Home News

రాజకీయాల్లో నల్లారి శకం ముగిసినట్లేనా…?

దశాబ్ధాల చరిత్ర కలిగిన నల్లారి కుటుంబం రాజకీయంగా పట్టు కోల్పోతుందా … అన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేఖించి మరి అధికార టిడిపిలో చేరి పోటీ చేసిన కిశోర్ కుమార్ రెడ్డి వరుసగా రెండు ఎన్నికల్లోను ఓటమి పాలవ్వడంతో నల్లారి కుటుంబం రాజకీయ గమనం పై నీలి నీడలు కమ్ముకున్నాయి…

చిత్తూరు జిల్లాలో వున్న ప్రముఖ రాజకీయ కుటుంబాలలో నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది . తండ్రి అమరనాథ్ రెడ్డికి గల్లి నుంచి ఢిల్లి వరకు వున్న ప్రాబల్యంతో ఆయన వారసుడుగా కిరణ్ కూమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంతే వేగంగా వాయల్పాడు ,పీలేరునియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే గా ఎంపికయి చీప్ విప్,స్పీకర్ ఇలా సీఎం స్థాయికి వెళ్లారు. పది సంవత్సరాల కెరియర్ లోనే ఆయన రాజకీయ చదరంగంలో అత్యున్నత స్థానానికి వెళ్ళారు. ఉమ్మడి ఏపికి చిట్టచివరి సీఎం అయి చరిత్ర సృష్టించారు. …ఆ తర్వాత రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సమైక్యాంద్ర పార్టీ స్థాపించారు. రాష్ట వ్యాప్తంగా పోటీ పెట్టినప్పటికి ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. కేవలం పీలేరు లో పోటీ చేసిన అయన సోదరుడు కిషోర్ కూమార్ రెడ్డి మాత్రమే గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యాడు.

జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి దెబ్బతిన్నాక సైలెంట్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరి తిరుపతిలో నిర్వహించిన సభకు మాత్రమే హాజరయ్యారు. ఇక ఎన్నికల సమయంలో మాత్రం మళ్లీ కనిపించలేదు.స్వయానా అన్న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతుండగా తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే పీలేరు టిక్కెట్ ఖరారు చేసిన చంద్రబాబునాయుడు, ఆ వెంటనే ఆయనకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ పదవి కూడా కట్టబెట్టారు. పీలేరుతో పాటు పుంగనూరులో టిడిపి గెలుపు బాధ్యతలను కూడా కిషోర్ కుమార్ రెడ్డి కి అప్పగించారు. పుంగనూరు బరిలో ఉన్న వైసిపి ముఖ్య నేత పెద్దిరెడ్డిని కట్టడి చేసే బాధ్యతను కూడా కిషోర్ కుమార్ రెడ్డికి కట్టబెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

జిల్లాలో పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా వైరం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య చాలా ఏళ్లుగా మాటలు లేవు. ఇద్దరూ నాడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి పీలేరు అభ్యర్థి కావడం తో స్వతహాగానే పెద్దిరెడ్డి తో ఉన్న వైరం మరింత ముదిరింది. పుంగనూరులో పెద్దిరెడ్డిని కట్టడి చేయాలని కిషోర్ కుమార్ రెడ్డి వ్యూహాలు రచిస్తే,పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డి ని ఎలాగైనా ఓడించాలని పెద్దిరెడ్డి కంకణం కట్టుకుని వ్యూహాలు రచించారు. ఖర్చుకు ఎమాత్రం వెనక్కి తగ్గకుండా చింతలకు అండగా నిలిచిన పెద్దిరెడ్డి మరోసారి నల్లారి కుటుంబాన్ని దెబ్బతీశారు.

కిషోర్ ను ఓడించడం ద్వారా వాళ్ళ అన్న కిరణ్ కుమార్ రెడ్డి పై కూడా పైచేయి సాధించారు పెద్దిరెడ్డి…. తాము ఓటమి పాలు కావడం, ప్రత్యర్ధి కుటుంబాలైన పెద్దిరెడ్డి,చింతల రామచంద్రరెడ్డి గెలవడంతో చిత్తూరు జిల్లాలో నల్లారికుటుంబానికి ఇది పెద్ద ఎదురు దెబ్బగా మారింది.

ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్రవహించిన నల్లారి కుటుంబానికి ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యమే కరువు అయింది. మరోవైపున పీలేరు నుంచి వరుసగా నల్లారి కుటుంబంపై గెలుస్తున్న చింతల రామచంద్రరెడ్డికి రాష్టస్ధాయి నామినేటెడ్ పదవి వరించనున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపధ్యంలో నల్లారి సోదరులు రాజకీయ పయణం ఎలా సాగుతుంది ..ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు సస్పెన్ష్ గా మారింది.