Home News

రాహుల్ రిజైన్ సరే తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యులెవరు…?

పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ… రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షపదవికి రాజీనామా చేశారు… పట్టుబట్టి మరీ కొత్తగా తాత్కాలిక అధ్యక్షుడ్ని నియమింపచేశారు.. అది కేవలం రాహుల్‌కే వర్తిస్తుందా..? రాష్ట్రంలో ఉండే నాయకులకు వర్తించదా..? వరుస ఓటములకు బాధ్యత వహించే వారే లేరా..? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ దీని మీదే నడుస్తుంది..

ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు… అదే దారిలో అందరూ ఉంటారా..? అంటే… రాహుల్ గాంధీకి ఉన్నంత బాధ్యత మరెవరికీ లేదేమో అనిపిస్తోంది … ఎంతైనా పార్టీ వాళ్ళది కదా అనుకుంటున్నారో?.. లేదంటే… నిజమే కదా.. ఎన్నికల్లో ఓటమికి రాహుల్ బాద్యుడు కాబట్టి ఆయనే రాజీనామా చేశారు అనుకుంటున్నారో ..? … తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యనేతలు ఎవరూ వరస పరాజయాలపై పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు..

తెలంగాణ ఇచ్చింది తామే అని ఘనంగా చెప్పుకుంటున్నా.. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నప్పటి నుండి వరుస పరాజయాలే మిగులుతున్నాయి కాంగ్రెస్‌కి … 2014 ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా… కనీసం 2018 ఎన్నికల్లో అయినా… పార్టీకి మెరుగైన ఫలితాలు దక్కుతాయని ఆశించారు … అయితే గతం కంటే ఘోరంగా పార్టీ ఓటమి పాలైంది…

దాంతో ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ… రాష్ట్ర నాయకత్వం రాజీనామా చేయాలన్న డిమాండ్ వినిపించింది .. అయితే ఓటమి బాధ్యత ఈవీఎంల మీదకు తోసేసి చేతులు దులిపేసుకున్నారు రాష్ట్ర పార్టీ నేతలు.. . వారి వాదనతో పార్టీ నాయకత్వ మార్పు పై చర్చ పక్కకు పోయింది… పిసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు కూడా … ఆశించిన దానికంటే అంతంత మాత్రపు ఫలితాలే వచ్చాయి …

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవటంతో .. కాంగ్రెస్‌కి మనుగడ సమస్య మొదలైంది … వరుస పరాజయాలతో పాటు… రాష్ట్రంలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు జెండా మార్చేశారు… ఎమ్మెల్యే లు పార్టీ మారుతున్నా .. వారిని ఆపే ప్రయత్నం చేయలేదని పిసిసి విమర్శలు ఎదుర్కొంది .. అది అటు తిరిగి ఇటు తిరిగి సీఎల్పీ విలీనం దాకా వెళ్లింది.. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చతికిలడింది… ఇక స్థానిక సంస్థలు ఎన్నికల్లో … కాంగ్రెస్ పార్టీ బి ఫార్మ్ తీసుకున్న వాళ్ళు టిఆర్ఎస్ లో చేరిపోయారు. .. అయినా దిద్దుబాటు చర్యలు మాత్రం కనపడటం లేదు..

ఈ క్రమంలోనే వరుస ఓటములపై సమీక్ష… పిసీసీ పెద్దలు పార్టీ పదవుల నుండి తప్పుకోవాలన్న డిమాండ్‌ మళ్లీ గట్టిగా వినిపిస్తోంది … ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ పదవిలో కొనసాగడానికి సుముఖంగా లేరంట… ఇంతకాలం రాహుల్ గాంధీ దగ్గరున్న గుడ్‌విల్‌తో ఆయన చక్రం తిప్పుతూ వచ్చారన్న టాక్‌ ఉంది.. అయితే రాహుల్‌ అధ్యక్షపదవి నుంచి తప్పుకోవడంతో ఉత్తమ్‌ కూడా పిసీసీ పదవి వదులుకోవడానికి సిద్దమయ్యారంట..

ఏదేమైనా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించాల్సి ఉన్నా… పట్టించుకోవడం లేదని హన్మంత రావు లాంటి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… అసలు అధిష్టానం మనసులో ఏముందో ఎవరికి అర్థం కాకుండా పోయిందని కాంగ్రెస్‌ నేతలు వాపోతున్నారు .. మొత్తానికి కాంగ్రెస్‌కి రాష్ట్రంలో దిశా నిర్దేశం లేకుండా పోయింది… అది చాలదన్నట్లు కొత్త ఏఐసిసి అధ్యక్షుడి నియామకం క్యాడర్‌ను మరింత కుంగతీస్తున్నట్లు కనిపిస్తోంది..

ఎవరికి అవకాశం ఇవ్వాలి… ఎలాంటి వారిని నియమించాలి అన్నవి హైకమాండ్‌ నిర్ణయాల మేరకే జరుగుతాయి… రాష్ట్ర పార్టీ నేతలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోకుండా నాయకుడిని ఎన్నుకోవడంతో … ఆ తరువాత నాయకుల మధ్య సఖ్యత లేకుండా పోతుందన్న వాదన ఉంది .. ఇలా పార్టీ తనకు నచ్చిన వాళ్లకు అవకాశం ఇవ్వడం… పదవులు ఇచ్చాకా పంచాయతీ లు ..ఇది షరా మాములే అన్నట్టు మారిపోతోంది.. ప్రస్తుతం తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది .. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ఉంటాయో లేదో చూడాలి..