Home News Stories

అసెంబ్లీలో సెగలు పుట్టించిన సిక్కోలు పోరు….

అసెంబ్లీలో పాలకపక్షమే ప్రతిపక్షం అయింది. బిసి సబ్ ప్లాన్ బిల్లు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన సందర్భంలో జరిగిన చర్చ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. జిల్లాలో ఇద్దరి నాయకుల మధ్య ఉన్న గొడవ అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. తప్పుల తడకగా బిల్లు ప్రవేశపెట్టారంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వాయిస్ కి అధికారపక్ష సభ్యులు తోడవ్వడంతో బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రిగారు బిక్కమెహం వేశారు. అసెబ్లీలో చివరి రోజు ఆసక్తికరంగా జరిగిన ఈ పరిణామం పై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి….

అజానుబాహుడు లాంటి అచ్చెన్నాయుడు తొలిసారిగా మంత్రి అయ్యారు ప్రతిపక్షం అంటేనే ఒంటి కాలిపై లేస్తారు అలాంటి అచ్చెన్నకి అసెంబ్లీ సాక్షీగా షాక్ తగిలింది. మంత్రి అచ్చెన్నాయుడుకు చెమటలు పట్టించారు విప్ కూన రవి. ఇద్దరు అధికార పార్టీ అయినప్పటికీ అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాలు గా తలపడ్డారు. తూతూ మంత్రంగా బిసి సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టారనే రీతిలో కూన రవి పదేపదే మంత్రి బిల్లు పై చేస్తున్న ప్రసంగానికి అడ్డు తగిలి ప్రశ్నల వర్షం కురిపించి అచ్చెన్నను ఉక్కిరి బిక్కిరి చేశారు. బిజెపి శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సైతం అధికార పార్టీ తప్పుల తడక బిల్లు ప్రవేశ పెట్టేకన్నా ప్రిపేర్ అయ్యి ప్రవేశ పెడితే బెటరని సలహా ఇవ్వడంతో కొంత సేపు సభ సైలెంట్ అయ్యింది.

అసెంబ్లీలో జరిగిన బీసీ సబ్ ప్లాన్ పై జరిగిన చర్చలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కూన రవికి పలువురు ఎమ్యెల్యేలు మద్దత్తు పలికితే అచ్చెన్నకు బాసటగా మంత్రి పితాని సత్యనారాయణ నిలిచేందుకు కొంత ప్రయత్నం చేసినా స్పీకర్ కోడెల సభ్యుల పక్షానే నిలవడంతో అధికార పార్టీ ఇరుకున పడి పరువు పోగొట్టుకుంది. బీసీ సబ్ ప్లాన్ ఇప్పటి వరకు మాటలకే పరిమితమవ్వగా మొదటిసారి చట్టసభలో బిల్లు రూపంలో తెచ్చేందుకు ఎన్నికల సమయంలో స్కెచ్ గీసింది అధికార సైకిల్ పార్టీ. బిసి సంక్షేమ మంత్రి అచ్చెన్నాయుడును వాస్తవానికి విప్ కూన రవి అడిగింది బిసి సబ్ ప్లాన్ కి నిధులు ఎలా విడుదల చేస్తారో చెప్పాలనే. అయితే జనాభా ప్రాతిపదికన చేస్తామని మంత్రి చెప్పడం నిధులే లేకుండా ఎలా చేస్తారంటూ రవి నిలదీయడం అచ్చెన్న ను డిఫెన్స్ లో పడేలా చేసింది.

బిసి జనాభా ప్రాతిపదికన చేస్తారా లేక రిజర్వేషన్ శాతాన్ని బట్టి చేస్తారా అంటూ కడిగేశారు. దీనిపై అచ్చెన్న నీళ్ళు నమిలారు. రవితో బాటు పలువురు ఎమ్యెల్యేలు ఇవే ప్రశ్నలు సంధించడం ఆయనను చికాకు పెట్టింది. దాంతో బిల్లు పై న్యాయ సమీక్ష తరువాత ప్రవేశ పెడతానని చెప్పడంతో స్పీకర్ సైతం అంగీకరించారు. విషయం సీఎం చంద్రబాబు వద్ద కి చేరడంతో రవిని పిలిచి తనదైన రీతిలో క్లాస్ పీకారు. జిల్లాల్లో గొడవను అసెంబ్లీ కి తెచ్చి పార్టీ పరువు పోయే పనులు చేయొద్దంటూ వ్యవహారం అచ్చెన్న, కూన ల మధ్య ఉన్నట్లు తెలివిగా డైవర్ట్ చేయబోయారు. దాంతో బాటు అధికారులతో చర్చించడంతో బిల్లులో లోపం ఉన్నట్లు తేలింది. ఆమోదం ఆలస్యం అయితే పరువు పోతుందని గ్రహించి మధ్యాహ్నం సెషన్ లో తిరిగి ప్రవేశ పెట్టి బిల్లు ఆమోదించుకుని మమ అనిపించి ఊపిరి పీల్చుకుంది అధికార పార్టీ.