Home News Politics

అన్న విడిచిన బాణం ఎక్క‌డ్నించి?

ఎన్నిక‌ల‌బ‌రిలోకి వైఎస్ ష‌ర్మిల

SHARE

అన్న జైల్లో ఉన్న‌ప్పుడు ఆ బాణం జ‌న‌సామాన్యంలోకి దూసుకుపోయింది. అచ్చం అన్న‌లా మాట్లాడుతూ, నాన్న‌లా చేతులూపుతూ నాయ‌కుడు అందుబాటులో లేడ‌నే లోటు తీర్చింది. అయితే అన్న‌కు అవ‌స‌రం లేన‌ప్పుడు తెర‌వెనుకే ఉండిపోయింది. చెల్లెలు రాజ‌కీయంగా ఎదిగినా ఓర్చుకోలేని అన్న‌గా కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పించినా ఆ బాణాన్ని అమ్ముల‌పొదిలోంచి మ‌ళ్లీ తీయ‌నేలేదు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.

విశాఖ‌తో పాటు ఒంగోలు, క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానాలు కూడా ష‌ర్మిల ఆప్ష‌న్లుగా ఉన్నాయ‌నేది పార్టీ శ్రేణుల‌నుంచి వినిపిస్తున్న మాట‌.

విజ‌య‌మ్మ పులివెందుల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించారు. 2014 ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్ట‌ణంనుంచి పోటీచేసి ఓడిపోయారుగానీ…ష‌ర్మిల మాత్రం ఇప్ప‌టిదాకా ఎన్నిక‌ల‌బ‌రిలోకి దిగలేదు. అయితే 2019 ఎన్నిక‌ల్లో మాత్రం వైఎస్‌ ష‌ర్మిల పోటీచేయ‌డం ఖాయ‌మంటున్నారు. అది అన్న కోరిక‌మీద‌నా.. లేకుంటే చెల్లెలి పంతంతో అన్న స‌రేన‌న‌క త‌ప్ప‌డం లేదా అన్న‌ది వేరే విష‌యం. అన్న‌కు త‌గ్గ చెల్లెలిగా ష‌ర్మిల పోటీచేయ‌డ‌మైతే ప‌క్కా. విశాఖ‌లో త‌ల్లి ఓట‌మి జ‌గ‌న్‌ని ఇప్ప‌టికీ ద‌హించేస్తోంది. పోయిన‌చోటే వెతుక్కోవాల‌న్న‌ట్లు అక్క‌డే గెలిచి చూపించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న వైసీపీ అధినేత ఈసారి త‌న బాణాన్ని అక్క‌డ్నించి సంధిస్తార‌ని భావిస్తున్నారు.

విశాఖ‌తో పాటు ఒంగోలు, క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానాలు కూడా ష‌ర్మిల ఆప్ష‌న్లుగా ఉన్నాయ‌నేది పార్టీ శ్రేణుల‌నుంచి వినిపిస్తున్న మాట‌. ఒంగోలు వైసీపీకి అనుకూలంగా ఉన్న సీటు కావ‌టంతో ష‌ర్మిల‌ని అక్క‌డ్నించి దించే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తున్నా…మ‌రి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఎక్క‌డికి పంపిస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌. ఆయ‌న‌ని మ‌రో నియోజ‌క‌వ‌ర్గంనుంచి నిల‌బెడ‌తారా…లేదంటే పార్టీకోసం ఆయ‌న సేవ‌ల్ని వాడుకుంటారో ఇప్పుడే ఊహించ‌డం క‌ష్టం. సొంత జిల్లానుంచే నిల‌బెట్టాల‌నుకుంటే మాత్రం క‌డ‌ప‌నే. ప్ర‌స్తుత ఎంపీ అవినాష్‌రెడ్డి సొంత మ‌నిసే కావ‌టంతో ఆయ‌న‌కి న‌చ్చ‌జెప్ప‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. విశాఖ‌ప‌ట్ట‌ణ‌మా, ఒంగోలా, లేదంటే క‌డ‌ప‌నా అన్న క‌న్‌ఫ్యూజ‌న్ ఉందే త‌ప్ప ష‌ర్మిల పోటీచేయ‌డమైతే గ్యారంటీ.