Home News Updates

ఏపీ అసెంబ్లీలో కమలనాథుల గళమెక్కడ…

ఏపి అసెంబ్లీలో తమకు అందివచ్చిన అవకాశాన్ని కమలనాథులు వినియోగించుకోలేకపోతున్నారా? … సభకు ప్రధాన ప్రతిపక్షం వైసిపి దూరంగా ఉంటోంది.. దాంతో ఆ పాత్ర పోషించే ఛాన్స్‌ బిజెపికి దక్కింది… అయితే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చేతకావడం లేదా?… సభలో ఉన్న నలుగురి మధ్య ఐక్యత కరువైందా?… శాసన మండలిలో బిజెపి ఎమ్మెల్సీలు అంతోఇంతో చెలరేగుతుంటే …శాసన సభలో మాత్రం ఎమ్మెల్యేలు కనీసం ఆ స్థాయిలో సైతం ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు?

ఏపిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి… ప్రధాన ప్రతిపక్షం వైసిపి సభకు గైర్హాజరవుతోంది.. దాంతో ఆ పాత్ర పోషించే అవకాశం బిజెపికి దక్కింది… సమావేశాల ముందు బిజెపి కూడా అందుకు అనుగుణంగా సిద్దం అయ్యింది… సభలో లేవనెత్తాల్సిన అంశాలు…. ప్రభుత్వాన్ని నిలదీయాల్సి విషయాలపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించారు… కోర్ కమిటీ మీటింగ్ లో సైతం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది.. అయితే తీరా సభ మొదలయ్యాక మాత్రం అనుకున్నంత స్థాయిలో బిజెపి నేతలు ఫైట్ చెయ్యడం లేదు అనే అభిప్రాయం పార్టీ నేతలతో పాటు అందరిలో వ్యక్తమవుతోంది…

వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు బిజెపి సభ్యులు గొడుగులు, రెయిన్‌ కోట్లతో హజరయ్యారు… అసెంబ్లీ, సచివాలయంలో నిర్మాణాల నాణ్యతపై విమర్శలు గుప్పించారు… క్వాలీటీ లేని అసెంబ్లీ అంటూ వినూత్నంగా నిరసన తెలిపారు… తరువాత రోజు సభలో సిఎం సైతం వీరి నిరసన పై మాట్లాడారు…సభలో ఆయా అంశాలపై ప్రత్యేక చర్చ కు పట్టుపట్టే అవకాశం ఉన్నా…. నేతలు గట్టిగా పట్టుబట్టక పోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఉన్న నలుగురిలో కామినేని శ్రీనివాస్ సభకు రావడం లేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండడంతో సభకు హాజరు కావడం లేదు. ఆయన ఉద్దేశ్య పూర్వకంగానే సభకు దూరంగా ఉంటున్నారు అనే టాక్ వినిపిస్తుంది…

నలుగురు సభ్యులు ఉన్న బిజెపికి ప్రతి అంశానికి సంబంధించి సభలో మాట్లాడటానికి సముచిత సమయం కేటాయిస్తున్నారు… అయితే ఆ వచ్చిన సమాయాన్ని నేతలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది… ఇసుక మాఫియా, వైద్య శాఖలో వైఫల్యాలు, రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల ఇక్కట్ల వంటి అంశాలు బిజెపి నేతలు లేవనెత్తినా….ఎఫెక్టివ్ గా జనంలోకి తీసుకు వెళ్లలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది…

సభలో ఫ్లోర్ లీడర్ హోదాలో విష్ణు కుమార్ రాజు అప్పుడప్పుడు గట్టిగానే మాట్లాడుతున్నారు… అయితే ఇతర సభ్యులు సందర్భాన్ని బట్టి కలిసి రావాల్సి ఉండగా ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ..ఫ్లోర్ లీడర్ విష్ణుకుమారరాజుకు మరో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు కొంత గ్యాప్ ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది… మిగిలిన ఇద్దరు కూడా కలిసి రాకపోవడంతో వారు అనుకున్నంత ప్రభావం చూపించలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు .. సభలో వైసిపి లేకపోవడంతో.. ప్రతిపక్ష పార్టీగా బిజెపి నేతలకు బీజేపీ ప్రచారం ఇస్తున్నా…పూర్తిగా తమ నేతలు క్యాష్ చేసుకోవడం లేదని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

బిజెపి నేతలు ఆచి తూచి వ్యవరించడం వెనుక వేరే కారణాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది.. శాసన మండలిలో సోము వీర్రాజు గాని, మరో ఎమ్మెల్సీ మాధవ్ గాని కాస్త గట్టిగానే స్వరం వినిపిస్తున్నారు… కనీసం ఆ దూకుడు కూడా శాసన సభలో కనిపించకపోతుండటం బిజెపి నేతలకు మింగుడు పడటం లేదంట .. దీనిపై మాట్లాడిన మంత్రులు సైతం…అసెంబ్లీ కంటే మండలిలోనే బిజెపి ఎఫెక్ట్ తమకు కాస్త కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు… అయితే సభలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు నాలుగు దిక్కులుగా వ్యవహరిస్తుండటం వెనుక కారణాలు వారికే తెలియాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here