Home News

బీజేపీని టెన్షన్ పెడుతున్న లీకు వీరులు..!

బీజేపీ నేతలు ఒక్కోసారి ఉధృతంగా కార్యక్రమాలు చేస్తారు. మరో సందర్భంలో పూర్తిగా సైలెంట్‌ అయిపోతారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత ప్రజా సమస్యలపై పోరాటం పెంచారు. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌లతోపాటు అగ్రనేతలు సమావేశాలు నిర్వహించారు. ముఖ్యులు మాత్రమే హాజరయ్యే ఈ మీటింగ్‌లలో పార్టీ లోటుపాట్లతో పాటు.. భవిష్యత్ ప్రణాళిక చర్చించారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. పార్టీ మీటింగ్‌ల విషయంలో మరింత రహస్యం అవసరమని భావించడం చర్చకు దారితీస్తోంది. ఇందుకోసం ఏపీ బీజేపీ నేతలు తీసుకుంటున్న చర్యలు ఆసక్తిగా మారాయని చెబుతున్నారు.

విజయవాడలో కొద్దిరోజుల క్రితం బీజేపీ ముఖ్యనేతల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో లీకులే ప్రధాన అజెండాగా చర్చ జరిగిందట. పార్టీ సమావేశాల్లో అసలు చర్చ కంటే ముందు.. మీటింగ్ సీక్రసీ పైనే ఎక్కువ చర్చ జరిగింది. సోము వీర్రాజు, పురందేశ్వరి, సత్యకుమార్‌లతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరుకాగా.. ఏపీలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారట. అయితే ఈ చర్చలన్నిటి కంటే ముందు పార్టీ అంతర్గత సమావేశాల సమాచారం లీక్‌ అవుతున్న అంశంపై ఎక్కువ చర్చ జరిగిందట.

పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ స్థాయి నేతలు పాల్గొనే మీటింగ్‌లలో తప్పొప్పుల ప్రస్తావన ఉంటుంది. కీలకమైన అంశాలపై క్లాస్‌ కూడా తీసుకుంటారు. అయితే ఇవన్నీ బయటకు పొక్కడంపై పార్టీలో అసంతృప్తి ఉంది. లీకుల వల్ల అసలు విషయాలకంటే అనవసర అంశాలపైకి పార్టీలో ఎక్కువ చర్చ జరిగి డ్యామేజ్‌ అవుతున్నామన్న ఫీల్‌ నేతల్లో ఉందట. దీంతో మొన్న విజయవాడలో జరిగిన సమావేశంలో మీటింగ్ తరువాత ఎవరూ మాట్లాడకూడదు అని గట్టిగా నొక్కి చెప్పారట. ఒట్టు ఒక్కటి వేయించుకోలేదు గానీ.. దాదాపు అంత వరకు చర్చ వెళ్లింది అంటున్నారు పార్టీ నేతలు. పార్టీ అంతర్గత సమాచారం బయటకు పొక్కడం సరికాదు అనే ఆలోచన మంచిదే అయినా.. ప్రజా సమస్యలపై ఏం చేస్తామో కూడా చెప్పకపోతే ఎలా అని కొందరు అభిప్రాయపడ్డారట.

నిర్ధేశించిన వారు తప్ప ఇతర నేతలు ఎవరూ మీడియాతో మాట్లాడ వద్దని.. లీకులు ఇస్తే ఊరుకునేది లేదని కాస్త కటువుగానే చెప్పారట పార్టీ పెద్దలు. లీకు వీరుల కొంత సమాచారం ఉందేమో కానీ ఈ విషయంలో కొందరు నేతలకు మరీ ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. మీటింగ్‌లలో అక్షింతల వ్యవహారాలు బయటకు రావడం అవమానంగా భావిస్తున్న నాయకులు.. ఈ కొత్త ప్రమాణాలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కోఇంచార్జ్‌గా ఉన్న సునీల్ దేవధర్ ఈ విషయంలో లీడ్ తీసుకున్నారని చెపుతున్నారు. ఇకనైనా ఈ లీకులు ఆగుతాయో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here