Home News Stories

ఆలస్యం అమృతం విషం…హర్షకుమార్ కి అలా జలక్ ఇచ్చారా…!

కోస్తాలో దళిత నేతల్లో అగ్రగణ్యుడు అమలాపురం మాజీ ఎంపి హర్ష కుమార్. చివరి నిమిషం వరకు ఏ పార్టీ లోకి వెళ్ళి ఆయన పోటీ చేస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. చివరికి నామినేషన్ల ఘట్టం ప్రారంభానికి ముందు అందరిని ఆశ్చర్య పరుస్తూ హర్ష కుమార్ కాకినాడ బహిరంగ సభకు వచ్చిన తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పసుపు కండువా కప్పేసుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని హర్ష కుమార్ ఎపిసోడ్ మరోసారి నిరూపించింది కూడా. తన రాజకీయ జీవితం మొత్తం చంద్రబాబు పై పోరాటం చేసిన హర్ష కుమార్ ఈ తరహా నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. అందరు నేతల్లాగే ఆయన కూడా పార్టీ మారడాన్ని ఏ ఒక్కరు తప్పుపట్టకపోయినా చంద్రబాబు కు పాదాభివందనం చేయడాన్ని వైసిపి శ్రేణులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున తప్పు పట్టాయి. ఆయన అభిమానులు సైతం దీన్ని జీర్ణించుకోలేకపోయారు.

హర్ష కుమార్ టీడీపీ లో చేరిక అంశం అలా వివాదాస్పదంగా ముగిసినా అమలాపురం ఎంపి టికెట్ ఆయనకే దక్కుతుందని అంచనా వేశారు ఆయన అభిమానులు. అయితే అనూహ్యంగా దివంగత మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ కి కేటాయించి షాక్ ఇచ్చారు చంద్రబాబు. దీనికి వెనుక చాలా కథే నడిచినట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. బాలయోగి కుమారుడికి తొలుత టికెట్ ఖాయమని భావించినా చివరి దశలో హర్ష కుమార్ టిడిపి తీర్ధం పుచ్చుకోవడంతో ఆ సీటును మాజీ ఎంపి కే కేటాయించారు చంద్రబాబు.

అయితే ఈ సమాచారం తెలుసుకున్న జీఎంసీ బాలయోగి సతీమణి మాజీ ఎంపి విజయ కుమారి రంగ ప్రవేశం చేసి చంద్రబాబు ముందు పెద్ద పంచాయితీ పెట్టినట్లు టాక్ నడుస్తుంది. తన కుమారుడికి టికెట్ కేటాయించకపోతే తాను ఆత్మహత్యకు దిగుతామనే రేంజ్ లో బెదిరింపులకు దిగడంతో బాబు కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఆమె తన బెదిరింపులకోసమైనా ఆత్మహత్యాప్రయత్నం చేసినా టిడిపి పరువు ఎన్నికల సమయంలో బజారున పడటమే కాకుండా దళితులను ప్రసన్నం చేసుకునే వ్యూహం మొత్తం తలకిందులు అవుతుందని చంద్రబాబు ఆందోళన చెందారని తప్పని పరిస్థితుల్లో హరీష్ కే సీటు ఖరారు చేసి హర్ష కు తిరిగి అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని హామీనిచ్చినట్లు తెలియవస్తుంది.

చేతికి వచ్చిన టికెట్ కాస్తా చేజారిపోవడంతో హర్ష కుమార్ వర్గీయులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. తదుపరి రాజకీయ కార్యాచరణ రెండు మూడు రోజుల్లో ఏమి చేయాలన్నదానిపై తర్జన భర్జన పడుతున్నారు. భేషరతుగా పార్టీలో చేరడంతో ఇప్పటికిప్పుడు తాజా పరిణామాలపై స్పందించేందుకు వారు సిద్ధంగా లేరు. ఇక కనిపించినా, ఫోన్ లో పలకరించిన టిడిపి నేతలకు హర్ష గట్టిగా క్లాస్ పీకుతున్నట్లు సమాచారం. తనను తన కుమారుడిని రోడ్డుపైకి తెచ్చి ఎందుకు నిలబెట్టారని ఆయన నిలదీస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి టిడిపి అగ్రనేతలు మౌనం వహిస్తూ ఉండటంతో మాజీ ఎంపి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆయన సహచరులు చెబుతున్నారు.

తన లక్ష్యం కోసం ఏ పార్టీని ఎంపిక చేసుకోవాలనే అంశంపై హర్ష కుమార్ చాలా కాలంగా క్లారిటీ తెచ్చుకోలేక పోవడమే తాజా పరిస్థితి కి కారణంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ, దళిత ఉద్యమాలనే నమ్ముకుని తన రాజకీయ భవిష్యత్తు కి ఢోకా వుండబోదన్న హర్ష అతి ఆత్మవిశ్వాసమే టికెట్ మిస్ కావడానికి రీజన్ అన్నది వారి వాదన. టిడిపి అమలాపురం ఎంపి గా హరీష్ పేరు గత ఏడాదిగా ప్రచారంలో వుంది. అప్పుడైనా మేల్కొని ముందుగా పసుపు పార్టీలోకి చేరివుంటే హరీష్ అంశం టిడిపి పక్కన పెట్టేసి ఉండేదన్న చర్చ నడుస్తుంది. ఏ పార్టీలో చేరకుండా ఉన్నా లేక తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లినా హర్ష కుమార్ కి హుందాగా ఉండేదని కానీ దారుణమైన ఈ భంగపాటు కుంగుబాటుకు దారితీయకుండా ఉండేదని అంటున్నారు. హర్ష టికెట్ కు హామీ లభించకుండా టిడిపి కి వెళ్లి దెబ్బతినడం ఆయన స్వయంకృతమే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here