Home News

అమరావతి రూపశిల్పి నారాయణుడెక్కడ…?

చంద్రబాబు సర్కార్‌లో ఆ నేత ఊ అంటే కన్పించేవారు.. ఆ అంటే వినిపించేవారు..రాజధానిలో ఏ పని జరగాలన్నా.. ఏ పని ఆపాలన్నా ఆ నేతే కీలకంగా ఉండేవారు. భూసమీకరణ మొదలుకుని రాజధాని నిర్మాణం వరకు ఆ నేతే కీలకం అంటూ చంద్రబాబు కూడా నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పరిపాలనా పగ్గాలు జగన్‌మోహన్ రెడ్డి చేతికి వెళ్లాయి. అయితే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా తానై వ్యవహరించిన సదురు నేత.. ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యేసరికి ముఖం చాటేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత.. ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నారు…..

గత ప్రభుత్వం నడిచిన ఐదేళ్ల కాలం పాటు.. అటు అధికారుల నోళ్లల్లోనూ.. ఇటు మంత్రులు.. ఎమ్మెల్యేల నోళ్లల్లోనూ నారాయణ జపం వినిపించేది. ఇక రాజధాని వ్యవహరాల విషయానికొచ్చేసరికి నారాయణ మంత్రం పాటించక తప్పని పరిస్థితే ఉండేది. అప్పటి సీఎం చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణం విషయంలో కానీ.. రాజధానికి సంబంధించిన ఎటువంటి డెవలప్మెంట్‌ విషయంలో కానీ నారాయణ పారాయణం చేసేవారనే చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. జగన్‌మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే నారాయణ మంత్రం వినిపిస్తూనే ఉంది. అయితే ఇది ఇంకోలా వినిపిస్తోంది. సీఆర్డీఏను టార్గెట్‌ చేసుకుంటూ.. గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ పరిధిలో జరిగిన అవకతవకలను ముందుగా నిగ్గు తేల్చాలని జగన్ సర్కార్‌ భావిస్తోంది.

అప్పుడు భూసమీకరణ విషయంలోనూ.. రాజధానిలో నిర్మించిన వివిధ కట్టడాల విషయంలోనూ మంత్రి నారాయణ చాలా కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. తనకు అప్పగించిన మున్సిపల్‌ పరిపాలనా శాఖను పక్కన పెట్టేసి మరి సీఆర్డీఏని పట్టుకుని వేలాడేవారు. రాజధానిలో నారాయణ హవా ఇంతలా నడిచింది అప్పట్లో….గత ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో అనేక అక్రమాలకు పాల్పడిందంటూ అధికార పార్టీ వైపు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కానీ దీనికి గట్టిగా కౌంటర్‌ ఇవ్వాల్సిన అప్పటి మంత్రి.. సీఆర్డీఏలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి నారాయణ మాత్రం పూర్తిగా సైలెంటైపోయారు….

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అసలు విజయవాడ.. అమరావతిలో పెద్దగా కన్పించడం లేదు. చంద్రబాబు వద్ద జరిగే సమావేశాలకు పెద్దగా హాజరు కావడం లేదు.. వచ్చినా.. ఇక ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు.. విమర్శలకు కౌంటర్‌ ఇవ్వడం కానీ చేయడం లేదు. దీంతో పార్టీలోని పలువురు సీనియర్ నేతల మధ్య ఇదే అంశానికి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీలు మారిన సుజనా.. సీఎం రమేష్‌.. గరికిపాటి, టీజీ వెంకటేష్‌ వారికి.. పార్టీలో కొనసాగుతున్న నారాయణకు పెద్దగా తేడా లేదంటూ సెటైర్లు వేస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు అంతా తానై వ్యవహరించి.. అధికారాన్ని చెలాయించిన నారాయణ.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో పార్టీ వ్యవహరాలను.. పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను తన భుజాల మీద వేసుకోవాలి కదా..? అని ప్రశ్నిస్తున్నారు….ఈ పని చేయకుండా.. తన సొంత విద్యా సామ్రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు నారాయణ హై ప్రయార్టీ ఇస్తున్నారని గుసగుసలు పోతున్నారు. ముందు నుంచి వ్యాపారస్తులను ఎంకరేజ్‌ చేయొద్దని ఎంతగా చెప్పినా.. చెవిని ఇల్లు కట్టుకుని పోరిన చంద్రబాబు వినలేదని.. ఇప్పుడు అందరి నిజస్వరూపాలు బయట పడుతున్నాయంటున్నారు సీనియర్‌ నేతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here