Home News

జెడ్పీ పీఠంకోసం అనంతలో వైసీపీనేతల వర్గపోరు

స్థానిక ఎన్నికల్లో గెలిచామన్న సంతోషంలో ఉన్న అనంతపురం జిల్లా వైసీపీ నేతలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పదవులు ఆశిస్తున్నవారు ఎక్కువై వారిని బుజ్జగించలేక తలపట్టుకుంటున్న పరిస్థితి ఉందట. మున్సిపాలిటీలలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు కౌన్సిలర్ల ఎంపిక పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికీ కొన్నిచోట్ల పదవిరాక ప్రెస్‌మీట్లు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలపై లోకల్‌ లీడర్స్‌ ఫైర్‌ అవుతున్నారు. అది కొనసాగుతుండగానే జడ్పీ పీఠంపై కుస్తీ మొదలైంది. జడ్పీ ఛైర్‌పర్సన్‌ బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ కుర్చీ కోసం బీసీ మహిళల్లోని చాలామంది పోటీ పడుతున్నారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి తమకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతు పార్టీలో రచ్చ చేస్తున్నారు.

జడ్పీ పీఠం కోసం బోయ, కురుబ, యాదవ, చేనేత సామాజికవర్గాల నుంచి పోటీ ఎక్కువగా ఉందట. ఎన్నికలు ముగిసినా.. ఓట్ల లెక్కింపు ఇంకా చేపట్టలేదు. అయినప్పటికీ గెలుపుపై ధీమాగా ఉన్న జడ్పీటీసీలుగా పోటీచేసిన అభ్యర్థులు ముందు నుంచే కర్చీఫ్‌లు వేసే పనిలో పడ్డారు. ఆత్మకూరు అభ్యర్థి బోయ గిరిజమ్మ, తనకల్లుకు చెందిన జక్కల జ్యోతి రేస్‌లో ఉన్నారట. ఇప్పుడు కూడేరుకు చెందిన అశ్విని హరీష్‌, రాప్తాడుకు చెందిన పసుపుల హైమావతి కూడా పోటీకిలోకి వచ్చారట. జిల్లాలో కురుబ, బోయ సామాజికవర్గాలు ఎక్కువ. బోయ సామాజికవర్గానికి చెందిన వారిలో నలుగురికి మున్సిపల్‌ ఛైర్మన్లగా అవకాశం కల్పించినందున జడ్పీ పీఠం తమకే ఇవ్వాలంటున్నారు కురుబ సామాజికవర్గం నేతలు.

బీసీలంటే కేవలం రెండు సామాజికవర్గాలు కాదనే వాదన తెరపైకి తెస్తున్నారట. వెనకబడిన వర్గాల్లోని మిగతా వారికి కూడా పదవుల్లో ఛాన్స్‌ ఇవ్వాలని గట్టిగానే డిమాండ్‌ చేస్తున్నారట. ఈ విధంగా బీసీల్లోని కుల సంఘాల నాయకులు ఎవరికి వారుగా విడిపోయి.. పార్టీ నేతలకు అల్టిమేటాలు జారీ చేస్తుండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించేందుకు సాహసం చేయడం లేదట. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ ఉందట. పదవులు ఆశిస్తూ.. డిమాండ్లు పట్టుకుని తమ దగ్గరకు వచ్చేవారికి.. ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదుగా.. వచ్చాక చూద్దాం అని సర్దిచెప్పి పంపిస్తున్నారట. ఓట్ల లెక్కింపు కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉండటంతో ఇప్పటికి సమస్య నుంచి కొంత రిలీఫ్‌ లభించినట్టు సంతోష పడుతున్నారట. మరి.. ఫలితాల వెల్లడి తర్వాత అధికారపార్టీ నేతలు ఎవరిని బుజ్జగిస్తారో.. ఇంకెవరికి మోదం కలిగిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here