Home News

తెలంగాణలో‌ రైతుబంధు పథకం ఇక అంతేనా…!

రైతు బంధు పథకం అంద‌రికీ అమలు చేస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం .. ఇక దాన్ని కొంద‌రికే ప‌రిమితం చేయనుందా? ఐదు ఎక‌రాల‌కు మించి ఉన్న రైతుల‌కు ఇక రైతు బంధు లేన‌ట్టేనా ? గ‌డువుదాటుతున్నా ఆయా రైతుల అకౌంట్లలో సదరు పథకం నగదు జమ కాలేదు.. దాంతో అయిదు కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వసాయం అందదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

దేశంలోనే తొలిసారి రైతుబంధు పేరుతో వినూత్న ప‌థ‌కాన్ని ప్రవేశ‌పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మొద‌టిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసిఆర్ బ్రెయిన్ చైల్డ్ గా ఈ ప‌థ‌కం దేశవ్యాప్తంగా ప్రశంస‌లు అందుకుంది… పంట పెట్టుబ‌డి కోసం నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో డ‌బ్బులు జమ చేయడం ఈ పథకం ఉద్దేశం.. రైతులు అప్పుల కోసం వ‌డ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు ప‌డ‌కుండా ఈ స్కీం తీసుకొచ్చారు…

2019 ఎన్నిక‌ల ముందు ఖ‌రీఫ్ , ర‌బీ పంట‌ల‌కు రైతుబంధు అమ‌లు చేశారు… ఒక వ్యక్తికి ఎన్ని ఎక‌రాలు ఉన్నా ఎక‌రానికి నాలుగు వేల చొప్పున ఇచ్చారు… ఇంట్లో ఎంత‌మంది పేర్లతో భూమి ఉన్నా ఆంక్షలు లేకుండా ఈ ప‌థ‌కం అమ‌లు చేశారు… టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడంలో ఈ ప‌థ‌కం కీల‌క‌పాత్ర పోషించిందని చెప్పవచ్చు … ఆ పథకాన్ని తర్వాత కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు అమ‌లు చేశాయి.

కేంద్రం ఎన్నిక‌ల ముందు కిసాన్ యోజ‌న పేరుతో ప‌థ‌కం తీసుకొచ్చింది… ఐదు ఎక‌రాల‌లోపు భూమి ఉన్న వారికి మాత్రమే ఈ ప‌థ‌కం వ‌ర్తించేలా – ఏడాది మొత్తానికి కలిపి కేవ‌లం ఆరువేల రూపాయ‌లు మాత్రమే ఇవ్వడంతో … తెలంగాణ ప్రభుత్వం పెట్టిన స్కీం ముందు కిసాన్‌యోజన పెద్దగా ప్రభావం చూప‌లేదు… ప‌క్క రాష్ట్రమైన ఏపిలో కూడా ఈ త‌ర‌హా ప‌థ‌కం ప్రవేశ‌పెట్టి .. కౌలు రైతుల‌కు సైతం దాన్ని వర్తింప చేస్తున్నారు …

రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ ప్రభుత్వం రైతుబంధుపై పున‌రాలోచ‌న చేస్తున్నట్లు క‌నిపిస్తోంది… ఖ‌రీఫ్ సీజన్‌ మొద‌లైనా రైతుబంధు పూర్తి స్థాయిలో అమ‌లు కావ‌డం లేదు. ఓవైపు వ‌ర్షాలు ఆల‌స్యమై అల్లాడుతున్న రైతులు …మ‌రోవైపు పెట్టుబ‌డి లేక త‌ల్లడిల్లుతున్నారు… జూన్‌లోనే ఇవ్వాల్సిన రైతుబంధు నగదు డిపాజిట్లను జూలైలో మొద‌లుపెట్టారు… అయితే కేవ‌లం ఐదు ఎక‌రాల లోపు ఉన్న వారికి మాత్రమే బ్యాంక్ అకౌంట్లలో డ‌బ్బులు పడుతున్నాయి ..

ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హమీ మేరకు పెంచిన మొత్తం.. ఎక‌రానికి ఐదువేల రూపాయ‌ల చొప్పున ఇస్తున్నారు… ఐదు ఎక‌రాల పైగా భూమి ఉన్న రైతుల‌కు ఇప్పటిదాకా చిల్లిగ‌వ్వకూడా ఇవ్వలేదు… అధికారుల‌ను రైతులు నిల‌దీసినా స‌మాధానం చెప్పడం లేదు. ఇటు వ్యవ‌సాయ శాఖ అధికారులు కాని అటు బ్యాంక్ అధికారులు కాని నోరు మెదపడం లేదు…

దాంతో అయిదెకరాలకు మించి పొలం ఉన్న రైతుల విషయంలో ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుందో అర్థంకాక రైతులు తలలు పట్టుకుంటున్నారు .. రైతుబంధుపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న రైతులు ఇప్పుడు అక‌స్మాత్తుగా నిలిచిపోవ‌డంతో ల‌బోదిబో మంటున్నారు… ప్రభుత్వానికి ఈ ప‌థ‌కం భార‌మ‌వుతుంద‌ని అనుకుంటే ఇర‌వైకి పైగా ఎక‌రాలు ఉన్న వారిని దాని నుంచి మిన‌హాయించాల‌ని సూచిస్తున్నారు .. మరి సర్కారు లెక్కేంటో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here