ఊసరవెల్లి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రంగులు మారుస్తుంటుంది. పార్టీలు మారే నాయకులను సాధారణంగా వీటితోనే పోలుస్తుంటారు. తెలుగురాష్ట్రాల్లో ఊసరవెల్లి రాజకీయాలు మామూలేగానీ అందులో కొందరు లీడర్లు PHDలు చేశారు. సిట్యువేషన్ కి తగ్గట్టు కండువాలు మార్చే నాయకులకు గంటా శ్రీనివాసరావుని రోల్ మోడల్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యం నుంచి టీడీపీ దాకా ఆయన మూడుసార్లు కండువాలు మార్చారు. ఇప్పుడు మరో జెండాకి జై కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు స్టీల్ ఫ్యాక్టరీలో ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే సాధారణ వ్యక్తి రాజకీయాల్లో ఇంత అసాధారణంగా ఎదిగాడంటే… మిగిలినవారికంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివాడని వేరే చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు బతకనేర్చిన గంటా. చోడవరం, భీమిలి, వైజాగ్ … ప్లేస్ ఏదయినా… పార్టీ ఏదయినా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో గంటా స్కెచ్ ఎప్పుడూ మిస్ కాలేదు.

వైసీపీ ఊపులోనూ విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు గంటా శ్రీనివాసరావు. అధికారంలో ఉన్న పార్టీలో ఉండటం, మంత్రిగా చక్రం తిప్పటానికి అలవాటుపడ్డ ప్రాణం. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు గంటా శ్రీనివాసరావు. చొక్కామార్చినంత ఈజీగా జెండాలు మార్చేయగల గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉక్కబోతకు గురవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా గంటా కనిపించడం లేదు. పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు చాలాకాలంగా ఇస్తున్నారు.
తెరవెనుక తన ప్రయత్నాల్లో తానున్నాడు. అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరకేనన్నట్లు టీడీపీకి కూడా సీన్ అర్ధమైపోయింది. అందుకే గంటా శ్రీనివాసరావుకు కూడా టిక్ పెట్టేసింది. ఇప్పటికే ఆరేడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోవటంతో …గంటా కూడా రేపోమాపో గోడ దూకేస్తాడని మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది టీడీపీ.
గంటా పార్టీ మారబోతున్నాడనే ప్రచారం ఇప్పటిది కాదు. ఆరేడునెలలనుంచీ వినిపిస్తోంది. అయినా ఇంకా ఎందుకు చేరలేదన్నదానిపై ఎన్నో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముదురనుకునే వల్లభనేని వంశీకే పచ్చజెండా ఊపిని వైసీపీ… గంటా విషయంలో గేట్లు తెరవడం లేదా అన్న అనుమానాలొస్తున్నాయి. ఎందుకంటే గంటా ముదుర్లకే ముదురనే విషయం అందరికీ తెలుసు. కూర్చునే ప్లేస్ ఇస్తే కాళ్లు బారా జాపేస్తాడనే భయం వైసీపీ నేతల్లోనే ఉంది. టీడీపీలో గంటా పరువు తీసేస్తున్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. గంటాను వ్యక్తిగతంగా ఎంత భ్రష్టుపట్టించాలో అంత పట్టించేశారు. తొందరగా టీడీపీనుంచి పంపించేస్తే ఓపనైపోతుందన్న కసిగా ఉన్నారు అయ్యన్న. మరోవైపు గంటా పార్టీలోకి రావడం వైసీపీలోని ముఖ్య నేతలకే ఇష్టం లేదు. విశాఖ జిల్లాకే చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ అన్యాపదేశంగా అదే మాట చెబుతున్నారు. గంటా కేసుల భయంతోనే వైసీపీలో చేరాలనుకుంటున్నారంటూ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు అవంతి శ్రీనివాస్. అయ్యన్నపాత్రుడి మాటలనే రిఫరెన్స్ గా తీసుకుని మరీ గంటాని దెప్పిపొడుస్తున్నారు. వైసీపీలో కీలకమైన విజయసాయిరెడ్డి రాజకీయం కూడా వైజాగ్ కేంద్రంగానే సాగుతోంది. అలాంటి జిల్లాలో మరో గట్టి పిండాన్ని పార్టీలోకి చేర్చుకునేందుకు ఆయన కూడా మానసికంగా సిద్దంగా లేరు. గంటా పార్టీలోకి రానంతమాత్రాన వైసీపీకి కూడా వచ్చే నష్టమేం లేదు.
ఏదోలా అందరికీ నచ్చజెప్పుకుని వైసీపీలో చేరడం గంటాకు రాజకీయంగా అత్యంత ముఖ్యమైన విషయం. ఇదే జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే సకుటుంబ సపరివార సమేతంగా వైసీపీలో చేరిపోయారు. అయినా గంటాకు మాత్రం అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. బేషరతుగా చేరతానంటేగానీ వైసీపీ అధినేత పార్టీలోకి రానిచ్చేలా లేరు.
ఇప్పటికయితే గంటా టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేనే. కానీ టీడీపీలో మాత్రం లేరు. తాను టీడీపీ ఎమ్మెల్యేననే విషయాన్ని ఆయనే ఎప్పుడో మరిచిపోయారు. తాళ్లతో కట్టేసినా గంటాను ఆపలేమని టీడీపీకి కూడా తెలిసిపోయింది. అందుకే మొన్నటి రాష్ట్ర కార్యవర్గంలోకూడా గంటాకి ఏ పదవీ ఇవ్వలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పట్లో లేచేలా లేదు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఆశలేదు. రాజకీయంగా మనుగడ సాగించాలంటే వైసీపీ ఒక్కటే దారి. అందుకే గంటా ఆ పనిమీదే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఊపొస్తే అప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికయితే అధికారపార్టీలో చేరితే నిశ్చింతగా ఉండొచ్చనేది గంటా ప్లాన్. జగన్ నోట ఓకే అన్న మాటొస్తే వైసీపీలోకి గంటా ఎంట్రీని ఎవరూ అడ్డుకోలేరు. అందుకే జగన్ పర్మిషన్ కోసం గంటా వెయిటింగ్. ఊసరవెల్లి మరోసారి రంగు మార్చడం ఏ క్షణమైనా జరిగిపోవచ్చు