Home News Updates

పెద్దాపురం వైసీపీలో మూడుముక్కలాట…!

ఓటమి పాలైన ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఇన్‌ఛార్జ్ పదవి కోసం ఆసక్తి కరమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి .. ఇన్‌ఛార్జ్ పదవి కోసం వైసిపి నేతలతోపాటు టిడిపి నేత పోటీ పడుతుండటం ఆసక్తిరేపుతోంది.. సదరు నేత ఇక్కడ పదవి దక్కకపోతే.. బిజెపి వైపు కూడా కర్చిఫ్ వేస్తున్నారంట … ఇంతకీ ఆ నేత ఎవరో? రాజకీయ ఉద్దండులకు పెట్టని కోట అయిన పెద్దపురం సెగ్మెంట్‌ వైసిపిలో అసలేం జరుగుతుంది…!

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వైసిపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి … ఎన్నికల్లో ఇక్కడ వైసిపి ఓడిపోవడంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి కోసం ఉత్కంఠ పోటీ నెలకొంది… పెద్దాపురం ప్రస్తుత వైసిపి కన్వీనర్ తోట వాణి తానే ఇన్‌ఛార్జ్ అన్నట్లు వ్యవహారిస్తున్నారు… మరోవైపు మాజీ కన్వీనర్ దవులూరి దొరబాబు కూడా సమన్వయకర్త పదవి ఆశిస్తున్నారు… అలాగే ప్రస్తుతం టిడిపి సీనియర్ నేతగా కొనసాగుతున్న బొడ్డు భాస్కర్ రామారావు ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తే వైసిపిలో చేరేందుకు సిద్ధం అంటున్నారంట… ఆ క్రమంలో వైసిపి అధినేత నిర్ణయం కోసం నేతలంతా ఎదురు చూస్తున్నారు…

తూర్పుగోదావరి జిల్లా వైసిపి ఇన్‌ఛార్జ్ గా వ్యవహారించిన వై.వి. సుబ్బారెడ్డి టిటిడి బోర్డు చైర్మన్ కావడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి అతిగతి లేనట్లు తయారైంది … పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు … పెద్దాపురం ఇన్‌ఛార్జ్ పదవి ఇవ్వకపోతే తోట వాణి వైసిపికి గుడ్ బై చెప్పుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది బిజెపి.. ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ముఖ్యనేతలు టీడీపీకి టాటా చెప్పించి బిజెపిలో చేరారు … అయితే ఇప్పుడు వైసీపీ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది .. వైసీపీకి చెందిన మహిళా నేత తోట వాణి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకునే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

2019 ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన తోట వాణి.. టీడీపీ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు… ఆమె కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యేగా చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ.. ఎస్పీతో పాటు కోర్టును సైతం ఆశ్రయించారు… ఆ కేసు విషయంలో పార్టీ పరంగా తోట వాణికి సహకారం లభించక మనస్థాపానికి గురయ్యారంట… అందుకనే వైసీపీని వీడి బీజేపీలో చేరాలని వాణి నిర్ణయించినట్లు నియోజకవర్గం లో ప్రచారం జరుగుతోంది ….

బిజెపి ఎంపి సుజనా చౌదరి ద్వారా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులతో వాణి మంతనాలు జరిపినట్లు సమాచారం… వాణి బిజెపి తీర్థం పుచ్చుకుంటే మాత్రం వైసీపీకి షాక్ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు… తోట వాణి మాజీమంత్రి తోట నరసింహం భార్య … మరో మాజీమంత్రి దివంగత మెట్ల సత్యనారాయణరావు కుమార్తె… దాంతో పాటు రాష్ట్రంలో ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో వైసిపి అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేని పార్టీ వర్గాల్లో చర్చగా మారింది…

వైసిపి పెద్దాపురం మాజీ కన్వీనర్ దవులూరి దొరబాబు కూడా ఇన్‌ఛార్జ్ పదవి ఆశిస్తున్నారు… ఇన్‌ఛార్జ్ తానేననే ప్రచారం చేసుకుంటున్నారు… దవులూరి ప్రచారంపై తోట వాణి వర్గీయులు గుర్రుగా ఉన్నారు… ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలతో పెద్దగా పరిచయాలు లేని దవులూరికి ఇన్‌ఛార్జ్ పదవి దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది… వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి గెలుపొందాలంటే బలమైన నేతకు ఆ పదవి కట్టబెట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి ..

ఇది ఇలా ఉండగా టిడిపి సీనియర్ నేత బొడ్డు భాస్కర్ రామారావు వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు… ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తే బొడ్డు వైసిపిలో చేరడం ఖాయమంటున్నారు … ఈ విషయమై ఆయన ఇప్పటికే తన వారితో సమాలోచనలు జరుపుతున్నారంట.. ఎన్నికల ముందు నుంచి బొడ్డు భాస్కర రామారావుకు టిడిపితో అంటి ముట్టనట్లు వ్యవహారిస్తున్నారు… వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ పార్టీ ముఖ్య నేతలతో టచ్‌లో ఉంటున్నారు…

కమ్మ సామాజిక వర్గానికి గత ఎన్నికల్లో జిల్లాలో ఒక సీటు కూడా కేటాయించని వైసిపి .. బొడ్డును పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ అపవాదు పోగోట్టుకోవాలనే ఆలోచనలో ఉందంట… బొడ్డు పార్టీలో చేరితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయని కూడా భావిస్తున్నారంట .. మరి ఇన్‌ఛార్జ్‌ పదవి ఎవరికి దక్కుతుందో కాని… జిల్లాలో మాత్రం పెద్దాపురం వైసిపి రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here