Home News

సభలో ఫైట్లు…లాబీల్లో ముచ్చట్లు…ఇది ఏపీ అసెంబ్లీ సీన్…!

ఏపి అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి .. పరస్పర విమర్శలు, ఆరోపణలతో సభ హోరెత్తిపోతోంది… సభ్యుల అనుచిత వ్యాఖ్యలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంటోంది .. సభలో అంత హడావుడి జరుగుతుంటే.. లాబీల్లోకి వచ్చేసరికి సీన్‌ మారిపోతోంది.. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆలింగనాలు చేసుకుంటూ ముచ్చట్లు పెట్టేసుకుంటున్నారు.. ఒకరికొకరు కితాబులు ఇచ్చుకుంటూ సరదా సంభాషణలకు తెరలేపుతున్నారు …

శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వాయిస్‌ ఎక్కడా వినిపించడం లేదు.. హాట్‌హాట్‌ చర్చలు జరుగుతున్నా .. ఆ ఫైర్‌బ్రాండ్‌ మాత్రం నోరు మెదపడం లేదు.. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం ఒకవైపు జరుగుతోంది.. అందుకే ఏదీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్‌ ఉంది .. ఆ క్రమంలో పయ్యావులు పార్టీ మారే ప్రసక్తే లేదన్నట్లు వ్యాఖ్యానించారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి …

అదేంటి వైసిపి సభ్యుడు ప్రత్యర్ధిని అంతలా వెనకేసుకు వస్తున్నారేంటి అంటారా.. విషయానికొస్తే అసెంబ్లీ లాబీల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, పయ్యావుల మధ్య సంభాషణ చోటుచేసుకుంది .. ఆ టైంలోనే పయ్యావుల పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు .. పయ్యావుల పార్టీ మారతారని తాను భావించడం లేదని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు .. రాజకీయ కుటుంబాల నేపథ్యం తమకుందని ఆయన వ్యాఖ్యానించారు… సోషల్ మీడియా ప్రచారం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటోందన్నారు శ్రీకాంత్ రెడ్డి … అధికార-ప్రతిపక్ష సభ్యులు కలివిడిగా మాట్లాడుకోలేని పరిస్థితులు గతంలో ఉన్నాయన్నారు.. ఇప్పుడు పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందన్నట్లు .. బడ్జెట్ చర్చలో టీడీపీకి 44 నిమిషాలు కేటాయిస్తే.. వారు గంటా 25 నిమిషాలు మాట్లాడరని పేర్కొన్నారు …

గతంలో యనమల బడ్జెట్ రిప్లై ఇచ్చాక ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇచ్చే వారు కాదని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు .. తమ సభ్యులకు సంబంధించి గంట గంటకు అటెండెన్స్ వేస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి అన్నప్పుడు .. పయ్యావుల స్పందించారు .. విప్ లందరి పని ఒక్కరే చేస్తున్నారని పయ్యావుల ఆయనకు కితాబిచ్చారు .. దానికి శ్రీకాంత్‌రెడ్డి కష్టమేం లేదు.. ఉదయం గంట వాకింగ్ చేసేవాడిని అరగంటే చేస్తున్నానని.. మిగతా అరగంట లాబీల్లో చేస్తున్నామని నవ్వుతూ బదులిచ్చారు..

అంతకు ముందు అసెంబ్లీ లాబీల్లో మంత్రి పేర్ని నాని, టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది .. అచ్చెన్నను ఉద్దేశించి అసెంబ్లీలో పేర్ని నాని చేసిన కామెంట్ల ప్రస్తావన వచ్చింది .. తాను సభలో చేసిన కామెంట్లకు సంబంధించి వీడియో క్లిప్పింగులు కూడా చూశానని … తాను అచ్చెన్నాయుడిని ఉద్దేశించి మాట్లాడలేదని.. టెక్కలి ప్రజల మనోభావాలను మాత్రమే ప్రస్తావించానని కవర్‌ చేసుకునే ప్రయత్నం చేసారు మంత్రి పేర్ని… అయినా తప్పు మాట్లాడి ఉంటే క్షమించాలని సభలోనే కోరానన్నారు ..

పేర్నినానితో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ .. ఏ సందర్భం లేకుండా తన పేరు ప్రస్తావించడం ఎందుకని ప్రశ్నించారు .. దానికి ఏ సందర్భం లేకుండానే మా నాయకుడి పేరును ఎన్నో సార్లు మీరు ప్రస్తావించారని సున్నితంగా కౌంటర్‌ ఇచ్చారు పేర్ని.. గతం గతః అని జగన్ చెప్పారని.. అందుకే ఈ ఎనిమిది రోజుల కాలంలో తానెక్కడా తప్పు మాట్లాడలేదని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

ఇచ్చినమ్మ వాయినం.. పుచ్చుకున్నమ్మ వాయినం అన్నట్టు గతంలో మమ్మల్ని విమర్శించినప్పుడు.. ఇప్పుడు తిరిగి ఇవ్వాలి కదా అని చమత్కరించారు మంత్రి పేర్ని… అక్కడే ఉన్న పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే పేర్ని నానికి.. మంత్రి పేర్ని నానికి చాలా మార్పు కనిపిస్తోందని ప్రశంసించారు .. ఎంతో ఎగ్రెసివుగా ఉండే పేర్ని నానిలో మంత్రి అయ్యాక చాలా మార్పు కనిపిస్తోందన్నారు … అచ్చెన్నాయుడిపై కామెంట్స్‌కు సంబంధించి సభలో పేర్ని నాని చాలా హుందాగా వ్యవహరించారని తన వాళ్లతో చెప్పినట్లు పయ్యావుల పేర్కొన్నారు .. తన వల్ల ప్రభుత్వం ఇబ్బందుల్లో పడకూడదు కాబట్టే.. తప్పుంటే క్షమించాలని కోరానని పేర్నినాని వివరణ ఇచ్చారు.. మొత్తమ్మీద అసెంబ్లీ లాబీల్లో అలా సాగిపోతున్నాయి ముచ్చట్లు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here