈ విధంగా కొందరు కలెక్టర్లు మంత్రుల మధ్య గొడవలు రాజేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇంఛార్జ్‌ మంత్రులతో సఖ్యతగా ఉంటూ జిల్లా మంత్రులు.. స్థానిక ఎమ్మెల్యేలతో సరిగా వ్యవహరించడం లేదని తెలుస్తుంది. ఇలాంటి కలెక్టర్లను వెంటనే బదిలీ చేయాలని ఒత్తిళ్లు వస్తుండటంతో దీని పైనే అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here