Home News Updates

చింతమనేని రూటు మార్చారా…!

ఫైర్‌బ్రాండ్‌గా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పిచ్చ ఫేమస్‌ .. అలాంటాయన ఒక్కసారిగా సాధుజీవిగా మారిపోయారు .. ఎవరైనా కదిలిస్తే ఇప్పుడు నన్ను ఒదిలెయ్యండి బాబోయ్ అని మొత్తుకుంటున్నారట .. ఆఖరికి మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ కావాలని అడిగితే .. ఇంకేముంది అంతా అయిపోయింది .. నన్నేం ఇంటర్వ్యూ చేస్తారు .. నేనేం చెబుతానంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారంట పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.

ఎమ్మెల్యేగా తన దూకుడుతో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్క్‌ వేసుకున్న నేత .. రకరకాల వివాదాలతో తరచూ ఫోకస్‌ అవుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ఓటమి తర్వాత సడన్‌గా సైలెంట్‌ అయ్యారు .. మీడియా వెళ్లి చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే చాలు వద్దు బాబూ నన్ను కొన్నాళ్లు వదిలేయండి .. ప్రశాంతంగా బతుకుతున్నాను అంటున్నారట .. కాదు ఒకసారి కలుస్తామంటే వద్దు నాయనా .. నన్ను నాశనం చేసిందే మీ మీడియావాళ్లు .. మళ్లీ కలిసి ఏం చేస్తారు .. నేను ప్రస్తుతం జనాన్నే కలవడం లేదు .. ఇంట్లో కూర్చుంటున్నా .. నా గేదెల్ని మేపుకుని పాలు పిండుకుంటున్నానని సెలవిస్తున్నారంట .. నియోజకవర్గం ప్రజలు ఎవరైనా తనని ఎవరన్నా కలవడానికి వస్తే ముభావంగా మాట్లాడి పంపించేస్తున్నారట ..

ఇటీవల ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన చింతమనేని .. హాజరైన జనాన్ని చూసి ఆశ్చర్యపోయారట .. ఇంతమంది జనం వచ్చారా ?.. చిన్న మీటింగ్ కే ఇంతమంది వచ్చారు .. మరి మనకి ఓట్లెందుకు పడలేదో అని వ్యాఖ్యానించారట .. నేనెందుకు ఓడిపోయానో నాకే అర్ధం కావడం లేదని సమావేశం లో చింతమనేని అన్నారట . ఆ రోజు సమావేశానికి వచ్చిన చింతమనేనిని చూసి కార్యకర్తలు అసలు ఈయన .. ఆ చింతమనేని ప్రభాకరేనా అని ఆశ్చర్యపోయారట .. దాంతో ఓటమి ఆయనకు చాలా తత్వం నేర్పినట్లుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి..

ఇక ఎమ్మెల్యేగా ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాలు తిరిగే చింతమనేని ఇప్పుడు అసలు బయటకే రావడం లేదు .. ఆయనకి రెండువందల వరకు గేదెలు , మేకలు ఉన్నాయి .. గేదెల ఫాం లో ఆయనే దగ్గరుండీ అన్ని చూసుకుంటున్నారట .. ఇక ఆయనకి చెందిన పామాయిల్ తోటలు , నిమ్మతోటల్లో తానే స్వయంగా పురుగుమందులు పిచికరీ చేస్తున్నారట చింతమనేని .. మరోపక్క సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటున్నారట .. తన సన్నిహితుల దగ్గర ఈ పొలాల్లో ప్రశాంతంగా ఉంది అని వేదాంతం మాట్లాడుతున్నారట

రీసెంట్‌గా ఆయన జానంపేట వద్ద పోలవరం కాలువ పై నీళ్లపైపులని ఎత్తుకుపోయారని రైతులు ఆయనపై కేసులు పెట్టారు .. వాస్తవానికి గతంలో రైతుల కోసం ఆ పైపులని ఆయనే సొంత డబ్బులతో కొనుగోలు చేశారని సన్నిహితులు చెబుతున్నారు .. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత … తనకు ఓట్లేయలేదన్న ఆగ్రహంతో ఆ పైపులను ట్రాక్టర్ లో వేసుకుని తీసుకెళ్లిపోయారంట చింతమనేని .. ఇది తీవ్ర వివాదం అయింది .. సోషల్ మీడియాలోనూ చింతమనేనిని ఆటాడుకున్నారు .. దీంతోతనకీ వివాదాలొద్దు .. ఈ గొడవలు వద్దు .. కావాలంటే ఆ పైపులు పట్టుకుపోండంటూ తన ఇంటికి వచ్చిన పోలీసులకి ఆ పైపులు అప్పగించేశారట ..

నాలుగురోజుల క్రితం తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు అటవీశాఖాధికారినిపై దాడి చేశారు.. దానికి సంబంధించి అటు సోషల్‌మీడియాలో, ఇటు లోకల్‌ ఛానళ్లలో తెలంగాణ చింతమనేని అంటూ కృష్ణారావు గురించి ప్రచారం జరిగింది .. ఎమ్మార్వో వనజాక్షి పై చింతమనేని దాడిని .. ఫారెస్ట్ అధికారి అనితపై కృష్ణారావు చేసిన దాడితో పోలుస్తూ వార్తలు రాశారు … ఇదంతా చూసిన చింతమనేని తెలంగాణలో ఏదో జరిగితే నాతో పోలుస్తారా ఇదెక్కడి దారుణం .. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా వదిలిపెట్టరా అని సన్నిహితుల దగ్గర తెగ ఇదైపోతున్నారంట.. మొత్తానికి.. సాధుజీవిగా మారిన … చింతమనేని మళ్లీ చర్చల్లో వ్యక్తి అయ్యారిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here