Home News Politics

రా..రమ్మంటున్న జగన్‌…పోటీ చేయాలంటున్న చంద్రబాబు…

ప్రకాశం జిల్లాలో ఆ నేతల కోసం రెండు పార్టీలు దోబుచులాడుతున్నాయి. అలాగే ఆ ఇద్దరి నేతల రాజకీయ గమనంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీడీపీ, వైసీపీ అధినేతలు వారిద్దరి పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. మధ్యలో జనసేన కూడా వల విసురుతుంది. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్‌ రా… రమ్మంటూ వారికి సంకేతాలు పంపుతుంటే, సైకిల్ పార్టీ అధినేత మీరిక్కడే ఉండాలి, తిరిగి పోటీ చేయాలంటున్నారు. ఇంకోవైపు వైసీపీ పక్షాన ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ ఇద్దరు నేతలతో టచ్‌లో ఉన్నారు. మధ్యలో జనసేన నేత తోట చంద్రశేఖర్‌ కూడా వీరితో మాటామంతీ కలిపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో శాసనమండలి సభ్యుడు మాగుంట, చీరాల ఎమ్మెల్యే ఆమంచిపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. దీంతో ఇటు మాగుంట, అటు ఆమంచి గమనం పై పొలిటికల్ పార్టీలే కాక ప్రజానీకం కూడా దృష్టిసారించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో మాగుంట టీడీపీలో చేరి ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేయగా, స్వతంత్ర అభ్యర్థిగా చీరాల అసెంబ్లీకి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్‌ సంచలన విజయం సాధించారు. ఎన్నికలకు ముందు ఇద్దరు నాయకులు గతంలో వైసీపీలో చేరేందుకు అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. కొంతమంది వారిని వైసీపీలో చేర్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆనాడు జగన్‌ వైఖరి వలనే అది సాధ్యం కాలేదనేది జగమెరిగిన సత్యం. అనంతరం టీడీపీలో చేరి ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మాగుంట పట్ల ప్రత్యేక ఆదరణతో చంద్రబాబు వెంటనే శాసనమండలికి వెళ్లే అవకాశం కల్పించారు. జిల్లాలోని కొందరు నాయకులు కాదూ కూడదు అన్నా ఆమంచిని చంద్రబాబు దరిచేర్చుకున్నారు. ఇదంతా గతమైతే తిరిగి వచ్చే ఎన్నికల వైపు దృష్టిసారించిన పార్టీలకు మళ్లీ ఈ ఇద్దరు నాయకులు టార్గెట్‌ కావడం విశేషం.

ఒంగోలు లోక్‌సభ స్థానంలో మాగుంట కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెడితే ఆ గుర్తింపును కాపాడుకోవడంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి సఫలీకృతులయ్యారు. పైగా గత ఎన్నికలలో లోక్‌సభకు పోటీ చేయడం ప్రత్యేకించి కొన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు కలిసి వచ్చిందనేది అంచనా. మరోవైపు చూస్తే టీడీపీకి అంతకన్నా బలమైన అభ్యర్థి ప్రస్తుతానికి లేనట్లే. ఇంకోవైపు వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ ప్రముఖులు మాగుంటను పార్టీలోకి తీసుకెళ్లాలన్న ఉబలాటంతో ఉన్నారు. వైసీపీ అంతర్గత వ్యవహారాల ఫలితంగా ఈసారి తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ పోటీకాకుండా మరో రూపంలో ఆయన సేవలు వినియోగించుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు విస్తృత ప్రచారంలో ఉంది. దీనికి తోడు జగన్‌ కూడా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. దీంతో సహజంగానే వైసీపీ నాయకులు మాగుంట కోసం వల వేశారు. టీడీపీలో తగిన గుర్తింపులేదని బాధపడుతున్న మాగుంటను హక్కున చేర్చుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. పూర్వకాలం నుంచి ఉన్న పరిచయాలతో వైసీపీ రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నట్లు వినికిడి.

ఇదే సమయంలోనే గత మూడు, నాలుగు నెలల కాలంలో సీఎం చంద్రబాబు మాగుంటను పిలిపించుకొని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒకటి రెండుసార్లు బాబుతో భేటీ అయినప్పటి నుంచి మాగుంట మాటతీరులో మార్పు వచ్చిందనేని జనం మాట. అటు ముఖ్యమంత్రి, మాగుంటల భేటీల నేపథ్యంలోనే వైసీపీ నాయకులు హైదరాబాద్ లో మాగుంట ఇంటికి వెళ్లి కలిసే ప్రయత్నం కూడా చేశారు. మధ్యలో సినీ సంబంధాలు నెమరువేసుకుంటూ మీకోసం జనసేన తలుపులు తెరచుకున్నాయని పవన్‌కల్యాణ్‌ కబురు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితి చూస్తే మాగుంట బాబుకే ఓటేసినట్లు కనిపిస్తుంది. ఆ మేరకు తెలుగుదేశం ముఖ్య నాయకులలో ధీమా కనిపిస్తుండగా ఏమో వేచిచూద్దాం అన్న భావన వైసీపీ నేతలలో కనిపిస్తుంది.

చీరాల అసెంబ్లీలో వ్యక్తిగతంగా పట్టు పెంచుకోవడమే ఆమంచికి ఆయుధమైంది. తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆయన ఎక్కడా బహిరంగంగా మాట్లాడకపోయినా కొన్ని అంతర్గత విషయాలపై ఆయన అసంతృప్తితో ఉన్నమాట నిజం. దీనికి తోడు జిల్లా పార్టీ వ్యవహారాలలో ఆయన చురుగ్గా పాల్గొనకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ఈ దశలో వైసీపీ అధిష్టానం కాపు సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అలాంటి నాయకులలో ఆమంచితోపాటు మరికొందరున్నారు. వారిలో ఆమంచిని కీలకంగా ఎంచుకొని ఆయన ద్వారా మరికొందరిని రాబట్టాలని వైసీపీ ప్రయత్నించినట్లు వినికిడి. ఇటు విజయసాయిరెడ్డికితోడు అటు బొత్సా ఆమంచిపై ఒత్తిడి పెంచారు. ఈ ఇద్దరు నాయకులు పలు దఫాలు ఆమంచితో ఫోన్‌లో మాట్లాడారు. ఒక్కసారి జగన్‌ను కలవండని కోరినట్లు తెలిసింది. మరో వైపు జనసేన పవన్‌కల్యాణ్‌ దూతలు ఆమంచిని కలిసినట్లు సమాచారం. ప్రధానంగా ఆపార్టీ కీలక నేతల్లో ఒకరైన తోట చంద్రశేఖర్‌ ఆమంచికి టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల తోట న్యూస్‌ చానల్‌ను తీసుకున్న సందర్భంలోనూ ఆమంచికి టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దశలో పలు రకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమంచిని పిలిపించుకొని ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఒకటి రెండుసార్లు ఆమంచితో పాటు తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులును కూడా పిలిపించుకొని సీఎం మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారం జరుగుతున్న దశలోనే ఆమంచి బీఫాం ఇస్తే టీడీపీ తరపున పోటీ చేస్తా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనతో ఆమంచి రాజకీయ భవితవ్యంపై అనుమానాలు పెనుభూతాలయ్యాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రెండుసార్లు ఆమంచిని పిలిపించుకొని భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు మీరు ఇంట్లో కూర్చొని గెలవగలరు, మీకు బీ ఫాం ఇవ్వకపోవడం ఏమిటంటూ భరోసాగా మాట్లాడారు. పార్టీలో ఎదురైన చేదు అనుభవాలపై ఆమంచికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారా లేదా, భవిష్యతులో ప్రోత్సాహంపై ఎలాంటి క్లారిటీ ఇచ్చారనే విషయాన్ని పక్కనపెడితే ఆమంచి మనతోనే ఉంటాడన్న నమ్మకం టీడీపీలో పెరిగింది. జనంలో పట్టున్న ఈ ఇద్దరు నేత రాజకీయ గమనంపై ఇలా సాగుతున్న చర్చకు ముగింపు ఎప్పుడు అనేందుకు మాత్రం ఇంకా వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here