Home News Politics

జేసీ కోట కూలుతుందా ?

ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న నియోజకవర్గాలలో తాడిపత్రి ముఖ్యమైంది. 1985 నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం వరుసగా 7 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుస్తుంది. సీమలో పులివెందుల తరువాత తాడిపత్రి నుంచి జేసీ కుటుంబానిది రికార్డు వరుస విజయాలు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థూలంగా చూస్తే జేసీ కుటుంబం ప్రతి ఎన్నికలో చెమటోడ్చి గెలిచింది. వీరి గెలుపులో కీలకమైన నాయకులు ఇప్పుడు వైసీపీ లో చేరడంతో తాడిపత్రి పోరు ఆసక్తికరంగా మారింది….

దివాకర్ రెడ్డి తొలిసారి 1983లో ఇండిపెండెంటుగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1985-2009 మధ్య కాంగ్రెస్ తరుపున పోటీ చేసి డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు, 2014లో టీడీపీ లో చేరి అనంతపురం ఎంపీ గా దివాకర్ రెడ్డి ,తాడిపత్రి MLA గా ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 1989 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి ఓటమిని తృటిలో తప్పించుకొని 1219 ఓట్ల తేడాతో పేరం నాగిరెడ్డి మీద గెలిచారు.అప్పటి నుంచి ఎన్నికల ముందు దివాకరెడ్డి గెలుపు అవకాశాల మీద పత్రికలు ప్రత్యేక కథనాలు రాసేవి. వీటికి తగ్గట్టుగానే ప్రతి ఎన్నికలో మెజారిటీలు మారుతుండేవి.

1994 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి 22,880 ఓట్ల మెజారిటీ, 2014ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి 22,172 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1999లో 4043,2004లో 7877, 2009లో 6955 ఓట్ల మెజారిటీతో దివాకర్ రెడ్డి గెలిచారు. నాలుగు ఎన్నికల్లో పేరం నాగి రెడ్డి టీడీపీ తరుపున వీరికి ప్రత్యర్థి కాగా 2014లో పేరం నాగి రెడ్డి వియ్యంకుడు V.R.రామి రెడ్డి ప్రత్యర్థి. జేసీ వర్గంలో కీలకనాయకుల్లో భోగవతి నారాయణ రెడ్డి ముఖ్య నాయకుడు. దివాకర్ రెడ్డికి ధర్మవరం కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డికి మధ్య జరిగిన గొడవల్లో దివాకర్ రెడ్డి తరుపున ఫ్యాక్షన్ నడిపింది భోగవతి నారాయణ రెడ్డి. ప్రతి ఎన్నికలో భోగవతి నారాయణ రెడ్డి పోలింగ్ రోజు వ్యవహారాలు చూసి ప్యూహం రచిస్తారు.

భోగవతి నారాయణ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీ లో చేరాడు. భోగవతి నారాయణ రెడ్డి లేక పొతే పోలింగ్ రోజు జేసీ సోదరులకు కుడి చేయి పడిపోయినట్లే. ప్రభాకర్ రెడ్డి తమ అనుచరులు ఆర్ధికంగా బలపడటాన్ని సహించడు అంటారు. కొన్ని సంఘటనలు పరిశీలిస్తే అది నిజం అనిపిస్తుంది. తాడిపత్రిలో సుమారు 700 గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వివిధ ప్రాతాలనుంచి ముడి గ్రానైట్ ను తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్సింగ్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. 2014 ఎన్నికల ముందు వరకు జేసీసోదరుల సహాయంతో గ్రానైట్ మీద తక్కువ రాయల్టీ, సేల్స్ ట్యాక్స్ కట్టి వ్యాపారము చేసేవారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున సీనియర్ నాయకుడు పేరం నాగిరెడ్డికి టికెట్ దక్కవలసి ఉండగా చివరి నిముషంలో ఆయన ఆర్ధికంగా తట్టుకోలేరని ఆయన వియ్యంకుడు గ్రానైట్ వ్యాపారి అయినా V.R.రామి రెడ్డి కి వైసీపీ టికెట్ ఇచ్చింది. VR రామి రెడ్డిని ,జగదీశ్వర్ రెడ్డికి మరియు జయచంద్రా రెడ్డి సోదరులను ఆర్ధికంగా దెబ్బకొట్టాలన్న ఆలోచనతో తాడిపత్రికి నాలుగు వైపులా మార్కెటింగ్ చెక్ పోస్ట్స్ పెట్టించి రాయల్టీని, sales టాక్స్ ని గట్టిగా వసూల్ చేశారు. జేసీ బ్రదర్స్ లక్ష్యం నెరవేరింది కానీ తమ వర్గం మరియు రాజకీయాలకు సంబంధం లేని వ్యాపారులు కూడా దీనితో దెబ్బ తిన్నారు. గత 5 సంవత్సరాలలో సుమారు 300 కంపినీలు మూతపడ్డాయి. దీనితో స్థానికంగా కొన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు. ప్రజల్లో జేసీబ్రదర్స్ పట్ల వ్యతిరేకత పెరిగింది.

తమ నిర్ణయం బూమరాంగ్ అవుతుందని గమనించిన ప్రభాకర్ రెడ్డి 2018లో చెక్ పోస్ట్స్ ను ఎత్తివేయించాడు కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రాక ముందు నుంచి టీడీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాకర్ల రంగనాథ్ లాంటి నాయకులను కూడా ప్రభాకర్ రెడ్డి ఇబ్బంది పెట్టటంతో రంగనాథ్ కూడా వైసీపీలో చేరారు. జేసీ దగ్గరి బంధువులు చిత్తరంజన్ రెడ్డి ,ప్రతాప్ రెడ్డి , మైనారిటీ నాయకుడు ఫయాజ్ కూడా వైసీపీ లో చేరారు.

గత సెప్టెంబర్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా త్రైత సిద్ధాంత ఆశ్రమ ప్రబోధానంద తో జేసీ అనుచరులు గొడవపడ్డారు. జేసీ తమ ఆశ్రమాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ప్రబోధానంద ఆరోపించారు. నిన్న జగన్ మీటింగులో కొన్ని వందల మంది ప్రబోధానంద శిష్యులు పాల్గొన్నారు. సరే మరి ఇంత మంది జేసీ వర్గ నాయకులు వైసీపీలో చేరారు కాబట్టి ఈసారి తాడిపత్రిలో జేసీ కుటుంబం ఓడిపోతుందా?

ఎక్కువమంది జేసీ వాళ్ళు ఓడిపోతారా? చివర్లో ఎమన్నా చెయ్యకపోతారా?గెలుపుకోసం వాళ్ళు ఎంత లెక్కైనా డబ్బు వెదజల్లుతారు,దేనికైనా తెగిస్తారన్న వాళ్ళే ఎక్కువమంది. రూరల్ ప్రాంతంలో వైసీపీ ఆధిక్యత కనిపిస్తుండాగా జేసీ వాళ్లకు తాడిపత్రి టౌన్ లో ఇప్పటికి ఆధిక్యత కనిపిస్తుంది.ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గం ఇప్పటికి జేసీకుటుంబానికి మద్దతు ఇస్తూన్నట్లున్నారు. పాత ఫ్యాక్షన్ గొడవలను మర్చిపోయి భోగవతి నారాయణరెడ్డి,పెద్దారెడ్డి మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తారా అన్నది ఇక్కడ ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here