Home News Politics

భూపాలపల్లి లో బిగ్ ఫైట్ …త్రిముఖ పోటీలో గెలుపెవరిది…?

నామినేషన్లు,ఉపసంహరణలు అన్ని పూర్తవ్వడంతో భూపాలపల్లి లో రాజకీయం రంగులు మారుతుంది. ఇక్కడ గులాబీ పార్టీ టిక్కెట్ కోసం పంతానికి పోయి కొందరు పార్టీలు మారితే ఇంకొదరు రెబల్స్ గా బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ లో ఫస్ట్ లిస్ట్ లో పేరు రాక బిక్కమొహం వేసిన సీనియర్ లీడర్ గండ్ర వెంకట రమణారెడ్డి ఎట్టకేలకు టిక్కెట్ దక్కించుకుని ప్రచార బరిలో దిగాడు. ఇక సభలో విపక్షాలను ముప్పు తిప్పలు పెట్టిన స్పీకర్ సిరికొండ మధుసూదన చారి గులాబీ పార్టీ నుంచి బరిలో దిగారు. ఇక బీజేపీ నుంచి దివంగత మాజీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కుమార్తె కిర్తీ రెడ్డి బరిలో దిగారు. గులాబీ పార్టీ టిక్కెట్ దక్కని గండ్ర సత్యనారాయణ ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. ఈ చతుర్ముఖ పోటీ ఇప్పుడు భూపాలపల్లిలో బిగ్ ఫైట్ గా మారింది. భూపాలపల్లి అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్ పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ రిపోర్ట్….

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్న చారిని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి విపక్షపార్టీలు. మహా కూటమి తరఫున కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పని చేసిన గండ్ర వెంకటరమణా రెడ్డిని మరోసారి బరిలోకి దింపారు. స్పీకర్‌నే ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అందుకే, ఈసారి భూపాలపల్లిలో బిగ్‌ఫైట్‌ జరుగుతోంది. దీనికితోడు, గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన గండ్ర సత్యనారాయణ రావు ఈసారి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున చందుపట్ల కీర్తిరెడ్డి తొలిసారిగా పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో మధుసూదనాచారి, రమణారెడ్డి చెరోసారి గెలవగా.. ఈసారి చతుర్ముఖ పోరు హోరాహోరీగా ఉంది.

సీఎం కేసీఆర్‌ భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తనకు సన్నిహితుడిగా.. ఉద్యమకాలంలో చేదోడువాదోడుగా ఉన్న మధుసూదనాచారిని మరోసారి గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. స్పీకర్‌ను మరోసారి అసెంబ్లీకి తీసుకువచ్చేలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కూటమి నుంచి బలమైన అభ్యర్థి బరిలో ఉన్నా.. ఓట్లను చీలుస్తూ స్పీకర్‌ గెలిచేలా సలహాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. గండ్ర సత్యనారాయణరావు గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచారు. 2017 డిసెంబరులో కారెక్కారు. భూపాలపల్లి టికెట్‌ ఆశించినా దక్కకపోవడంతో రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయన బరిలో ఉంటే టీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రె్‌సకే ఎక్కువ నష్టమని గులాబీ నేతలు అంటుంటే, టీఆర్‌ఎస్‌కే నష్టమని కూటమి నేతలు అంటున్నారు. అయితే, స్థానికంగా గట్టి పట్టు ఉన్న సత్యనారాయణరావు ఇరు పార్టీల్లోనూ గుబులు రేపుతున్నారు.

ఇక్కడి నుంచి మొదటిసారి గెలిచిన గండ్ర వెంకటరమణా రెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌గా పని చేయగా, 2014లో గెలిచిన మధుసూదనాచారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. దాంతో, భూపాలపల్లి నుంచి గెలిస్తే పదవి బోనస్‌ అనే ప్రచారం ఉండటంతో ఇద్దరు నేతలూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక గండ్ర పై గత ఎన్నికల్లో ఓడిపోయినసానుభూతి ఉంది. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా అప్పట్లో నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకురావడం గండ్రకి ప్లస్ పాయింట్. ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడేళ్లు ప్రజలకు దూరంగా ఉండటం,విజయలక్ష్మి అనే మహిళ చేసిన లైంగిక ఆరోపణలు మైనస్ గా మారాయి.

భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా మార్చడం, రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడంస్పీకర్‌గా ఉన్నా.. పల్లె నిద్ర పేరిట 68 గ్రామాల్లో పర్యటన చేయడం, నెలలో సుమారు 20 రోజులకుపైగా గ్రామాల్లో పర్యటించడం పోటీలో ఉన్న ఏకైక బీసీ అభ్యర్థి కావడం ఇక్కడ సిరికొండకు ప్లస్ పాయింట్. ముగ్గురు కుమారులను రాజకీయాల్లోకి దింపి షాడో ఎమ్మెల్యేలను చేయడం,అనుచరులపై భూకబ్జాలు, వసూళ్ల ఆరోపణలు రావడం మధుసూధన చారికి మైనస్.

ఇక్కడ సింగరేణి ఓట్లు కీలకం భూపాలపల్లిలో 6,263 మంది సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయి. మరో 3వేల మంది సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి ఓట్లు 20 వేల వరకు ఉండవచ్చని అంచనా. అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది వీరే. బీజేపీ అభ్యర్ధి చందుపట్ల కీర్తి రెడ్డి కూడా చాపకింద నీరులా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. కమలం పార్టీ అభ్యర్ధి కిర్తీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర సామాజిక వర్గం ఒక్కటే అవ్వడం వీరిద్దరి మధ్య ఓట్ల చీలిక అధికార పార్టీ అభ్యర్ధికి ప్లస్ అవుతుందన్న వాదన వినిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ రెబల్ గండ్ర సత్యనారాయణ చిల్చే ఓట్లను బట్టి ఇక్కడ గెలుపోటములు తారుమారు అయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here