ఒక్క నాయకుడి మరణం కర్నూలు రాజకీయాన్ని మార్చేసింది. భూమా బతికి ఉన్నన్నాళ్లూ కన్నెత్తిచూడని వాళ్లు కూడా కన్నెర్ర చేస్తున్నారంటే కాలమహిమ. ఎవరో వేలెత్తిచూపారని కాదుగానీ…నాగిరెడ్డికున్న అనుభవం, ఆయనకున్న వ్యూహం వారసులకు ఉండాలని ఏముంది. ఆళ్లగడ్డ సాక్షిగా అదే జరుగుతోంది. నంద్యాలలో కూడా ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. ఒకప్పుడు తండ్రికి కుడిభుజంలా ఉన్న నాయకుడు ఇప్పుడెందుకు ఎదురుతిరుగుతున్నాడో, తన కూతురితో కూడా ఎందుకు తిట్టిస్తున్నాడో అర్ధంచేసుకునేంత రాజకీయపరిపక్వత అఖిలప్రియకు ఉండుంటే…వ్యవహారం అసలు ఇంతదూరం వచ్చేదే కాదేమో.
తల్లి మరణం తర్వాత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయ్యారు భూమా అఖిలప్రియ. తండ్రి మరణం తర్వాత ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎమ్మెల్యే అయ్యారు. కన్నుమూసేదాకా నెరవేరని భూమా కోరికను మంత్రి పదవిని అందుకుని ఆమె కూతురు తీర్చారు. అంతా బానే ఉంది కానీ…తండ్రి తదనంతర రాజకీయ వారసత్వంతో పాటు ఆయన అనుభవాన్ని, అనుచరుల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్న విషయాన్ని విస్మరించడమే అఖిలప్రియకు సమస్యలు కొనితెచ్చింది. భూమా అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్ సమయంలోనే అడ్డం తిరిగారు. ఇప్పుడు ఏకంగా నంద్యాల నాకేనంటున్నారు. ఆళ్లగడ్డలో అమీతుమీకి సిద్ధమంటున్నారు. సైకిల్‌ర్యాలీలో తనపై జరిగిన దాడితో ఏవీ సుబ్బారెడ్డి రెచ్చిపోయారు. కొత్తగా ఆయన కూతురు తెరపైకొచ్చింది. అక్కకి సపోర్ట్‌గా అఖిల చెల్లెలు మౌనిక నోరిప్పింది. ఇంకేముందీ..కావాల్సినంత రచ్చ.
కర్నూలుజిల్లాలో బలపడాలనుకున్ని వైసీపీ ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పితే ఈ గొడవలతో అసలుకే మోసమొచ్చేలా ఉందని కంగారుపడ్డారు టీడీపీ అధినేత. అందుకే అర్జంట్‌గా వచ్చేయమని ఇద్దరికీ కబురుపెట్టారు. కానీ ఏవీ మాత్రమే వచ్చారు. అఖిలప్రియ అడ్డం తిరుక్కుందా అన్న టెన్షన్. మొండికేసిన అఖిలప్రియ నేతల పిలుపుతో మూడోరోజు బాబు పంచాయితీకి హాజరయ్యారు. ఆయనేం అడిగారో..వీళ్లేం చెప్పారోగానీ…మొత్తానికి చంద్రబాబు మార్క్ రాజీ కుదిరిందంటున్నారు. అఖిల, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ మీడియా ముందుకొచ్చి కలిసిపనిచేస్తాం అని చెప్పినా మెడమీద కత్తిపెట్టి చెప్పించినట్లే ఉంది. అసలే సీమ..ఆపై ఆళ్లగడ్డ. అంతీజీగా రాజీ పడ్డారంటే జనం ఎవరూ నమ్మట్లేదు. నమ్మలేరు కూడా. వచ్చేది ఎన్నికల సీజన్. ఒకేఒరలో రెండు కత్తులు పెట్టానని చంద్రబాబు అనుకుంటున్నా ప్రాక్టికల్‌గా అది ఇంపాజిబుల్. మున్ముందు పార్టీ అధినేత ఇంకెన్ని పెదరాయుడు పంచాయితీలు చేయాల్సి ఉంటుందో.?