Home News Stories

అమరావతి భూములపై ఆగని వివాదం! ఇప్పుడు ఏం జారుతోందో తెలుసా?

అమరావతి భూముల వివాదం కార్చిచ్చులా రగులుతూనే ఉంది. తాజాగా ఉన్న భూములకు మించి రిజిస్ట్రేషన్ల వ్యవహారంలోనూ అమరావతి భూముల మాట వినిపిస్తోంది. అమరావతి భూములపై వివాదం ఇప్పుడు సుప్రీంలో ఉంది. అమరావతి భూకుంభకోణంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణ, సిట్ ఏర్పాటు, దర్యాప్తు ప్రక్రియను నిలువరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది ఏపీ ప్రభుత్వం. దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లోగా ప్రతివాదులైన టీడీపీ నేతలు కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. అమరావతి భూ కుంభకోణంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ పరిశీలన మేరకు ఏర్పాటైన సిట్‌ దర్యాప్తును నిలిపివేయాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు వేసిన రిట్‌ పిటిషన్‌తో.. దర్యాప్తుపై స్టే ఇచ్చింది హైకోర్టు. దీనిపై సుప్రీంలో పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం ..గట్టిగానే తన వాదన వినిపించింది.

అమరావతి భూముల వివాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంలో వాదనలు వినిపించారు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, శేఖర్‌ నాఫడే, మెహ్‌ఫూజ్‌ నజ్కీ. దర్యాప్తు నిలిపివేస్తై ఏపీ హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీచేసిందన్న వాదన వినిపించారు. అవకతవకలు జరిగితే వాటిపై దర్యాప్తు జరపొద్దాఅని ప్రశ్నించారు దుష్యంత్‌ దవే. ఇలాంటి సందర్భాల్లో దర్యాప్తు కొనసాగించాలంటూ గతంలో సుప్రీం ఇచ్చిన ఉత్వర్వులను ప్రస్తావించి ప్రతివాదులకు నోటీసులివ్వాలని ధర్మాసనాన్ని కోరారు… ప్రభుత్వ న్యాయవాది దవే. దీంతో.. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ… ప్రతివాదులైన టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులకు నోటీసులు జారీచేసింది సుప్రీం ధర్మాసనం. నాలుగు వారాల తర్వాత సుప్రీం తుది విచారణ చేపట్టబోతోంది. ఇప్పటికే న్యాయవ్యవస్థలో కొందరు జడ్జీల తీరును తప్పుపడుతూ ఏకంగా సుప్రీం చీఫ్‌ జస్టిస్‌కే లేఖరాశారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. హైకోర్టులో తలెత్తుతున్న న్యాయపరమైన చిక్కులకు…అత్యున్నత న్యాయస్థానంలోనే పరిష్కారం వెతుక్కోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది వైసీపీసర్కారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here