Home News Stories

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బాబు కూటమి ప్రభావం ఎంత…?

జాతీయ స్థాయిలో పురుడు పోసుకుంటున్న ఈ సరికొత్త రాజకీయ సమ్మేళనం… దేశ రాజకీయ భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకూ కాదు.. మరో నెలలో జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈ కూటమి ప్రభావం ఎలా ఉండబోతోంది? రాజకీయ విశ్లేషకులు ఊహించిన దానికన్నా మిన్నగా ఈ కూటమి ప్రభావం చూపబోతోందా?

ఢిల్లీ పరిణామాలన్నీ దేశంలో కొత్త రాజకీయం రాబోతోందన్న సంకేతాల్ని పంపుతున్నాయి. మరి ఈ కొత్త రాజకీయాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయన్నదే సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ముఖ్యంగా త్వరలో జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ఈ సరికొత్త రాజకీయ సమ్మేళనం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందన్నదే అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితుల దృష్ట్యా చూస్తే యాంటీ బీజేపీ రాజకీయ శక్తుల్ని ఒక్కటి చేస్తున్న ఈ సరికొత్త కూటమి సమ్మేళనం, ఇప్పటికే ఓ రాజకీయ కదలిక తెచ్చిందన్నది నిర్వివాదాంశం.

ఇన్నాళ్లూ నా ఖావూంగా, నా ఖానేదూంగా అని, హమ్‌ చౌకీదార్ హై అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేసిన కమలదళపతి నరేంద్ర మోడీ మాటలు ఎంత అసత్యాలో ప్రజలకు బహిరంగంగా తెలిసొస్తున్నాయి. ఇటీవల బయటపడ్డ రాఫెల్‌ దుమారంపై ఇప్పటి వరకూ మోడీ సమాధానం చెప్పలేదు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నలేస్తున్నా… దానికి కమలనాథుల హుంకరింపులే సమాధానంగా వస్తున్నాయి. మోడీ, అమిత్‌షా వంటి నేతలు మాత్రం మౌనమే తమ భాష అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజగా బయటపడుతున్న ఉదంతాలు బీజేపీ ప్రభుత్వం రాజ్యంగ వ్యవస్థల్ని ఎంతలా ప్రభావితం చేస్తోందో అద్దం పడుతున్నాయి. నిన్నమొన్నటి సీబీఐలో బయటపడ్డ వ్యవహారాలు, తాజాగా సంచలనం సృష్టిస్తున్న ఆర్బీఐ వ్యవహారాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

సీబీఐని పూర్తిగా గుజరాత్‌ మయం చేసేందుకు నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలు స్పష్టంగా తేటతెల్లమైపోయాయి. సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా గుజరాతీ క్యాడర్ ఐపీఎస్. ఆయన తర్వాత స్థానాల్లో ఉండే ముగ్గురు డిప్యూటీ ఐపీఎస్‌లలో ఇద్దరు గుజరాతీయులే. ఆ కింది స్థాయిలో ఉండే డీఎస్పీ స్థాయి అధికారుల్లో కూడా సగానికి పైగా గుజరాతీయులే. ఇక సీబీఐ నెంబర్ వన్ అలోక్‌ వర్మపై చేసిన ఆరోపణలు, అరెస్ట్‌లు అన్నీ కలసి సీబీఐ మీద బీజేపీ పట్టును ప్రపంచానికి చాటి చెప్పాయి. ఇక తాజాగా ఆర్బీఐని కూడా మోడీ ఏ స్థాయిలో చెప్పుచేతల్లో పెట్టించుకున్నారన్న వ్యవహారం దేశాన్నే కుదిపేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్ సెవెన్ ను అమలు చేయాలన్న ప్రయత్నాలు బీజేపీ పాలనలో రాజ్యాంగబద్ధ సంస్థల దుస్థితిని బయటపెట్టాయి.

ఇక ఈ తాజా వివాదాలకు తోడు… నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలపై ప్రజల్లో కూడా కేంద్రం మీద వ్యతిరేకత ఉంది. దీనికి తోడు చరిత్రలోలేనంత గరిష్టానికి చమురు ధరలు, కనిష్టానికి రూపాయి విలువ పడిపోవడం కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. వీటితో పాటుగా… తాజా వివాదాలను కూడా ప్రచారాస్త్రాలుగా ప్రయోగిస్తే.. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే ఈ కూటమి తన ప్రభావం చూపించగలుగుతుంది. ఇప్పటికే రాజస్థాన్‌లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్‌ కూడా గతంతో పోలిస్తే కాస్తంత పుంజుకుంది. ప్రాంతీయ పార్టీలు కూడా తమ ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితులకు తాజా పరిణామాలు కూడా తోడైతే… బీజేపీకి గర్వభంగం తప్పదనేలా ఉంది. అదే జరిగితే ఈ బీజేపీ వ్యతిరేక కూటమికి మరింత బలం పెరుగుతుంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయానికి మరిన్ని పార్టీలు ఈ కూటమిలో భాగస్వాములయ్యే అవకాశాలున్నాయి. ఇందులో ప్రస్తుత ఎన్డీయే పార్టీలు కూడా వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

రాబోయే ఎన్నికల్లో మిషన్ 350 అంటూ మోడీషా ద్వయం వ్యూహాలు రచిస్తోంది. కానీ దాన్ని చేధించి, ఈ దేశాన్ని మోడీ బారి నుంచి కాపాడేందుకే అన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ కొత్త కూటమి కూర్పు సాగుతోంది. త్వరలో రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపేందుకు పెద్ద ఎత్తున ఎక్సర్ సైజ్‌ జరుగుతోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్లు కానీ, కూటమి ప్రయత్నాలు కానీ ఇక్కడితో అయిపోయాయని అనుకోనక్కర్లేదు. సాధ్యమైనంత వేగంగా కూటమిలో పాలుపంచుకోవాల్సిన పార్టీలన్నీ సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగి, పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే… దేశ రాజకీయ చరిత్రలో మొదటిసారిగా కాంగ్రెస్‌ సహా పార్టీలన్నీ ఒక కూటమిగా బరిలోకి దిగితే… బీజేపీకి ఇబ్బందులు తప్పవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here