Home News

భీమవరంలో జనసైన్యం ఎక్కడ…?

ఎన్నికల ముందు అలజడి రేపిన అభ్యర్ధులు, కార్యకర్తలు, అభిమానులు ఇపుడు కనీసం అలికిడి చేయడంలేదు… అధినేత అడుగుపెడితే జనసునామీ సృష్టించినవారు ఇప్పుడు కంటికి కనపడటం లేదు … దిశా నిర్ధేశం లేక వారిలో ఉత్సాహం నీరుగారిపోయిందా? … సొంతంగా ఖర్చుపెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన అభిమానుల్ని రిజల్ట్స్‌ తర్వాత ఏ ఒక్కరు పలకరించకపోవడమే ఈ పరిస్థితికి కారణమా? అసలక్కడ ఆ పార్టీలో ఏం జరుగుతోంది?

జనసేన… పార్టీ పేరు చెబితే చాలు భీమవరం పట్టణంలోని అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది… పార్టీకి కంచుకోటగా ఉంటుందన్న ఉద్దేశంతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ స్వయంగా భీమవరం నుంచి పోటీ చేశారు … ఎన్నికల ముందు భీమవరంలో కొన్ని రోజుల పాటు ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపారనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే ఎన్నికలు దగ్గరపడి… ప్రచారంలో బిజీ అయిపోవడంతో భీమవరంపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారనే టాక్ ఉంది… సరిగ్గా ఇక్కడే జనసేన టార్గెట్ రీచ్ కాలేకపోయింది.

జనసేన అధినేత భీమవరంలో ఉన్నంతకాలం అభిమానుల కోలాహలం… సభ పెడితే సునామీలా వెల్లువెత్తిన జనసందోహాన్ని చూసిన వారంతా భీమవరంలో జనసేన గెలుపు పక్కా అనుకున్నారు… అయితే అధినేత లేకుండా పార్టీ బాధ్యతలు సమర్ధంగా నిర్వహించడంలో, పోల్‌ మేనేజ్‌మెంట్లో స్థానిక నేతలు ఫెయిల్‌ అయ్యారు .. ప్రత్యర్దుల ఎత్తుగడలను తిప్పికొట్టలేకపోయారు.. ఫలితం పవన్‌కళ్యాణ్‌ ఓటమి … కనీసం పోలింగ్ రోజు పవన్ భీమవరంలో ఉండి ఉంటే పరిస్థితి మెరుగ్గాఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ రోజున ఏం జరిగిందో ఇప్పుడు అదే పరిస్థితి భీమవరంలో కొనసాగుతోంది… పవన్ అడుగుపెడితే నినాదాలు, కేరింతలతో కొత్త ఉత్సాహాన్ని నింపే క్యాడర్ ను ఇపుడు పట్టించుకునే దిక్కులేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.

ఎన్నికల్లో తొడగొట్టి మరీ పోటీ చేసిన నాయకులు కూడా అధినేతలానే నియోజకవర్గాల్లో అడ్రస్ లేకుండా పోవడంతో … జెండా మోసిన కార్యకర్తలపై కక్ష సాధింపులను అడ్డుకునే దిక్కులేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. పనిచేయడానికి జనం ఉన్నా వారిని గైడ్‌ చేసేవారు లేకపోవడం.. అడ్రస్ లేని నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం జనసైనికులకు మింగుడుపడటం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి అంతా సిద్దంకావాలంటూ అధినేత ఈ మధ్య ఇచ్చిన పిలుపుపై భీమవరం జనసైనికులు గుర్రుగా ఉన్నారు.. కింది స్థాయిలో ఓట్లు వేయించే బూత్‌ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నకలకు వెళ్దామని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో .. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డామని అసహనం వ్యక్తం చేస్తున్నారు …

భీమవరం సంగతి పక్కన పెడితే పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో జనసేన పోటిచేసింది… క్యాడర్ మొత్తం ఎంతో కొంత కష్టపడింది… అధినేతపై అభిమానం పార్టీకి ఓట్లు కూడా భారీగానే సంపాదించిపెట్టింది .. అయితే పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉన్నా పలకరించే దిక్కులేక పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకోవడానికి ఏ ఒక్కరు ముందడుగేయడంలేదట… ఎవరున్నా లేకపోయినా వారిపనివారు చేసుకుపోయేందుకు అభిమానులు సిద్దంగానే ఉన్నా వారిపట్ల సైతం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ఫీలవుతున్నారు…

భీమవరంలో లాగానే ఇతర నియోజకవర్గాల్లో కూడా నాయకులు అధినేతనే ఫాలో అవుతున్నారు… అవసరం వచ్చినా వారు అందుబాటులో వస్తారనే ధీమాలేదు… అభిమానంతో ఉన్నదంతా పొగొట్టుకున్న కొంత మంది నేతలు .. ఆర్ధిక ఇబ్బందులంటూ చేతులెత్తేయడం, కార్యకర్తలకు దూరంగా జరగడంతో పార్టీ మరింత దిగజారిపోతోంది … ఇలాంటి పరిస్థితుల్లో .. పార్టీ ఇక ఎన్నికల ఊసు ఎత్తకపోవడం బెటర్‌ అన్న అసహనం వ్యక్తం చేస్తోంది పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here