Home News Stories

ఏపీలో పాపం ఆ పార్టీ….అగ్ర నేతకే ఆదరణ కరువు…!

అనుకున్నదొకటి… అయ్యిందొకటి.. అన్నట్లు తయారైంది వారి పరిస్థితి.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది… అదరగొడతామనుకుంటే అసలుకే మోసం వచ్చేలా అయ్యింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పెద్దాయన సభ మీద కూడా పడిందట… ఇప్పటికే ఒకసారి తీవ్ర భంగపాటుకు గురైన సదరు పార్టీ అగ్రజులు… మరోసారి పరువు తీసుకోడమా? సభ పెట్టకుండా మానుకోవడమా? తేల్చుకోలేక పోతున్నారంట… అసలీ ఈ పరిస్థితి చూసి సొంత పార్టీ నేతలే జాలిపడాల…బాధ పడాల అర్ధం కాని పరిస్థితిలోకి జారుకున్నారు.

సాధారణ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేద్దామని ఎలక్షన్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్న కమలం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ లో అనుకోని షాక్ తగిలింది. బీజేపీ ఏపీలో ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టింది… సిక్కోలు టు చిత్తూరు జిల్లా .. ఆ చివరి నుంచి ఈ చివరకు ఊళ్లన్నీ చుట్టేసి …జనాన్ని తమ వైపు తిప్పుకోవాలన్నది ఆ యాత్ర అసలు ఉద్దేశం… అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొదలైన ఈ యాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఆహ్వానించారు రాష్ట్ర నేతలు… ఆయనతో గ్రీన్‌సిగ్నెల్‌ ఇప్పించుకుని బస్సును కదలించారు. ..

అంత వరకు బాగానే ఉంది.. ఆ తర్వాతే అసలు సమస్య ఎదురైంది ఆ పార్టీకి… అంత పెద్ద పార్టీకి.. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా పలాస సభ వెలవెల పోయింది… వందల సంఖ్యలో కూడా జనాన్ని సమీకరించలేకపోయారు కమలనాథులు… వేదిక ఎదురు భాగం అంతా ఖాళీగా కనిపించింది… అది ఫోకస్‌ కాకుండా కవర్‌ చేసుకోవడానికి.. యాత్ర కోసం తెచ్చిన బస్సును వేదిక ముందు అడ్డంగా పెట్టారు… మూడు వేల మంది జనం పట్టే ఆ ప్రాంగణంలో సగానికి పైగా స్థలాన్ని వేదికతో నింపేశారు… మిగిలిన సగం గ్రౌండ్‌ను కూడా జనంతో నింపుకోలేకపోయారు… ఇది చూసి అమిత్ షా ఆగ్రహంతో ఊగిపోయారట. ఇదే సభ…. ఇదేం జన సమీకరణ అంటూ చిటపటలాడారట… వందల సంఖ్యలో కూడా లేని జనాన్ని చూసిన అమిత్ షా.. తూతూమంత్రంగా బస్సు పై నుంచే ప్రసంగం కానిచ్చేసి వేదిక ఎక్క కుండానే వెనుదిరిగారు. ..

కట్ చేస్తే పలాస భ ఎఫెక్ట్ గుంటూరులో నిర్వహించతలపెట్టిన మోడి సభపై గట్టిగానే పడినట్లుకనిపిస్తోంది … అమిత్‌ షా సభే అవమానకరంగా జరగ్గా.. మోడీకి అదే అనుభవం ఎదురవుతుందేమోనని పార్టీ నేతలు భయపడుతున్నారట… షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10న గుంటూరులో మోడీ సభ జరగాల్సి ఉంది… దానికి మరో నాలుగు రోజులే సమయం ఉంది. అయితే ఇంత వరకు హైకమాండ్ నుంచి ప్రధాని సభ పై రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం…

పలాస ఎపిసోడ్ నేపథ్యంలో గుంటూరు సభ పెట్టాలా? లేదా? అన్నది తేల్చుకోలేకపోతోందంట కమలం పార్టీ… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాది గుంటూరే. .. జన సమీకరణ మీద ఆయన హామీ ఇస్తున్నా… ఢిల్లీ పెద్దలు నమ్మకం పెట్టలేకపోతున్నారట. చంద్రబాబును ఢీ కొడతామని సవాళ్లు విసురుతున్న ఏపీ బీజేపీ నాయకులు… కనీసం అగ్రనేతల సభలను కూడా ధీటుగా నిర్వహించలేకపోతుండటం చర్చనీయాంశంగా మారిందిప్పుడు… మొత్తానికి మోడీ సభ పై క్లారిటీ లేకపోవడంతో… ఏర్పాట్లు చేయాలో లేదో అర్థం కాక తలపట్టుకుంటున్నారు స్థానిక నేతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here