Home News Stories

ఆదిలాబాద్ జిల్లాలో హస్తం టిక్కెట్ వీరికేనా…?

ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్ టికెట్‌ ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది … పార్టీలో ముందు నుంచి ఉన్నవారి మధ్యే పోటీ తీవ్రంగా ఉంటే .. వలస వచ్చిన నేతలతో అది మరింత ముదిరిపోయింది .. దాంతో ఎవరికి టికెట్‌ దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది.. దాంతో టికెట్‌ దక్కని మిగిలిన ఆశావహులు పార్టీకి సహకరిస్తారా? .. వలస నేతలు బరిలో నేతలు నిలిస్తే పరిస్థితి ఏంటి?… ప్రస్తుతం కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చంతా దీని గురించే…అసలు హస్తం పార్టీ నుంచి ఎవరి చాన్ ఎలా ఉంది….

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇన్నిరోజులు గులాబీ పార్టీలోనే అసమ్మతి గుబులు కనిపించింది .. అయితే తాజాగా కాంగ్రెస్ లో దానికి మించిన వర్గపోరు ముదిరే పరిస్థితి కనిపిస్తోంది .. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ లో ఇప్పటికే ప్రతినియోజవర్గంలో రెండు మూడు గ్రూపులున్నాయి … ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్‌ కావడంతో కండువాలు మార్చే నేతలతో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 2 మినహా మిగిలిన చోట్ల టికెట్‌ ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది.. అటు ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలు.. ఇటు వలస నాయకులు పార్టీ టికెట్ల కోసం హస్తిన స్థాయిలో తమ ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు..

ఖానాపూర్ , చెన్నూర్ , సిర్పూర్ , బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కొత్తవాళ్లు పార్టీ కండువా కప్పుకున్నారు.. ఎన్నికల కోసమే కొంతమంది పార్టీలు మారితే … ఉన్న పార్టీలో అన్యాయం జరిగిందనే అక్కసులో ఇంకొందరు చేతిలో చేయ్యేసారు.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ముగ్గురు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు.. అందులో గండ్ర సుజాత, భార్గవ్ దేశ్ పాండేతో పాటు మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి తీవ్ర ప్రయత్నాల్లో ఉండగా తమకో అవకాశం రాకపోతుందా అని మరో నాయకుడు ఈ మధ్యే దూకుడు పెంచారు …ఇక్కడ సుజాతకే టికెట్ అని ప్రచారం ఉండగా తనకే వస్తుందన్న ధీమా రామచంద్రారెడ్డిలో కనిపిస్తోంది .. మరోవైపు దేశ్‌పాండే తానే బరిలో ఉంటానన్న నమ్మకంతో ఉన్నారు ..

ఖానాపూర్ లో కాంగ్రెస్ నుంచి దాదాపు అరడజను మందికిపైగా ఆశావాహులుండగా ఇటీవలే రమేష్ రాథోడ్ ఫ్యామిలి పార్టీలో చేరారు.. అంతకంటే ముందే చారులత , జానకి చేరారు … వీరంతా రాకముందే కాంగ్రెస్ నుంచి పలువురు టికెట్ వేటలో ఉన్నారు.. అసలే వర్గ పోరుతో సతమతం అయ్యే దశలో ఉన్న పార్టీకి కొత్త వారి రాక కాక పుట్టిస్తోంది … ఆ క్రమంలో రమేష్‌రాథోడ్‌కే ఖానాపూర్‌ టికెట్ అని లీకులు వస్తుండటంతో టికెట్‌ ఆశిస్తున్నహరినాయక్ వర్గం గుర్రుగా ఉంది… టికెట్ రమేష్‌రాథోడ్‌కి ఇవ్వవద్దని ఆశావాహులు అధిష్టానానికి మూడు పేజీల లేఖలు రాసారు …

బెల్లంపల్లిలో సైతం మూడు నాలుగు గ్రూపుల మధ్య వార్ ఉంది… తాజాగా మరో ఇద్దరు నాయకులు పార్టీలో చేరారు… ప్రధానంగా కాంగ్రెస్‌ నుంచి చిలుముల శంకర్ , దుర్గాభవాని, రోడ్డ శారద టికెట్‌ రేసులో కనిపిస్తున్నారు .. మరోవైపు గద్దర్ కుమారుడు సైతం ఇక్కడి నుంచే బరిలో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక చెన్నూర్ నియోజకవర్గంలో ఉన్న నేతలకు తోడు మరో ఇద్దరు నాయకులు ఈ మధ్య కాంగ్రెస్లో చేరారు… సర్కార్ కొలువు వదిలేసి వచ్చిన వెంకటేష్ టికెట్‌ ఆశిస్తున్నారు .. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి బోడ జనార్థన్ , సంజీవ్‌రావులు అధిష్టానం తమను కాదనదన్న ధీమాతో ఉన్నారు..


సిర్పూర్ – టి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి కుమారుడు ఈమధ్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు…ఇప్పటికే అక్కడ బీసీ సామాజికవర్గానికి చెందిన గోస్కుల శ్రీనివాస్‌యాదవ్ మరో నాయకుడు రావి శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరు నాయకులు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు .. అధిష్టానం ఓకే చేసినట్లు వైరల్ అయిన లిస్ట్‌లో రావి శ్రీనివాస్ పేరు ప్రచారం కాగా మిగిలిన ఆశావహులు గుర్రుగా కనిపిస్తున్నారు. మంచిర్యాల నియోజవర్గంలో టికెట్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది… టికెట్ తనకు కన్‌ఫర్మ్‌ అయిందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అంటుంటే .. తనదే టికెట్‌ అంటూ మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు… ఈ ఇద్దరి మధ్య ముందు నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి..

ముథోల్ లో పటేల్ సోదరులైన ముగ్గురు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు . . ప్రధానంగా నారాయణరావు పటేల్, రామారావుపటేల్‌లు అభ్యర్ధిత్వం ఖరారైపోయినట్లు ప్రచారం కూడా మొదలుపెట్టేశారు ..ఇక బోథ్ నియోజకవర్గంలో బంజారా, ఆదివాసీ నాయకులు బరిలో నిలవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు ..ఆదివాసీ నేత సోయంబాపురావుకి టికెట్‌ ఓకే అయినట్లు ప్రచారం జరుగుతుండగా.. డిసిసి అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అండదండలతో టికెట్ తనకే దక్కుతుందని అనీల్‌జాదవ్ ఆశలు పెట్టుకున్నారు …ఇక మిగతా నియోజకవర్గాల్లో ఒకరిద్దరే హడావుడి చేస్తున్నా.. టికెట్ కోసం మూడు నాలుగు దరఖాస్తులు వెళ్లాయంటున్నారు ..

మొత్తమ్మీద జిల్లాలోని పదినియోజవర్గాలకు గాను కేవలం నిర్మల్ , ఆసిఫాబాద్ తప్ప మిగిలిన సెగ్మెంట్లలో ఆశావహులు ఎక్కువగానే కనిపిస్తున్నారు .. దానికి తోడు కూటిమిలో మిత్రపక్షాలు సైతం రెండు మూడు నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్నారు .. దాంతో గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్లో టికెట్ల కేటాయించిన తర్వాత ఎంతరచ్చ జరుగుతుందో అన్న టెన్షన్‌ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here