Home News Politics

వైఎస్ వివేకాది హత్యే…ఫోరెన్సిక్ రిపోర్ట్…!

SHARE

ఏపీ రాజకీయాల్లో ఓ కుదుపు… వైఎస్ సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిది హత్య అని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక తేల్చేయడంతో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్‌లో హీటు పెరిగిపోయింది… ఆయన దేహంపై ఏడు కత్తిపోట్లు ఉన్నాయి… నిజానికి గుండెపోటుతో చనిపోయాడని, సహజమరణమేనని మొదట్లో అనుకున్నా, శరీరంపై అసాధారణంగా గాయాలు కనిపించడం, ఓ పక్కనున్న తలుపు తెరిచి ఉండటంతో ఆ కుటుంబసభ్యులకు అనుమానాలు రేకెత్తాయి…

వివేకా పీఏ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం చేశారు… ఇప్పుడు అది హత్యే అని తేలింది… చంద్రబాబు కూడావెంటనే ఓ దర్యాప్తు బృందం వేసి, కేసుపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపాడు… ఈ మరణం నిజంగానే ఓ చిక్కుముడి కాబోతున్నట్టుంది… ఎవరో తెల్లవారుజామున ఇంట్లోకి జొరబడి, ఆయన బాత్‌రూంకు వచ్చేదాకా వేచి, కత్తులతో పొడిస్తే ఆయన కేకలు పెట్టలేదా..? కేకలు పెట్టకుండా హంతకులు జాగ్రత్తలు తీసుకున్నారా..? అందుకే కేకలు వినిపించలేదా..? హత్యప్రదేశంలో ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, రాత్రి 11 గంటల నుంచి ఆయన మరణం దాకా ఏం జరిగిందీ అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన మిస్టరీ… నిజంగానే, ఇప్పుడు ఆయన్ని హతమార్చాల్సిన రాజకీయ పరిస్థితులు పులివెందులో ఏమున్నాయి..? అక్కడంతా స్ట్రెయిట్ ఫైటే కదా… ఇరుగుపొరుగు నియోజకవర్గాల రాజకీయాలు ఆయన్ని హతమార్చాయా..? అయితే బాధ్యులు ఎవరు..? ఇంకేమైనా కారణాలున్నాయా..?


మరీ ఆయన్ని హతమార్చేంత ఇతరత్రా కారణాలు ఏముంటాయి..? రాజకీయాలే కారణమని అనుకున్నట్టయితే… ఇది చాలా కీలకమైన సమయం… చిన్న నిప్పురవ్వ పడినా పార్టీల కొంపలు అంటుకుంటాయి… ఈ స్థితిలో ఎవరైనా ఆయన్ని హతమార్చడం ద్వారా ఏం సాధించాలని అనుకున్నారు..? అసలే సెన్సిటివ్ టైం ఇది… ఆయన ఆస్తుల గొడవలు కూడా ఉన్నాయి… మొన్నటి జనవరిలోనే ఈ విషయంలోనే సోదరుడు ప్రతాప్‌రెడ్డి ఇంటి ఎదుట వివేకా ధర్నా కూడా చేశాడు. మరోవైపు రాజకీయ ప్రకంపనలు ఆల్‌రెడీ స్టార్టయ్యాయి… ఈసారి ఎలాగైనా కడప సీటును గెలుస్తామనీ, పులివెందులలోనూ పాగా వేస్తామని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారని, అందుకే టీడీపీ వాళ్లే ఏదో చేసి ఉంటారనే విధంగా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు చేశారు… ‘‘జగన్ అభిమానే జగన్‌పై హత్యాప్రయత్నం చేశాడనీ, జగన్ పట్ల సానుభూతి పెంచేందుకు ఆ దాడికి పాల్పడ్డాడని తెలుగుదేశం విస్తృతంగా ప్రచారం చేసింది… తన మీడియా అవే కథనాలు రాసింది… కోడికత్తి కుట్ర అంటూ ఎగతాళి చేసింది… కొంపదీసి వివేకాపైనా అలాంటి కోడికత్తి తరహా కుట్ర ఏదైనా జరిగిందేమో… జగనే చేయించాడు అంటూ ఎవరినైనా ప్రవేశపెడతారేమో…’’ ఇదీ వైసీపీ శ్రేణుల్లో నెలకొంటున్న సందేహాలు, ఆందోళన…

వివేకా హత్య తనకు ప్రతికూలంగా మారే పక్షంలో, ఇక టీడీపీ ఎందుకు ఊరుకుంటుంది..? ఇంకా తీవ్ర స్థాయిలో ఎదురుదాడి స్టార్ట్ చేసినట్టు లేదు… చంద్రబాబు కూడా వివేకా మృతికి సంతాపం ప్రకటించి, నిందితులు ఎవరైనా సరే శిక్షించాలని, వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలంటూ ఓ సిట్ వేశాడు… ఏ రకమైన పొలిటికల్ కామెంట్‌కూ దిగలేదు… కానీ ఈ హీటు ఇప్పట్లో చల్లారకపోవచ్చు, దీని ఉద్రిక్త ప్రకంపనలు కూడా ఉండవచ్చు… ఒకవేళ ఇది రాజకీయ హత్యే అనే ఆధారాలు గనుక దొరికితే కొద్దిరోజులపాటు రాజకీయాలు మామూలుగా ఉండవు… అసలే ఏపీ పాలిటిక్స్ మంటమీద ఉన్నాయ్…!