Home News Stories

కర్నూలు టీడీపీలో మారుతున్న టిక్కెట్ల లెక్కలు…!

కర్నూలు టీడీపీలో టికెట్ల లెక్కలు మొదలయ్యాయి. జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో ఇద్దరికి పైగా టికెట్‌ ఆశావహులు ఉండటం కోట్ల టీడీపీలో చేరితే తెర పైకి వచ్చే కొత్త అభ్యర్థులు,మారుతున్న సమీకరణల పై ఆందోళనలో ఉన్నాయి సైకిల్ పార్టీ శ్రేణులు. నాలుగున్నరేళ్లు ఇన్‌చార్జిలుగా పని చేశామని, పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించామని, ఈ సమయంలో మరొకరికి టికెట్‌ ఇస్తే ఎలా..? అని మరికొందరు మదనపడుతున్నారు. కొత్త నేతల రాక,మారుతున్న రాజకీయ పరిణామాలతో కర్నూలు టీడీపీలో ఏం జరుగుతుంది….

గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం మూడు స్థానాలు దక్కించుకున్న టీడీపీ 8 నుంచి 10 స్థానాలను టార్గెట్ పెట్టుకుని గత కొన్ని నెలలుగా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో పోటీచేసిన వారిలో కొందరిని మార్చే అవకాశం కనిపిస్తోంది. ఆ కొందరు ఎవరన్న ఉత్కంఠ పార్టీ నాయకుల్లో నెలకొంది. అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో తాజా రాజకీయం ఇలా ఉంది.

కర్నూలు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టీజీ వెంకటేశ్‌ బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని సీఎం చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారు. టీజీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎస్వీకే టికెట్‌ అని అనుకున్నారు. కానీ ఏడాది నుంచి తనయుడు భరత్‌ను బరిలో దించాలని టీజీ వెంకటేశ్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీజీబీ యూత్‌ ఆధ్వర్యంలో టీజీ భరత్‌ విజన్‌ యాత్ర పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ తనకే టికెట్‌ అని ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారు. మరోవైపు పార్టీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వే ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయని టీజీ వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఇద్దరిలో అభ్యర్థి ఎవరన్న చర్చ నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

కోడుమూరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మణి గాంధీ టికెట్‌ ఆశిస్తున్నారు.మణిగాంధీ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కోట్లకు ఈ నియోజకవర్గంలో బలమైన వర్గం ఉంది. ఆయన పార్టీలో చేరితే అభ్యర్థి ఎంపికపై ఆ ప్రభావం ఉండొచ్చు. కోట్ల సూచించిన అభ్యర్థికే టికెట్‌ ఇస్తారా..? లేక మణిగాంధీని బరిలో దింపి గెలిపించుకురమ్మని కోట్లను కోరుతారా..? మరొకరు తెరపైకి వస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆకెపోగు ప్రభాకర్‌ కూడా కోడుమూరు టికెట్‌ ఆశిస్తున్నారు.

ఆలూరు నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఆయనకే టికెట్‌ అని ఆ పార్టీ జిల్లా నాయకులు అనుకున్నారు. కోట్ల టీడీపీలో చేరనుండటంతో ఆలూరు నుంచి ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మను బరిలో దింపే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. వీరభద్రగౌడు తనకు అన్యాయం చేయవద్దని, నాలుగున్నరేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని సీఎం చంద్రబాబును కలిసి కోరినట్లు తెలిసింది. తనకు టికెట్‌ ఖాయమని వీరభద్ర గౌడ్‌ ధీమాగా ఉన్నారు. వైకుంఠం మల్లికార్జున, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ టికెట్‌ ఆశిస్తున్నారు. కోట్ల టీడీపీలోకి రాకపోతే వీరభద్రగౌడుకే టికెట్‌ ఖాయమంటున్నారు. కోట్ల టీడీపీలో చేరితే ఏమైనా జరగొచ్చని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

ఇక నంద్యాలలో నలుగురు నాయకులు రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికే నంద్యాల టికెట్‌ ఖాయమని ఆయన వర్గీయులు అంటున్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్నందున, అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను బరిలో దింపవచ్చని ఆయన మద్దతుదారులు అంటున్నారు. మరోవైపు తన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేస్తారని సిట్టింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇటీవల ప్రకటించారు. శ్రీధర్‌రెడ్డి సీఎంను కలిసి తన మనసులోని మాట చెప్పివచ్చారు. సీఎం సానుకూలంగా ఉన్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి నంద్యాల, ఆళ్లగడ్డలో ఏదో ఒక చోట అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. నంద్యాల నుంచి ఎవరిని బరిలోకి దింపినా గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఇలా ఈ నలుగురి మధ్య నంద్యాల టీడీపీ రాజకీయం నడుస్తుంది.

ఈ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం టీడీపీకి కీలకం. గత ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో శ్రీశైలం నుంచి పోటీ చేయాలని ఏరాసు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయమై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ను వెంటబెట్టుకుని ఇటీవల అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. కోట్ల టీడీపీలో చేరితే ఆయనకు కర్నూలు ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ టికెట్‌ ఆశిస్తున్న ఎంపీ బుట్టా రేణుకను పాణ్యం నుంచి దింపవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై అయిష్టత చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు అధి నాయకత్వం ఊహించని విధంగా కొత్త వ్యక్తిని బరిలోకి దింపుతోందని, ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని పార్టీ నాయకులు పేర్కొంటుండటంతో ఉత్కంఠ పెరిగింది. ఆ వ్యక్తి వస్తే రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల లోక్‌సభ పరిధిలో ప్రభావం ఉంటుందంటున్నారు. దీంతో పాణ్యం టికెట్‌ ఎవరికి అన్నది తుదిదాకా తేలకపోవచ్చని అంటున్నారు.

నందికొట్కూరు టికెట్‌ను గత ఎన్నికల్లో బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి ఆశిస్తున్నారు. తనకే టికెట్‌ ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. అమరావతిలో మకాం వేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 8వ తేదీన కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి తన సన్నిహితుడు బండి జయరాజును బరిలో దింపేందుకు యత్నిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. ఇక్కడ అభ్యర్థిత్వంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడును టీడీపీ బరిలో దింపింది. వరుసగా రెండుసార్లు పోటీ చేసి బీటీ నాయుడు ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి రావడంతో వాల్మీకి ఫెడరేషన్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక టీడీపీలో చేరారు. ఆమె కూడా బీసీ కావడంతో ఎంపీ టికెట్‌ ఖాయమని అనుకున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెకు టికెట్‌ అనుమానమే అంటున్నారు. ఈసారి కర్నూలు ఎంపీ టికెట్‌ ఓసీ అభ్యర్థికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. డోన్‌, పత్తికొండ నుంచి కేఈ సోదరులు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిజర్వు కానివాటిలో 10 అసెంబ్లీ స్థానాలను ఓసీ నాయకులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే బీసీలకు ఎంపీ టికెట్‌ ఇవ్వకపోతే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు. బీటీ నాయుడు, గుడిసె కృష్ణమ్మ ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి.