సీఈవో పోస్ట్నుంచి పీకేశారనీ…కొత్త మేనేజ్మెంట్ టీవీ నైన్‌ని పూర్తిస్థాయిలో టేకోవర్ చేసిందనీ వార్తలు వస్తున్న సమయంలోనే ప్రైమ్ టైమ్‌లో సేమ్ స్క్రీన్‌మీద ప్రత్యక్షమయ్యాడు జర్నలిస్ట్ రవిప్రకాష్. తనమీద బ్రేకింగులిస్తున్న ఛానల్స్‌కి థాంక్స్ చెబుతూనే..తనను ఎవరూ అరెస్ట్ చేయలేదనీ, చేయలేరనీ చెబుతుంటే ఆడు మగాడ్రా బుజ్జీ అనుకున్నారు చాలామంది. కానీ తెల్లారేసరికి సీన్ సితారైంది. మొన్నటిదాకా కులం పేరెత్తితే చెప్పుతో కొట్టండనీ…కట్నం అడిగేవాడు గాడిదనీ, జ్యోతిష్యం మూఢనమ్మకమనీ… ప్రపంచానికి ఎన్నెన్నో నీతిసూక్తులు చెప్పిన గ్రేట్ జర్నలిస్ట్ అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయి తన పరువు తానే తీసుకున్నాడు.
90.5 శాతం ఉన్న షేర్హోల్డర్లకు తెలీకుండా సంస్థ ఆస్తుల్ని మళ్లించాడనీ, ఫోర్జరీ సంతకాలతో మోసం చేశాడనేది రవిప్రకాష్మీద కొత్త యాజమాన్యం చేసిన ఆరోపణ. చాలా తీవ్రమైన ఆరోపణలివి. మూడుదశాబ్ధాలుగా ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ స్టేట్ నుంచి సెంట్రల్దాకా వీవీఐపీ జర్నలిస్ట్‌గా నిర్మించుకున్న సౌధం కుప్పకూలేలా ఉంటే ఎవరయినా తాడోపేడో తేల్చుకోవాలి. తాను నిజాయితీగా ఉంటే విచారణను ఎదుర్కోవాలి. ఆరోపణల్ని తిప్పికొట్టాలి. ఎక్కడో అజ్ఙాతంలో ఉండి…రాజకీయ జోక్యంతో తనపై కుట్ర జరిగిందని ఓ వెబ్‌సైట్‌కి ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుందా. బావ కళ్లలో ఆనందంకోసమే వేసేశానని ఇదే టీవీనైన్ లోగో ముందు మొద్దు శ్రీనులాంటి క్రిమినలే రొమ్ము విరుచుకుని చెప్పిన విషయం రవిప్రకాష్‌కి గుర్తులేదా?
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల్ని ఇష్యూచేసినందుకే, చర్చకు పెట్టినందుకే తనను టార్గెట్ చేశారన్న రవిప్రకాష్ వాదనే నిజమైతే వేలమంది పేరెంట్స్ ఆయనకు నైతికంగా మద్దతిస్తారు. మిగిలిన మీడియాల మిత్రులు కూడా ఎంతోకొంత మద్దతుగా నిలుస్తారు. కానీ విషయం అదికాదని చూసేవారికి తెలిసిపోతూనే ఉంది. మరెవరినో పెట్టి మోజో టీవీ మొదలుపెట్టినప్పుడు దాని కర్త కర్మ క్రియ రవిప్రకాషేనని అందరికీ తెలిసిపోయింది. శ్రీనురాజు తన వాటాల్ని అమ్ముకున్నప్పుడే ఎంతో దూరదృష్టి ఉన్న రవిప్రకాష్ ముందే జాగ్రత్తపడ్డాడనేందుకు మోజోనే ఎగ్జాంపుల్.
తప్పేంలేదు. ఏ జర్నలిస్ట్ అయినా ఉన్నచోట సెగ తగిలితే మరో లోగో చూసుకుంటాడు. కొత్త మేనేజ్మెంట్ చేతుల్లోకి ఛానల్ వెళ్లినప్పుడు రవిప్రకాష్ కూడా గౌరవంగా తన దారి తాను చూసుకునుంటే జర్నలిస్ట్‌గా అతని క్రెడిబులిటీ మరింత పెరిగేదే. టీవీ నైన్ ప్రైమ్‌లో కనిపించే రిపోర్టర్ సాయంత్రానికి కొత్త ఛానల్లో ప్రత్యక్షమై ఉంటే దానికి బూస్టప్ లభించేది. ఏ వాదనయినా ఆయన కొత్త ఛానల్ ద్వారానో, మరో మాధ్యమం ద్వారానో వినిపించే అవకాశం ఉండేది. డే వన్ నుంచీ తాను పెంచి పోషించిన ఛానల్ మీద తనకు హక్కుందని రవిప్రకాష్ అనుకుని ఉండొచ్చు. కానీ యాజమాన్య హక్కులనేవి షేర్లు, డాక్యుమెంట్ల రూపంలో ఉంటాయన్న లాజిక్ మరిచిపోకూడదు. తీరా తప్పుకునే సమయం వచ్చాక తెగేదాకా లాగుతానంటే కొత్త మేనేజ్మెంట్ ఊరుకుంటుందా. నాలుగువైపులనుంచీ రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. జర్నలిస్ట్ సమాజం నుంచి (టీవీ9లో ఆయన లేకపోతే మనం రోడ్డున పడతాం అనకునేవారు తప్ప) ఎలాంటి మద్దతూ దొరక్కపోవడం ఈ ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికర అంశం.
రవిప్రకాష్‌ని ఇబ్బందిపెట్టడానికే ఫోర్జరీలాంటి అపనిందలు వేస్తున్నారనుకునేవారికి కూడా తమ ఆలోచన తప్పని క్లారిటీ వచ్చేస్తోంది. ఫోర్జరీ వ్యవహారాలకు, తప్పుడు నిర్ణయాలకు పక్కా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదుచేస్తోంది కొత్త మేనేజ్మెంట్. టీవీ 9 సహా ఆరు లోగోలోను రవిప్రకాష్ మోజో టీవీకి అమ్మారనేది ఇప్పుడింకో అభియోగం. ఏబీసీపీఎల్ డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదుతో రవిప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. రవిప్రకాష్, మాజీ సీఎఫ్‌వో మూర్తి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.99 వేలకు విక్రయించారు. పోయినేడాది ఈ విక్రయానికి సంబంధించి డీడ్ కూడా రాసేసుకున్నారు. టీవీ9 లోగోలకు రూ.99 వేల మొత్తాన్ని నెక్ట్స్ ఇండియా నుంచి ఏబీసీపీఎల్‌కు ‘అదర్ రిపెయిర్స్ అండ్ మెయింటెనెన్స్’ పేరుతో బదిలీ చేశారు. దీన్ని రవిప్రకాష్ ఏవిధంగా సమర్ధించుకోగలడు?
తప్పు చేసింది కాక బుకాయించే కొద్దీ వందలకోట్లు పెట్టి ఛానల్ కొన్న కొత్త మేనేజ్మెంట్కి కూడా పట్టుదల పెరుగుతుంది. కొత్త మేనేజ్మెంట్ వెనుక తెలంగాణ సీఎంకి అత్యంత సన్నిహితుడనే ప్రచారం ఉన్న మైహోం రామేశ్వరరావు ఉన్నారనే విషయం ఓపెన్ సీక్రెట్. ప్రభుత్వం మీద నిందలేస్తే కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనుభవించిన వారందరికీ తెలుసు. ఓ లీడింగ్ ఛానల్ చేతిలో ఉంటే ఏదయినా చేయగలను..ఎవరినైనా శాసించగలనన్న ఆత్మవిశ్వాసం సడలుతోంది. లుక్ అవుట్ నోటీసులిచ్చేదాకా వస్తే రవిప్రకాష్‌కి అది అవమానకరమే. తన వాదన వినిపించడం, లీగల్‌గా దాన్ని నిలబెట్టుకోవడమొక్కటే రవిప్రకాష్ ముందున్న మార్గం. అలాకాదని తెరవెనుకే ఉండి ఫీలర్స్ వదిలితే ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ చేజేతులా మూసీలో పోసినట్లే.