ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఏఆర్ఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మందుని ఎవరి ఇష్టానుసారం వారు వాడుకునేందుకు అనుమతినిచ్చింది. ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందులు రోగులు వాడోచ్చని తేల్చి చెప్పింది. అయితే కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతినివ్వలేదు. ఈ కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో మాత్రం ఇంకా నివేదికలు అందలేదని తేల్చింది. అయితే కరోనా రోగులు ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులను ఆపొద్దని సూచించింది.

ఆనందయ్య మందును తీసుకోవడానికి కొవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా వారి తరుపున కేర్ టేకర్స్ ఉండాలని ప్రభుత్వం సూచించింది. మందు పంపిణీలో కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది. అయితే అనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య మందుల వల్ల హాని కూడా లేదని తేలింది.