Home News

కన్నా కి ఎర్త్ పెట్టిన బీజేపీ అధిష్టానం…!

ఏపీలో బలపడాలని కమలం పార్టీ భారీ స్కెచ్‌లే వేస్తోంది. వీలైతే ప్రధాన ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించేసి ఆ పాత్ర పోషించేందుకు ఉవ్విళ్లురూతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని మాత్రం అధినాయకత్వం అంతగా పట్టించుకోవడం లేదు. ఏదో ఉన్నారంటే ఉన్నారనే విధంగా సదురు పెద్దాయన్ను ట్రీట్‌ చేస్తోంది ఆ పార్టీ హైకమాండ్‌.

2024 ఎన్నికల నాటికి ప్రధాన పార్టీగా అవతరించాలని స్కెచ్‌ల మీద స్కెచ్‌లు వేస్తోంది బీజేపీ. అందులో భాగంగా ఏపీలోనూ టీడీపీ బిగ్‌ షాట్స్‌కు గాలమేసింది. ముగ్గురు రాజ్యసభ సభ్యులను తమ పంచన చేరేలా చేసింది బీజేపీ. ఈ క్రమంలో ఏపీలో మరింత దూకుడుగా వెళ్లేందుకు.. మరింత మంది టీడీపీ సీనియర్లను.. ఓ స్థాయిలో ప్రభావితం చేసే నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడులో ఉండాల్సిన ఓ మెయిన్ క్యారక్టర్ మాత్రం మిస్‌ అవుతుంది. టీడీపీకి చెందిన బడా నేత మొదలుకుని.. ఛోటా లీడర్ల వరకు ఢిల్లీలో చేరుతున్నా.. ఆ చేరికల కార్యక్రమంలో ఎక్కడా బీజేపీ ఏపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ మాత్రం మచ్చుకు కూడా కన్పించడం లేదు. ఇప్పుడిదే బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

గత టీడీపీ ప్రభుత్వాన్ని,చంద్రబాబును విమర్శించాలన్నా ముందు వరుసలో ఉంటారు ఏపీ బీజేపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత కూడా టీడీపీని పొలిటికల్‌ డిమాలిష్‌ చేసే కార్యక్రమంలోనూ కన్నా ప్రధాన పాత్ర పోషిస్తారని అంతా భావించారు. కానీ విచిత్రంగా ఎన్నికల తర్వాత నుంచి బీజేపీలో కన్నా హవా రోజు రోజుకూ తగ్గిపోతోన్నట్టు కన్పిస్తోంది. ఏవో చిన్న చితకా కార్యక్రమాలు తప్ప.. పెద్ద పెద్ద చేరికల విషయంలో కన్నా ప్రమేయం లేకుండానే అంతా ముగిసిపోతోంది.

నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీలో చేరితే కన్నా కనపడ లేదు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, అంబికా కృష్ణలు టీడీపీలో చేరితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎక్కడా కనపడ లేదు. ఇక ఛోటా లీడర్‌ లంకా దినకర్‌ చేరికలోనూ కన్నాకు స్థానం దక్కలేదు. ఈ క్రమంలో అసలు కన్నా పాత్రపై ప్రస్తుతం బీజేపీలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

గడచిన ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసినా.. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను అధ్యక్షునిగా ఎన్నుకుంటే ఆ ఫ్లేవర్‌ తమకు ఉపయోగపడుతుందని పార్టీ అధినాయకత్వం భావించినప్పటికీ.. అది కూడా ఏ మాత్రం అక్కరకు రాలేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మెజార్టీ పవన్‌ కళ్యాణ్‌ వైపు మొగ్గు చూపడం మిగిలిన వారిలో చాలా మంది వైసీపీకి.. స్వల్పంగా టీడీపీకి ఓట్లేశారు కానీ.. బీజేపీని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను ఇంకా ఆ పదవిలో కొనసాగించాల్సిన అవసరం ఉందా..? అనే దిశగా కూడా పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తోందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో నుంచి బీజేపీలోకి చేరారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన అనుచరులకే పెద్ద పీట వేస్తున్నారనేది మరో ప్రచారం

మొత్తమ్మీద టీడీపీని టార్గెట్‌ చేసుకుని తమ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో ఏపీ బీజేపీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే దాఖలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here