Home News Politics

ప్లాన్ మార్చిన ఫ్యాన్ పార్టీ…!

SHARE

ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వైఎస్ జగన్ స్పీడ్ పెంచారు. ఇప్పటి వరకూ రోజుకు మూడు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్న జగన్ ఇక నుంచి ఐదు నియోజకవర్గాలను టచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జిల్లాల్లో సభల్లో పాల్గొని తిరిగి హెలికాప్టర్ ద్వారా రాత్రికి లోటస్ పాండ్ కు చేరుకుంటున్నారు. అయితే ప్రచారానికి ఇంకా పదమూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో జగన్ స్పీడ్ పెంచాలని నిర్ణయించారు. ఇక హైదరాబాద్ కు రాకుండా జిల్లా కేంద్రాల్లోనే బస చేయాలని జగన్ నిర్ణయించారు.

ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని జగన్ నిర్ణయించారు. తన ప్రచార షెడ్యూల్ ను మార్చేశారు. ఇకపై జిల్లా కేంద్రాల్లోనే జగన్ బస చేసి మరుసటి రోజు ఐదు సభల్లో పాల్గొనేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టూర్ ను రూపొందించింది. ఈ నెల 18వ తేదీన ఇడుపుల పాయలో ఒకేసారి 175 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన జగన్ అక్కడి నుంచి విశాఖపట్నం, పి.గన్నవరం, నెల్లిమర్ల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ దాదాపు 23 నియోజకవర్గాల్లో మాత్రమే జగన్ సభలు జరిగాయి.

జగన్ పాదయాత్ర సందర్భంగా వెళ్లలేని 41 నియోజకవర్గాల్లోనూ జగన్ ప్రచారం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. పాదయాత్రలో 134 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. పార్లమెంటు స్థానం, అసెంబ్లీ నియోజకవర్గానికి కలిపి జగన్ ఇప్పటి వరకూ ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ప్రచారంలో వేగాన్ని పెంచనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి జిల్లాల్లోనే జగన్ బస చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడే రాత్రి ఆ ప్రాంతానికి చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులతో సమావేశమవుతారు.

మరోవైపు జగన్ సోదరి షర్మిల సయితం ప్రచార యాత్రకు సిద్దమవుతున్నారు. ఈ నెల 29 నుంచి మంగళగిరి నుంచి షర్మిల ప్రచారయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళగిరి నుంచి ఇచ్ఛాపురం వరకూ షర్మిల ప్రచారాన్నినిర్వహించారు. ఇక రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విజయమ్మ పర్యటించనున్నారు. ఆమె పర్యటన కూడా ఈ నెల 29వ నుంచ ప్రారంభం కానుంది. బలహీనంగా ఉన్న ప్రాంతాలకు జగన్ మరోసారి ప్రచారానికి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 20 ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద జగన్ ప్రచారంలో స్పీడ్ పెంచి అధికారాన్ని అందుకోవాలని భావిస్తున్నారు.