Home News Politics

అనంత సమరంలో గెలిచి నిలిచేదెవరు…!

గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన అనంతపురం జిల్లాలో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒ‍కప్పుడు కాంగ్రెస్ కు బలం ఉన్న అనంతపురం పార్లమెంట్ లో నేడు టీడీపీ-వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నాయి. పార్లమెంట్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఎంపీ జేసీ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నాయి. అధినేత వద్ద పట్టుబట్టి తాను అనుకున్న వారికి సీట్లు ఇప్పించడం, తన కుమారున్ని ఎంపీ బరిలో దింపడం, తమ్ముని కుమారున్ని తాడిపత్రిలో నిలపాడు. దీనికి తోడు టీడీపీ రెండు చోట్ల సిట్టింగులను మార్చడంతో తలనొప్పిగా మారింది. వైసీపీకి కూడా రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తుల బెడద ఉంది. అయితే అధికారపార్టీలో ఉన్న విబేధాలను వైసీపీ ఎంత వరకు క్యాష్ చేసుకుంటుంది.. రెబల్స్ ను టీడీపీ ఎలా కట్టడి చేస్తుందన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. వార్ వన్ సైడ్ కాదు.. మరో సైడ్ కూడా చూపిస్తున్న అనంతపురం పార్లమెంట్ పై స్పెషల్ రిపోర్ట్….

అనంతపురం…. టీడీపీకి కంచుకోట లాంటి ప్రాంతం. జిల్లాలో మొత్తం రెండు పార్లమెంట్ లు, 14అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో హిందూపురం పార్లమెంట్ టీడీపీకి ఎప్పటి నుంచో పెట్టని కోటగా ఉంది. ఇక అనంతపురం పార్లమెంట్ విషయానికొస్తే ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కు బలమైన ప్రాంతం. అయితే గత ఎన్నికల్లో మాత్రం ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. ముందుగా అనంతపురం స్వరూపం గురించి చెప్పుకుంటే.. పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సుమారు 18లక్షల మందిపైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బోయ సామాజిక వర్గం వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరే పార్లమెంట్ అభ్యర్థిని డిసైట్ చేయగలరు. గత ఎన్నికల ఫలితాలను చూస్తే ఇక్కడ టీడీపీ పార్లమెంట్ తో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. వీటిలో టీడీపీ హవా ఉండటం ఒకటైతే.. ఎంపీ జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరడం. రాష్ట్ర విభజన తరువాత ఎంపీ జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. దివాకర్ రెడ్డి ఎంపీ గాను ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దీనికి తోడు ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పి వారి స్థానాల్లో వారసులను దింపారు. అయితే ఎంపీ జేసీ మాత్రం సీట్ల కేటాయింపులో చాలా పట్టుబట్టారు. సిట్టింగులను మార్చాలంటూ ఏకంగా మూడు నియోజకవర్గాలను సూచించారు. దీనిపై అధిష్టానం చివరి వరకు పేచీ నడిచింది. చివరకు కళ్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గంలో సిట్టింగులను మార్చి ఎంపీ జేసీ సూచించిన వారికి సీట్లు కేటాయించారు. మరో రెండు చోట్ల అధ్యక్షుడు చంద్రబాబు అన్ని విషయాలు అంచనా వేసి సిట్టింగులనే కొనసాగించారు. నియోజకవర్గాల వారిగా పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే…

తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి జేసీ హవా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. వైసీపీ తరుపున జేసీ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తమకు పట్టం కాడుతుందని జెసీ ధీమాతో ఉన్నారు. టిడిపిలో అసంతృప్తి , ప్రభుత్వంప్తెన వ్యతిరేకత తమకు కలిసి వస్తుందన్న భావనలో వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి ఉన్నారు. ఉరవకొండలో గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన పయ్యావుల కేశవ ఈసారి కూడా టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మరోసారి కేశవ్ తో తలపడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం , సాగునీటి విషయంలో నియోజకవర్గానికి ప్రాధ్యానత లభించేలా చూసుకోవడం కేశవ్ కు కలిసి వచ్చే అంశం. విశ్వేశ్వరరెడ్డి నుంచి పోటీ ఎదురు అవుతున్నా , మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయులు పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అన్నదీ ప్రశ్నార్థకంగా మారింది.

రాయదుర్గం నుంచి మరోసారి బరిలో దిగుతున్న మంత్రి కాలువశ్రీనివాసులకు ఇంటిపోరు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్సీ మెట్టుగోవింద రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరాడు.మరో వైపు కాల్వ ప్తె తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి , కాల్వ మధ్య సయోధ్య కుదరడం కొంత మేరకు కాలువకు ఊరట కల్గిస్తోంది. ఇక్కడ వైసీపీ తరుఫున కాపురామచంద్రారెడ్డి కాలువకు గట్టి పోటీ ఇస్తున్నారు. బోయ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండటం కాలువకు కలిసొచ్చినా.. టిడిపిలోని అసంతృప్తుల ప్రభావం ఏ మేరకు పనిచేస్తోందన్న భావనలో పార్టీ నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. గుంతకల్లు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మరోసారి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఎంపీ జేసీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చిన మధుసూదన్ గుప్తాకు టికెట్ ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాడు. ఆర్థికంగా బలంగా ఉండటం, మాజీ ఎమ్మెల్యేగా పనిచేయడం వంటి అంశాలు గుప్తాకు కలసి వస్తాయని చంద్రబాబుకు వివరించారు. కాని ఇక్కడ బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారని… గౌడ్ కు టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా మెసేజ్ పోతుందని చంద్రబాబు గౌడ్ కే టికెట్ ఇచ్చారు. దీంతో మధుసూదన్ గుప్తా చివరి నిమిషయంలో జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. నామినేషన్ రోజు భారీగా జనాన్ని సేకరించి తన బలాన్ని చాటారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఓట్లు మధుసూదన్ గుప్తా భారీగానే చీలుస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇక వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి గతంలో ఓడిపోవడంతో సానుభూతి ఉంది.

అనంతపురం అర్బన్ అసెంబ్లీకి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అసంతృప్తులను ఒక్కటి చేస్తూ తన బలం పెంచుకునే పనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. వైసీపీ తరుపున మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. వాస్తవానికి టిక్కెట్ కేటాయింపులు జరుగుతున్న సమయంలో వైసీపీలోనే ఎక్కువ గ్రూపులు ఉండేవి. కాని టికెట్ ఇచ్చే సమయానికి అధిష్టానం అసంతృప్తులకు బాగా చెక్ పెట్టింది. ఇక జనసేన అభ్యర్థి వరుణ్ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, కమ్యూనిస్టుల పొత్తు ఉండటంతో ఆయన ఎవరి ఓట్లకు ఎసరు పెడుతారన్నది తేలడం లేదు.ఈ నియోజకవర్గంలో కాపు , మైనార్టీల ఓట్లే కీలకం కానున్నాయి. రాష్ట్రంలోనే టీడీపీని అత్యంత ఇబ్బంది పెట్టిన నియోజకవర్గం కళ్యాణదుర్గం. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరాయచౌదరి, ఆయన కుమారుడు మారుతీచౌదరిపై ఉన్న వ్యతిరేకత కారణంగా అధిష్టానం టికెట్ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. దీంతో హనుమంతరాయచౌదరి పార్టీ బీ-ఫారమ్ ఇవ్వకపోయిన నామినేషన్ వేశారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఇక్కడ సురేంద్రబాబు, ఉమామహేశ్వర్ నాయుడు టికెట్ కోసం పోటీ పడ్డారు. ఎంపీ జేసీ సూచన మేరకు ఉమామహేశ్వర్ కు టికెట్ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇక్కడి నుంచే బరిలో దిగుతున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కాస్త క్యాడర్ ఉండటం రఘువీరాకు కలసివచ్చేలా ఉన్నాయి. వైసీపీ నుంచి ఉషాశ్రీ చరణ్ కూడా గట్టి పోటీనే ఇస్తుండటంతో ఇక్కడ త్రిముఖ పోరు ఏర్పడింది.

శింగనమల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాలకు చంద్రబాబు చెక్ పెట్టారు. ఎంపీ జేసీ సూచన మేరకు బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు. అయితే వీరికి ఎమ్మెల్యే యామినీబాల వర్గం సహకరించడం లేదు. దీనికి తోడు శ్రావణి తొలిసారిగా ఎన్నికల బరిలో ఉండటం, ఎన్నికల మేనేజ్ మెంట్ లో ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలియడం లేదు. ఎస్సీ రిజర్వ్ డ్ అయిన ఇక్కడ వైసీపీ అభ్యర్థినిగా మరోసారి జొన్నలగడ్డ పద్మావతిని బరిలో దింపుతోంది. గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడినా ప్రజలకు దగ్గరగా ఉండడం వైసీపీ అనుకూలం. మాజీ మంత్రి శైలజానాథ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా… ఆయన ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. టీడీపీలో ఓ వర్గం నేతలు బండారు శ్రావణికి సహకరించడం లేదన్న ఆరోపణాలు నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా అసంతృప్తులను నచ్చజెప్పి కలిసి పనిచేయాలని సూచించారు. మరో యల్లనూరు , పుట్లూరు బాధ్యతలను జెసి సోదరులే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.మరో వ్తెపు టీడిపిలో అసంతృప్తులను తమ వ్తెపు లాగేసుకుంటూ వైసీపీ ముందుంది.

ఇలా నియోజకవర్గాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్న కారణంగా ఈ ప్రభావం పార్లమెంట్ అభ్యర్థి పై పడే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఎంపీ జేసీ తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే పార్లమెంట్ మొత్తం పర్యటించడం.. చాలా చోట్ల సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వాటితో పాటు నాయకులందర్నీ కలుపుకుని పోతున్నారు. వైసీపీ నుంచి మాజీ ప్రభుత్వ అధికారి తలారి రంగయ్య పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా బోయ ఓటర్లు ఉన్నారు. జేసీ పవన్ మంచి ఊపులో ఉన్నా… సిట్టింగ్ లను మార్చిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిప్తె లెక్కలేసుకుంటున్నారు. అనంతపురం పార్లమెంట్ లో టీడీపీ-వైసీపీలు నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. టీడీపీ రెబల్స్ ను, అసంతృప్తులను దారిలోకి తెచ్చుకోగలిగితే విజయం టీడీపీదే. అందులో సక్సెస్ కాలేకపోతే వైసీపీ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here