Home News Politics

ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అట….మాల్యా,నీరవ్ జర దేఖో…!

ఇక సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడానికే వీల్లేదట,ఇక ఏ కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చినా ఇక వారి పై ఎదురు ఏసీబీ కేసులేనట ఇక తమని కాదని దర్యాప్తు చేయాడానికి ఎవరికి చాన్స్ లేదట ఇది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లో….చంద్రబాబు దూకుడు చూస్తుంటే ఇక ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించడమే తరువాయి అనిపిస్తోంది. దీన్ని మోడీ సర్కార్ కి చంద్రబాబు సవాల్ అని ఎంత కీర్తించి,బుకాయించినా సీబీఐ దూకుడుతో చంద్రబాబు బయపడ్డరాన్న టాక్ కూడా అదే స్థాయిలో వినిపిస్తుంది.

దేశ ప్రధాని మోడీ తో పోటీ పడి విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు…. 2014లో అధికారం చేపట్టగానే ఏపీని తొలుత సన్‌రైజ్ కంట్రీ అని ప్రకటించారు. కానీ రాష్ట్రాన్ని ”కంట్రీ” అనడం ఏంటి అని పలువురు సందేహం వ్యక్తం చేయడంతో కాస్త వెనక్కు తగ్గి సన్‌రైజ్ కంట్రీ కాకుండా ”సన్‌రైజ్‌ స్టేట్‌”గా మార్చారు. అప్పటి వరకు సన్‌రైజ్‌ స్టేట్ అంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ అని తెలిసిన వారు తికమక అయ్యేలా చేయగలిగారు బాబు. ఒలింపిక్స్ నిర్వహించేందుకు సంపన్న దేశాలే ఆపసోపాలు పడుతుంటే… కుండ నీళ్లు, పిడికెడు మట్టి కుప్పలు మాత్రమే ఉన్న అమరావతిలో ఏకంగా ఒలింపిక్స్ నిర్వహిస్తానని చెప్పి దేశానికే దిమ్మతిరిగేలా చేశారు.

ఇలాంటి స్టేట్‌మెంట్లు మరొకరు ఇచ్చి ఉంటే మీడియా మొత్తం పిచ్చోడు అని ముద్రవేసి రాతలతో కొట్టేది. కానీ చంద్రబాబు కాబట్టి ఆయన ఏ ప్రకటన చేసినా కెవ్వు కేక అంటూ ఈలలు వేసి చప్పట్లు కొడుతూ మీడియా ఊరేగుతోంది. దీన్ని చూసుకునే కాబోలు ఇప్పుడు ఏపీలోకి సీబీఐని రాకుండా నిషేధం విధించేందుకు తెగబడ్డారు. ఇక కేంద్ర ఉద్యోగుల పైనా ఏసీబీనే దర్యాప్తు చేస్తుందని బుకాయించినా ఏసీబీ స్థాయి ఎంత అన్నది అత్యంత అనుభవం కలిగిన ముఖ్యమంత్రివర్యులు నారావారికే తెలియాలి. ఆదాయపు పన్ను ఎగొట్టి తిరిగే ఏపీలోని పెద్ద మనుషుల పై ఐటీ దాడులు జరిగితే సహించబోమంటున్నారు. ఐటీ అధికారుల ఇళ్లపై తిరిగి తమ ఏసీబీతో దాడి చేయిస్తామంటూ ఆ అధికారాన్ని తనకు తాను కట్టబెట్టుకుంటూ జీవోలు జారీ చేశారు.

సీబీఐ నన్ను కాదు వేధిస్తుంది తెలుగు ప్రజలందరిని అన్నరీతిలో చెప్పిన సీఎం సారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా సీబీఐ చేస్తుందని ఆ బురద కూడా దాని పైనే చాల్లాడు. తప్పనిసరిగా రాష్ట్రాలు అనుమతిస్తేనే సీబీఐ ఎంక్వయిరీ జరుగుతుందన్న పాయింటు పట్టుకుని చంద్రబాబు కేంద్రాన్ని కార్నర్ చేశాడు. సీబీఐ సాధరణ అనుమతినిస్తు రాష్ట్రాలు చేసే జీవోకి తూచ్ అంటూ ఆ దర్యాప్తు మా స్టేట్ కి అక్కర్లేదు అంటు కొత్త జీవో జారిచేశాడు. మాకు కూడా ఏసీబీ అంటు ఒకటుంది ఎలాంటి దర్యాప్తు అయినా చేయగల సత్తా మాకుంది అంటూ సిబీఐ మాకు అక్కర్లేదని తేల్చి పారేశాడు. ఇది లీగల్ గా చెల్లుబాటయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ఇతరాత్ర వ్యవహారాల వరకు సీబీఐ దర్యాప్తుని అడ్డుకోవడమే అన్నది సుస్పష్టం అవుతుంది.

ఎలాగో చంద్రబాబు చేసే పనులను అడ్డుకునే ధైర్యం, న్యాయం చెప్పాల్సిన వ్యవస్థల నుంచి, దర్యాప్తు సంస్థలకు కూడా లేకుండా పోయిన నేపథ్యంలో చంద్రబాబు సీబీఐని నిషేధించి అంతటితో ఆగుతారని అనుకోలేం. సీబీఐ కేంద్రం చేతిలో కీలు బొమ్మ అయినందుకే తాము అనుమతించబోమని జీవో ఇచ్చిన చంద్రబాబు… కేంద్ర ఎన్నికల సంఘం కూడా మోడీ చేతిలో కీలు బొమ్మ అని ఆరోపిస్తే సరి. ఆ సాకుతో ఏపీలో ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి లేకుండా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇస్తే సరి అంటూ ఆంక్షలు విధించినా ఆశ్చర్యం లేదు.


ఏపీలో వ్యవస్థలన్నీ నికార్సుగా… నిటారుగా నడుస్తున్నాయి.. కేంద్ర పరిధిలోని సీబీఐతో పనిలేదంటున్న చంద్రబాబు.. మరి తన భద్రత కోసం కేంద్రం ఇచ్చిన ఆ నల్లపిల్లులను వెంటేసుకుని తిరిగడం ఏంటో!. ఎస్పీజీ పోలీసులను కూడా ఏపీ నుంచి గెంటేసి… జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ తరహాలో నికచ్చిగా పనిచేస్తున్న ఏపీలోని పోలీసులనే పెట్టుకుంటే పోలా!. పనిలో పని ఎలాగో సీబీఐని ఏపీలోకి రాకుండా నిషేధించారు కాబట్టి… సీబీఐ కేసులకు భయపడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారి నుంచి భారీగా ఎంట్రీ ఫీజు, బోర్డింగ్, లాడ్జింగ్ చార్జీలు వసూలు చేసి ఆంధ్రప్రదేశ్‌లో షెల్టర్ ఇస్తే పోలా?. చంద్రబాబు గారు.. మీరు తలుచుకుంటే ఇవన్నీ చేయగలుగుతారు… మీరు చేయగలరు కూడా…! ఒక వేళ కొద్దిగా అనుమానం వచ్చినా మీరు చేయగలరన్న ధైర్యాన్ని మీడియా ఊదరగొట్టక మానదు.

తానిచ్చిన ఒక్క జీవోతో ఇక సేఫ్ అనుకునేంత సీన్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరైన రాష్ట్రంలో ఏదైన విషయంలో అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఎంక్వయిరీ చేయాలంటూ సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇలాంటి జీవోలు ఏవి దాన్ని ఆపలేవు. అయినా కేంద్రం అంత సీరియస్ గా చంద్రబాబు మీద కాన్సంట్రేట్ చేస్తే స్వతంత్ర ప్రతిపత్తి గల ఈడీ,డీఆర్ఐ ఉండనే ఉన్నాయి. తన చుట్టు ఉన్నా వారి అక్రమాల డొంక తవ్వుతున్న సీబీఐని ఈ సాకుతో వెనక్కి పంపితే తాను చేసే పనులన్ని అక్రమమా,సక్రమమా అన్నది అత్యంత అనుభవజ్ఞులు,రాజకీయ దురందరులు చంద్రబాబుకే తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here