పదవులకోసం ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి మాకు అంటే మాకు అంటూ మాజీ ప్రజాప్రతినిధుల ఆరాటపడుతున్నారు. భవిష్యత్ లో ఎదురయ్యే రాజకీయ సమస్యలు ఏకరువు పెడుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం అనంతపురం జిల్లాలో నలుగురు కీలక నేతలు గట్టి ప్రయత్నలే మొదలెట్టారు. ఈ నలుగురు నేతలు గతంలో ఎమ్మెల్యేలుగా పని చేసినవారే..వీరంత ఎవరికి వారే ఎమ్మెల్సీ ప్రయత్నాల్లో తాడేపల్లి చుట్లు రౌండ్లు కొడుతున్నారు.

అనంతపురంజిల్లా వైసీపీలో గురునాథ్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శివరామిరెడ్డి, శమంతకమణి. ఈ నలుగురు జిల్లా వైసీపీలో ముఖ్య నేతలు. ఇక గురునాథ్ రెడ్డి కుటుంబం వైఎస్ ఫ్యామిలీకి దగ్గర. అందుకే గత ఎన్నికల్లో ఆయన సోదరుడికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. గురునాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. జగన్ వెంట నడిచిన వారిలో ముఖ్యుడు. అయితే టీడీపీలోకి వెళ్లారు. దీంతో సీఎం జగన్‌కు గురున్నాథరెడ్డి ఫ్యామిలీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఇటీవల అది మళ్లీ సెట్ అయిందని టాక్. ఈసారి మంచి అవకాశం ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించినా అది దక్కలేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోసం కర్చీఫ్ వేశారు.
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి. గత ప్రభుత్వంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. ఆయన మాత్రం జగన్ వెంటే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఉరవకొండలో ఓడిపోవడం.. స్థానికంగా మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మరో నేత మధుసూదన్‌తో విబేధాలు రావడం వల్ల చాలా పరిణామాలు జరిగాయి. ఈసారి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని విశ్వా కోరినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తనకు కూడా ఎమ్మెల్సీ కావాలని అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట.
మరో సీనియర్ నేత శమంతకమణి. రాజకీయ ప్రవేశం కాంగ్రెస్‌లోనే అయినా.. ఆ మధ్య మండలిలో జరిగిన గొడవ వరకు టీడీపీతో ఉన్నారు. టీడీపీ కూడా చాలా పదవులే ఇచ్చింది. ఏడాది క్రితం వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆమె ఎమ్మెల్సీ పదవి వారం క్రితం ముగిసింది. తాను సొంత పార్టీని విడిచి వచ్చానని.. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారట శమంతకమణి.ప్రస్తుతం ఈ నలుగురు నేతలు తాడేపల్లికి వెళ్లి వచ్చారు. తమకు తెలిసిన యాంగిల్లో పార్టీ పెద్దల వద్దకు వెళ్తున్నారు. తాము ఇన్ని రోజులు చేసిన త్యాగాలు, రేపు తమకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే జరిగే నష్టాల గురించి చెబుతున్నారట.
మరోవ్తెపు అనంతపురం నుంచి హిందూపురం వరకు పరిధి ఉన్న అహుడా ఛైర్మన్ పదవి ఇస్తే.. కొంత వరకు పట్టు సాధించవచ్చని.. ఆర్థికంగానూ కొంచెం గట్టెక్కవచ్చన్న ఆలోచనలతో వీరిలో కొంతమంది ఉన్నారట. ఒకేసారి ఒకే జిల్లా నుంచి ఇంతమందికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం కష్టం. అయినా ఎవరి మెరిట్స్ వాళ్లు చెప్పుకొంటూ తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ కాకుంటే కనీసం దానికి సాటిరాగల నామినేటెడ్ పదవైనా దక్కకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.