Home News

జిల్లాలో మంత్రికే ఎసరు పెట్టిన ఆ ఇద్దరు ఖాకీలు…!

పేరుకి మాత్రం కానిస్టేబుళ్ల రేంజ్‌ … కానీ హైలెవల్‌ స్కాంకి స్కెచ్‌ గీసారు.. జిల్లాలోని ఒక ముఖ్య ప్రజాప్రతినిధికి సమాంతరంగా మరో వ్యవస్థ నడిపేందుకు ప్రయత్నించారు… ఆయన పరిధిలోని బదిలీల్లో అంతా తామే అన్నట్లుగా ప్రవర్తించారు… ఎస్సై నుంచి డీఎస్పీ వరకు ఎవరికైనా పోస్టింగ్‌లు రెడీ అని ప్రచారం చేసుకున్నారు… పోస్టింగుల కోసం తమను కలిసిన వారి హోదాలకు సైతం సదరు కానిస్టేబుళ్లు కనీస గౌరవం ఇచ్చేవారు కాదంట… తమ దందా కోసం నకిలీ లెటర్‌ప్యాడ్లు సృష్టించి ప్రజాప్రతినిధి సంతకాన్నీ ఫోర్జరీ చేశారంట… ఈ వ్యవహారం డిపార్ట్‌మెంట్లో పెద్ద కలకలమే రేపుతోందిప్పుడు…

ఇది ప్రకాశం జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ల నిర్వాకం … ఎస్‌బీ, ఇంటెలిజెన్స్‌, స్టేషన్లలో ఐడీ పార్టీలు, అన్నింటా మన వాళ్లే ఉండాలి.. అంతా మన కనుసన్నల్లోనే నడవాలి.. మనం కన్నెర్ర జేస్తే కదిలిపోవాలి… ఇదీ ప్రధాన ధ్యేయం.. తదనుగుణంగా కొందరు సీఐలు, సుమారు 30 మంది ఎస్సైలు, ఏఎస్సై స్థాయి నుంచి కానిస్టేబుల్‌ దాకా 40 మంది సిబ్బందితో ఒక జాబితా సిద్దం చేశారు… వారిని బదిలీ చేయాలంటూ ఏకంగా జిల్లా మంత్రి బాలినేనినే కలిసారంట … అయితే ఆయన ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో నేనెప్పుడూ ఇలా చేయలేదు… ఆ పేరు చెడగొట్టే ప్రయత్నం చేయవద్దు … మీ పని మీరు చేసుకోండి.. అంటూ గట్టిగానే మందలించారంట..

అయినా పద్దతి మార్చుకోని ఆ కానిస్టేబుళ్లు మినిస్టర్‌ కొడుకు దగ్గరకు చేరి … చక్రం తిప్పే ప్రయత్నం చేశారంట … అక్కడా వారి ఆటలు సాగలేదంట.. తర్వాత ఎస్సైలు, సిబ్బంది జాబితాతో జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులను కలిశారంట … తాము అందజేసిన జాబితాలో ఉన్న వారికి మీ నియోజకవర్గాల్లో పోస్టింగులు లేకుండా చూడాలంటూ కోరారంట… వీరి వ్యవహారశైలిని కొందరు ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అసలు మీరెవరు, మా నియోజకవర్గంలోని బదిలీలతో మీకేం పనంటూ నిలదీసినట్లు తెలిసింది.

ఆ కానిస్టేబుళ్లు వ్యవహరించిన తీరు గత కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లా వైసిపి కార్యకర్తల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది… వారిలో ఒక కానిస్టేబుల్‌ సదరు ప్రజాప్రతినిధి ఇంట్లో అంతా తానే అయి వ్యవహరించేవాడు… ఎవర్ని ఆయన వద్దకు పంపాలి, ఎవర్ని పంపకూడదనే విషయాన్నీ తనే నిర్ణయించేవాడు… ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తల్ని సైతం అడ్డుకున్నారు. ఇతని వైఖరితో పలువురు తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలిసింది… పోస్టింగుల పేరిట వీరు నిర్వహిస్తున్న దందాపై కూడా కొన్ని రోజులుగా పార్టీ కార్యర్తల మధ్య చర్చ జరుగుతోంది.

ఆ జాబితా ఆధారంగా బదిలీలకు అమాత్యుడు సుముఖంగా లేకపోయినా ఆ కానిస్టేబుళ్లు వెనుకడుగు వేయలేదు … ఏకంగా నకిలీ లేఖలు, ఫోర్జరీలకు దిగారు … తమను ప్రసన్నం చేసుకున్న వారికి పోస్టింగులు వేయిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు.బదిలీల పేరుతో బేరసారాలకు తెరతీశారు.

ఈ తతంగం బయటకు పొక్కడంతో కానిస్టేబుళ్ల దందాపై జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. స్టేషన్లలో ఉద్యోగాలు చేయాల్సిన కానిస్టేబుళ్లు ప్రజాప్రతినిధి ఇంటిలో తిష్ట వేసి ఇటువంటి చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఆయా స్టేషన్ల అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విచారణకు అదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో బదిలీల కోసం ఎన్ని సిఫారసు లేఖలు వచ్చిందీ ఆరా తీశారు. పలు శాఖల్లో భారీగా లేఖల్ని గుర్తించారు. మొత్తమ్మీద వారి యాపారం చూస్తూ సొంత డిపార్ట్‌మెంట్‌ వారే ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారంట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here