Home News Stories

అనంత టిక్కెట్ల పై టీడీపీ క్లారిటీ…!

టీడీపీ కంచుకోటగా ఉన్న అనంత… విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. రికార్డు స్థాయిలో ఏకంగా 14 సీట్లకు గాను 12అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకున్న టీడీపీ ఇప్పుడు అదే ఊపుతో ఎన్నికలకు సిద్ధమవుతుంది. జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను తొమ్మిది స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. మరో ఐదు స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. ఖరారైన తొమ్మిదింటిలో తాడిపత్రికి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థన మేరకు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని ఆ స్థానం నుంచి కొత్తగా రంగంలోకి దించారు. అలాగే అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి పేరు ఖరారు చేశారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటన నేపథ్యంలో ఆ సమీక్ష జరగలేదు. అయినా 14 నియోజకర్గాలకు గాను తొమ్మిది స్థానాల్లో సిట్టింగులకు సీట్లు ఖరారు చేశారు. అందులో తొలిగా ఆరు స్థానాల్లో సిట్టింగులకు వ్యతిరేకంగా ఎవరూ నోరు విప్పలేదు. దీంతో ముందుగా ఆ నియోజకవర్గాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఏకపక్ష ఆమోదం ప్రకటించినట్టయింది. మిగిలిన ఏడు నియోజకవరాలకు సంబంధించి అమరావతిలోనూ అసమ్మతి గళం వినిపించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ సమీక్షలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడి అసమ్మతి వర్గం నోరు విప్పడంతో కొంత గొడవకు దారి తీసింది. అభిప్రాయ సేకరణలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వవద్దంటూ వ్యతిరేకవర్గం గట్టిగా వాదించింది. ఒక దశలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.

పుట్టపర్తి నియోజకవర్గ అభిప్రాయ సేకరణలోనూ ఇలాగే అసమ్మతి వర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తమ గళం విప్పింది. కాగా, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని జిల్లాకు చెందిన ఎస్‌ఆర్‌ కన్సట్రక్షన్స్‌ అధినేత అమిలినేని సురేంద్రబాబు కూడా సీఎం చంద్రబాబును కలిశారు. గుంతకల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇద్దరు మంత్రులకు వారి సిట్టింగ్‌ స్థానాలే కేటాయించారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత, రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు మళ్లీ బరిలోకి దిగనున్నారు.

పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌, ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, అనంతపురం నుంచి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, మడకశిర నుంచి ఈరన్న, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ 2019 ఎన్నికల్లో మళ్లీ బరిలో నిలవనున్నారు. మిగిలిన వాటిలో కళ్యాణదుర్గం, పుట్టపర్తిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై వ్యతిరేకవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇక శింగనమల, కదిరి, గుంతకల్లు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు ఒక్కొక్కరితో విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు. ఆ స్థానాల్లో శింగనమల స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీబాల కోరుతున్నారు. గుంతకల్లు స్థానాన్ని కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా ఆశిస్తున్నా పార్టీలో సీనియర్‌ నాయకుడు, బీసీ వర్గానికి చెందిన వెంకటశివుడు యాదవ్‌ తనకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు.

తాడిపత్రికి చెందిన జేసీ సోదరుల వారసులు రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. ఆది నుంచి తాము చెబుతున్న మాటలను జేసీ సోదరులు నిజం చేసుకున్నారు. తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దించుతామని, తాము పోటీలో ఉండబోమని కొంతకాలంగా వారు బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. ఇప్పుడదే నిజమైంది. జిల్లా సమీక్షలో భాగంగా ముందుగానే సీఎం చంద్రబాబునాయుడు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌ కుమార్‌రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు అస్మిత్‌ రెడ్డిని తన వద్దకు పిలుచుకుని వారి భుజాలపై చేతులు వేసి ఫోటోలు దిగారు. దీంతో తాడిపత్రి ఎమ్మెల్యే స్థానానికి అస్మిత్‌రెడ్డి, అనంతపురం పార్లమెంటు స్థానానికి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పేర్లు ఖరారయ్యాయి.

అనంతపురం నియోజకవర్గ సమీక్షలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వర్గం బాయ్‌కాట్‌ చేసింది. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గం మాత్రం ఆయనకు అనుకూలంగానే తమ అభిప్రాయాలు రాతపూర్వకంగా పరిశీలకులకు సమర్పించారు. సమీక్షల్లో పరిశీలకులు వన్‌ టు వన్‌ పద్ధతిలో అభిప్రాయాలు సేకరించగా అనంతపురం నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా రాతపూర్వకంగా అభిప్రాయాలు తెలియజేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి వర్గానికి చెందిన జకీవుల్లా, జయరాంనాయుడు తదితరులు సమీక్షను బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారు. అయినా ఆ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికే కేటాయించారు.

హిందూపురం ఎంపీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి తన నియోజకవర్గంలో ఏకపక్ష ఆమోదం లభించింది. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ ఈసారి హిందూపురం పార్లమెంటు స్థానానికి పార్థసారథిని రంగంలోకి దించాలని చంద్రబాబుకు లేఖలు ఇచ్చినట్టు సమాచారం. ఆయనే బలమైన అభ్యర్థి అని కూడా వారు తమ అభిప్రాయాలు వెల్లడించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి.. బీకే పార్థసారథి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఎంపీగా వెళ్లడానికి అయిష్టత చూపిస్తున్నారు. కాగా, హిందూపురం సిట్టింగ్‌ ఎంపీ నిమ్మల కిష్టప్ప వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు యువనేత పరిటాల శ్రీరాం కూడా ఈసారి ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేయడానికి సుముఖంగా ఉన్నారు. హిందూపురం ఎంపీ సీటు గానీ, మరోచోట ఎమ్మెల్యే సీటు గానీ ఆశిస్తున్నారు.

పుట్టపర్తి స్థానాన్ని తన కుమారుడికి కేటాయించాలని ఎంపీ నిమ్మల కిష్టప్ప కోరుతున్నారు. అదే జరిగితే హిందూపురం పార్లమెంటు స్థానాన్ని ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన కదిరి ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాకు కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ప్రకారం కళ్యాణదుర్గం, శింగనమలలో కూడా సామాజికవర్గ సమీకరణలు మారే అవకాశాలు లేకపోలేదని వారు వివరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here