సింహపురి జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట 1994, 1999 ఎన్నికల్లో సర్వే పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి, టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. ఆ తర్వాత నియోజవకర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీని పటిష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీలకు బలమైన పోటీ ఇస్తూ.. పార్టీని నెల్లూరు నడిగడ్డ పై నిలబెట్టగలిగారు. కాని అది గత చరిత్రగా మారింది. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ ప్రభావంతో వీచిన కాంగ్రెస్ గాలులకు సోమిరెడ్డి వెనుక బడ్డారు. ఆ తర్వాత వైసీపీ ఇక్కడ సైకిల్ పార్టీకి ప్లేస్ లేకుండా చేసింది… ప్రస్థుతం సర్వేపల్లిలో రాజకీయం ఎలా ఉంది…వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి ట్రాక్ లో పడతారా లేకపోతే హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుందా సర్వేపల్లి నియోజకవర్గం పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్థ రాజకీయ అనుభవం గల సీనియర్ నేత. ప్రస్తుతం ఏపీ వ్యవసాయశాఖ మంత్రిగా సోమిరెడ్డి ఉన్నారు.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా సోమిరెడ్డికి ఏపీ రాజకీయాల్లో మంచి పేరు ఉంది. గతంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోమిరెడ్డి, గత మూడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఎదురులేకుండా నిలబడ్డ మంత్రి సోమిరెడ్డి కోటకు 2004 నుంచి బీటలు వారాయి. అప్పటి వరకు అల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదాల 2004, 09 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసి సోమిరెడ్డిపై సంచలన విజయాలు సాధించారు. ఆ తర్వాత మళ్ళీ వైసీపీ ఫ్యాన్ గాలి సొమిరెడ్డి విజయానికి అడ్డుకట్ట వేసింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి విజయం సాదించారు. ఆయన పార్టీకి చేసిన కృషి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోమిరెడ్డిని ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి కూడా ఇచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే సర్వేపల్లిలో సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఎదిగిన, జెండాలు పట్టుకుని జై కొట్టిన నాయకులు ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు పెడుతున్నారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య సఖ్యత నానాటికీ తీసికట్టుగా మారుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నేతల మధ్య సఖ్యత లోపించిందని తెలుస్తోంది. గ్రామ, మండల స్థాయిలోని నాయకుల వర్గ పోరుకు టీడీపీ పార్టీకి తలనొప్పిగా మారింది . దీంతో పార్టీ కార్యాకలపాలు నియోజకవర్గంలో పడకేశాయి. దీనికి ప్రధాన కారణం.. ఆయన మంత్రి అయిన తర్వాత కూడా తమను పట్టించుకోలేదనే చిన్నపాటి అసంతృప్తి వారిలో నెలకొంది.
విపక్ష వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి.. ఇక్కడ పాదయాత్రలు, సంఘీభావ యాత్రలు అంటూ ప్రజలను పోగేసి.. వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొందరు నాయకులు గోవర్ధన్ వ్యూహంలో పడి గ్రూపులకు రెడీ అయ్యారు. మరి ఈ విషయాన్ని గుర్తించి.. సోమిరెడ్డి తరచుగా ఇక్కడ పర్యటించాల్సిన అవసరం ఉందని నాయకులు చెబుతున్నారు. ఇక్కడ సోమిరెడ్డి మరో ఆలోచన కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆయన కుమారుడిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు.
సర్వేపల్లి నుంచి వరుసగా పరాజయం పాలవ్వడంతో..వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అంతేకాకుండా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తన కుమారుడిని పోటీలోకి దింపే ఆలోచనలో సోమిరెడ్డి ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం పై సోమిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సర్వేపల్లి నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఎవరినో చూసి ఎందుకు భయపడాలి. ఎందుకు నియోజకవర్గం మారాలి. నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సోమిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి, మంత్రిగా ఉన్నా, గత నాలుగు ఎన్నికల్లో (2012 ఉప ఎన్నికతో కలుపుకుని) ఓడుతున్నా సర్వేపల్లిలో వచ్చే ఎన్నికల్లో అయిన పార్టీ గెలుస్తుందా ? అంటే చెప్పలేని పరిస్థితి. దీనిని బట్టి ఓ మంత్రిగా ఉన్నా సర్వేపల్లిలో సోమిరెడ్డి గెలుపు అంత సులువు కాదని క్లియర్‌గా తెలుస్తోంది. మరి మంత్రిగా ఆయన నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీని ఏ స్థాయిలో పటిష్టం చేశారు… ఇక్కడ ఆయన గెలుపునకు ఎంత వరకు బాటలు వేసుకున్నారన్న ప్రశ్నకు పాజిటివ్ ఆన్సర్ లేదు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆయన పోటీ చేసినా, ఆయన కుమారుడు రాజ్‌గోపాల్‌రెడ్డి పోటీ చేసినా నియోజకవర్గంలోని గ్రూపులను సమన్వయం చేసుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం చేస్తారో చూడాలి. వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ సోమిరెడ్డి ఓడిపోతే వరుసగా ఐదుసార్లు ఓడిన ఘోరమైన రికార్డు ఆయనకే దక్కుతుంది.