Home News

బీజేపీ ఏపీ ఫార్ములా…ఆపరేషన్ సుజనా…!

కమలం ఆపరేషన్‌ సుజనా మొదలుపెట్టిందా ? సుజనాచౌదరికి కీలక బాధ్యతలు అప్పజెప్పి కమ్మ సామాజికవర్గంపై గురిపెట్టిందా? బిజెపి జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ అంటున్నట్లు ఏపిలో టిడిపి మరింత బలహీనపడనుందా? టీడీపీలో చక్రం తిప్పి ఆతర్వాత కషాయ తీర్థం పుచ్చుకున్న మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ? అసలు సుజనాతో టచ్ లో ఉన్న కీలక నేతలు ఎవరు

నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిన తర్వాత టీడీపీకి మోడీ భయం పట్టుకుంది. ఎంపీల దారిలో కొంత మంది ఎమ్మెల్యేలు వెళ్తారని ప్రచారం జరిగినా ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. అయితే టిడిపిలో మాత్రం ఇప్పటికీ బిజెపి భయం కొనసాగుతోంది. ఎవరూ పార్టీ వీడరని పైకి చెపుతున్నా…పార్టీ అంతర్గత సమావేశాల్లో టీడీపీ పెద్దల మత్రం ఈ అంశంపై సీరియాస్ గానే ఆలోచిస్తున్నారు.

కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నప్పుడే తమ పాటే మరికొంత మంది నేతలను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు పార్టీ మారిన నలుగురు రాజ్యసభ ఎంపీలు. అయితే తగిన స్పందన రాకపోవడంతో వెనక్కితగ్గారు. అయితే టీడీపీ నేతలను ఆకర్శించే ప్రయత్నాలను మాత్రం బీజేపీ పెద్దలు ఏమాత్రం ఆపడం లేదు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం తెలుగు తమ్ముల్ల కోసం గాలం వేస్తూనే ఉన్నారు. అసంతృప్తితో ఉన్న కొంత మంది తెలుగు తమ్ముళ్లు స్వచ్ఛందంగా సుజనాతో టచ్ లోకి రాగా. మిగతా వారిని బీజేపీలోకి స్వయంగా ఆహ్వానిస్తున్నారు సుజనా చౌదరి.

మొన్నటి వరకు టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో సైతం కీలకంగా వ్యవహరించిన సుజన 2014 ఎన్నికలప్పుడు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి తీసుకురావడమే కాకుండా వారికి టిక్కెట్లు కూడా ఇప్పించి అండగా నిలిచారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో చక్రం కూడా తిప్పారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపిలు సుజనా చుట్టూ తిరుగుతు పనులు చక్కబెట్టుకునే వారు. పార్టీ కోసం పనిచేసే వారికి అప్పట్లో సజన బాగానే లబ్ది చేకూర్చినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. ఈ ఆర్థిక సంబంధాల కారణంగా టీడీపీలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు అన్ని జిల్లాల్లోని ముఖ్యనేతలతోనూ సుజనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పరిచయాలను ఢిల్లీలోని బీజేపీ పెద్దల ఆదేశాల మేరకు వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం తన పాత పరిచయాలను వాడుకొని అందరితో టచ్ లోకి వస్తున్నట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బిజెపిలో చేరారు. అన్నం సతీష్ అయితే ఏకంగా తన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరారు. ఇప్పుడు వీరితో పాటు మరి కొందరు ఎమ్మెల్సీలు కూడా సుజనా ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం. దీంతో సుజనా కదలికలపై టీడీపీ పెద్దలు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని ఆపరేషన్ ఆకర్శను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా టార్గెట్ చేసిన నేతలను ముందుగానే బజ్జగించే పనిలో పడ్డారు టీడీపీ పెద్దలు. ఇప్పుడు మాజీ ఎంపీ రాయపాటి కూడా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

చేరికలు, చీలికల ఫ్యూహాల్లో పదునెక్కిన రాంమాధవ్ ఏపీపై ఫోకస్ పెట్టగా… ఇప్పుడు సుజనా కూడా తోవడంతో టీడీపీ డిఫెన్స్ లో పడ్డట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ముఖ్యనేత కూడా బీజేపీలో చేరుతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అధినేతకు దగ్గరగా ఉండే ఆ నేత వెళ్లడం ఇప్పటికే ఖాయం అయ్యిందని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఆ నేతకు పార్టీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో అంత తేలిగ్గా పార్టీ మారే అవకాశం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇదేవిధంగా విశాఖ, ప్రకాశం జిల్లా నుంచి కూడా మరో ముగ్గురు కీలక నేతలు బీజేపీతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారాని తెలుస్తోంది. కమలం పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలు కాస్త తర్జన భర్జన పడుతున్నా…ఎమ్మెల్సీలు మాత్రం పెద్దగా ఆలోచించడం లేదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here