ఏపీలో విభజన తర్వాత భూస్థాపితమైన కాంగ్రెస్ లో జవ సత్వాలు నింపారు పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ. విభజన తర్వాత మొదటి సారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన రాహుల్ కర్నూలులో జరిగిన “సత్యమేవ జయతే” సభతో పార్టీకిలో ఒక యాక్టివ్ నెస్ తీసుకొచ్చారు అనే చెప్పుకోవాలి. బహిరంగ సభకు వచ్చిన జనాదరణ చూసి కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. మోడీ మీకేమిచ్చాడు మట్టి తప్ప అంటూ బీజేపీ పై ఘాటైన పంచ్ లు విసిరి కార్యకర్తల్లో జోష్ నింపాడు పార్టీ చీఫ్ రాహుల్…
2019లో అధికారంలోకి రాగానే ఏపీకి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక హోదా అమలు పైనే తన తొలి సంతకం ఉంటుందన్నారు. అయినా ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఏపీకి ఇచ్చే కానుకేం కాదన్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అన్నారు. మోడీలా తాను అబద్దాలు చెప్పడానికి రాలేదన్నారు. హోదా విషయంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ఏపీలో అడుగుపెట్టనని రాహుల్ బీషణ ప్రతిజ్ణ చేశారు.
ఏపీ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య గురించి ఆసక్తికర సంఘటనను వెల్లడించారు రాహుల్ గాంధీ. దామోదరం సంజీవయ్యను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటించే ముందు జరిగిన ఓ సంఘటనను రాహుల్ గుర్తు చేశారు. “అప్పటి ప్రధాని నెహ్రూ… సంజీవయ్యను సీఎంగా చేయాలనుకున్నప్పుడు కొందరు నేతలు ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని నెహ్రూకు ఫిర్యాదు చేశారు. దీంతో నెహ్రూ ఓ సీనియర్ నేతను విచారించడానికి పంపించారు. ఆ నేత సంజీవయ్య స్వగ్రామానికి వచ్చి ఒక చిన్న ఇంటి ముందు కట్టెల పొయ్యపై వంట చేసుకుంటున్న ఒక ముసలావిడ వద్దకు వచ్చి సంజీవయ్య ఇల్లు ఏది అని అడిగారు. ఆమె అదే ఇంటిని చూపించి, తానే ఆయన ఆయన తల్లిని అని చెప్పింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ నేత ఢిల్లీ వెళ్లి నెహ్రూకు ఈ విషయం చెప్పారు. దామోదరం సంజీవయ్య గొప్పదనాన్ని, సామాన్య జీవనాన్ని నెహ్రూకు వివరించారు. దీంతో వారం రోజుల్లోనే నెహ్రూ సంజీవయ్యను ముఖ్యమంత్రి గా ప్రకటించారు. సంజీవయ్య వంటి గొప్ప నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు.” అని రాహుల్ గాంధీ అప్పటి సంఘటనను గుర్తు చేశారు.
రఫెల్పై మోదీని ప్రశ్నిస్తే తన కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం చేయలేకపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. మోదీ ఆర్థిక నేరస్తుడికి యుద్ధవిమానాలు కాంట్రాక్టు ఇచ్చారని బ్యాంకుల నుంచి 45వేల కోట్లు దోచుకున్న గజదొంగ అనీల్అంబానీ అని రాహుల్ మండిపడ్డారు.
కర్నూలు పర్యటన అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ నేతలతో భేటీ అయిన రాహుల్ వారికి చిన్నపాటి క్లాస్ పీకారు. 2014లో చేసిన తప్పులను మళ్లీ చేయవద్దని పొత్తుల విషయం వెంటనే తేల్చేయాలని, వాటి వల్ల పార్టీకి నష్టం కలిగేలా ఉండొద్దన్నారు. దాదాపు గంటన్నర సేపు భేటీ అయిన రాహుల్ గాంధీ నేతల్లో ఐక్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.