Home News Stories

ట్రెండ్ మార్చిన ఎంఐఎం…

ఎంఐఎం ఎన్నికల వ్యూహాలు మార్చింది … మిత్ర పక్షం టీఆర్‌ఎస్‌ను గద్దె ఎక్కించేందుకు క్షేత్ర స్థాయిలో పావులు కదుపుతోంది… గతంలో ఏ పార్టీతో స్నేహబంధం ఉన్నా వారి తరపున బహిరంగం ప్రచారంలో కనిపించేవారు కాదు ఆ పార్టీ నాయకులు.. అయితే ఈ సారి తమ సహజ వైఖరికి భిన్నంగా టిఆర్‌ఎస్‌ సభలకు తమ ప్రతినిధులను సైతం పంపిస్తున్న ఎంఐఎం … ఓపెన్‌ క్యాంపైనింగ్‌ చేస్తోంది.ఈసారి ఓపెన్ క్యాంపెయినింగ్ కి దిగిన ఎంఐఎం స్కెఛ్ ఎంటీ…?

పాతబస్తీ అడ్డాగా రాజ్యం ఏలుతున్న ఎంఐఎం పార్టీ ముందు నుంచి ఒక స్పష్టమైన రాజకీయ వైఖరితో ముందుకు సాగుతూ వచ్చింది.. అధికారంలో ఉన్న పార్టీతో స్నేహసంబంధాలు నెరపడం ఒవైసీ సోదరులుకు ముందు నుంచి ఉన్న అలవాటు… అయితే అదంతా స్నేహ పూర్వక విధానంగానే సాగేది తప్ప .. ప్రత్యక్షంగా పొత్తులు వంటివి కనింపించేవి కావు .. 1999లో టీడీపీతో దోస్తీ చేసిన ఎంఐఎం హైకమాండ్‌ 2004 వచ్చేసరికి కాంగ్రెస్‌తో స్నేహ గీతాలు పాడింది… అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మంచి సంబంధాలు నెరిపారు…

2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగాయి… అయితే ఓపెన్‌గా ఆ బంధం కనిపించేది కాదు.. వారి స్నేహం తెరవెనుక లాలూచీ లానే మిగిలేది… అంటే పాతబస్తీలోనూ కాంగ్రెస్‌ తన అభ్యర్ధుల్ని ఎన్నికల బరిలో దింపుతుంది … నామ్‌కే వాస్తేగా పోటీ చేసే సదరు అభ్యర్ధులు… సీరియస్‌గా ఎన్నికల ప్రచారం చేయరు… ఎంఐఎం అభ్యర్ధులకు పోటి ఇచ్చి నిలువరించే ప్రయత్నం ఎక్కడా జరగదు…. గట్టి ప్రత్యర్ధులు ఉండరు కనుక మజ్లిస్‌ అభ్యర్ధులు తేలిగ్గా గట్టెక్కేస్తారు. .. ఇక లోపాయికారీ ఒప్పందం ఉన్నా .. ప్రత్యక్షంగా ఏ వేదిక మీద నుంచి రెండు పార్టీల వారు ఫలానా పార్టీకి మద్దతు ఇవ్వమని, గెలిపించమని అభ్యర్ధించరు … ఏది జరిగినా తెర వెనుక వ్యూహాలే. ఇదీ ఇప్పటి వరకు మజ్లిస్‌ నేతలు కొనసాగించిన వైఖరి.

తెలంగాణా రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌తోనూ స్నేహ సంబంధాలు కొనసాగించారు ఒవైసీ బ్రదర్స్‌. అటు గులాబీ బాస్‌ స్వయంగా ఎంఐఎం తమ మిత్ర పక్షం అని అధికారికంగా ప్రకటించారు… అటు అసద్‌ కూడా ఆ స్టేట్‌మెంట్‌కు మద్దతు ఇచ్చారు… అంతే కాదు ఈసారి మజ్లిస్‌ మరో అడుగు ముందుకు వేసింది… తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ఎంఐఎం హైకమాండ్‌ తీవ్రంగా కష్టపడుతోంది… ఒవైసీ సోదరులు అటు కేటీఆర్‌తోను, ఇటు కేసీఆర్‌తోనూ ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు వ్యూహాల పై ఇరువురు చర్చించుకుంటున్నారని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి…ఆ క్రమంలో ఇప్పుడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు నిర్వహించే కార్యక్రమాలకు, సభలకు ఎంఐఎం ప్రతినిధులు హాజరువుతున్నారు…

ఎంఐఎం నేతలు తమ పార్టీ కండువా వేసుకుని మరీ టిఆర్‌ఎస్‌ వేదికలపై నుంచి ప్రసంగిస్తున్నారు. ముస్లింలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వారు వివరిస్తున్నారు… ఇటువంటి ప్రభుత్వం ఉంటేనే తమ వర్గ అభ్యున్నతి జరుగుతుందని, ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధిస్తున్నారు. స్వయంగా అసద్‌, ఇతర నేతలు కూడా సభల్లో అదే వాయిస్‌ వినిపిస్తున్నారు .. అదే సమయంలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీల పై విమర్శలు గుప్పిస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం చెడిపోకుండా .. ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటున్నారు నేతలు .. గత ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను నిలబెట్టిన ఎంఐఎం .. ఈసారి మాత్రం పాతబస్తీకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది… ఏడు సిట్టింగ్‌ స్థానాలతో పాటు కేవలం రాజేందర్‌ నగర్‌లో మాత్రమే తమ అభ్యర్ధులను ఎన్నికల బరిలోకి దింపింది.. అయితే నామినేషన్‌ దాఖలు ప్రక్రియకు ఇంకా సమయం ఉండటంతో మరో జాబితా విడుదల అవుతుందేమో అన్న సందేహాలు మజ్లీస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here