Home News

రాజమహేంద్రవరంలో వైసీపీ ఎంపీ,టీడీపీ ఎమ్మెల్యే మిలాఖత్…!

SHARE

బదిలీల వ్యవహారం అక్కడి వైసీపీలో ఎంపీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మధ్య ఆధిపత్యపోరుకు తెరలేపింది .. ఆ రెండు సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల ఓటమితో అక్కడ ఎంపీ పెత్తనం పెరిగిపోయిందంట … నియోజకవర్గ కోఆర్డినేటర్లకు చెక్ పెడుతూ ఆ ఎంపీ ఆధిపత్యం కొనసాగిస్తున్నారంట .. దాంతో అక్కడ అంతర్గత విభేదాలు రచ్చకెక్కే పరిస్థితి కనిపిస్తోంది.. ఎంపీ వ్యవహారశైలి వెనుక వేరే కారణాలు కూడా వినిపిస్తున్నాయి..రాజమహేంద్రవరం రాజకీయాల పై స్పెషల్ స్టోరీ….

రాజమండ్రి వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కే పరిస్థితి కనిపిస్తోంది… స్థానిక ఎంపీ మార్గాని భరత్‌రామ్‌కి రూరల్, సిటీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లకూ మధ్య ప్రారంభమైన ఆధిపత్య పోరు.. పార్టీకి తలనొప్పి తీసుకురావటం ఖాయం అన్న గుబులు ఇక్కడి పార్టీ శ్రేణుల్లో నెలకొంది.. రూరల్ నియోజవర్గంలో ఇటీవల జరిగిన అధికారుల బదిలీల వ్యవహరంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది.

నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు సిఫార్సు చేసిన ఓ అధికారిణి విధుల్లోకి చేరిన రెండో రోజే మరో చోటకి బదిలీ అయ్యారు… ఆ సీట్లోకి ఎంపీ మార్గాని భరత్ సిఫార్సు చేసిన మరో అధికారిణికి వచ్చి చేరారు… మరికొందరు అధికారుల పోస్టింగ్ ల విషయంలోనూ ఇదే తరహాలో నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ ఒకరిని రికమండ్‌ చేస్తే … ఎంపీ సిఫార్సుతో మరొకరు ఆ సీట్లోకి వచ్చారు… దీంతో ఎంపీ వ్యవహారశైలిపై నియోజకవర్గ నాయకులు గుర్రుగా ఉన్నారు..

రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు రౌతు సూర్యప్రకాశ్ రావు, ఆకుల వీర్రాజులు ఓటమి పాలయ్యారు… కీలకమైన రెండు నియోజకవర్గాల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమికి కారణాలు ఏమైనప్పటికీ… ఎన్నికల తర్వాత ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రిలో రాజకీయ పరిస్థితులు కలిసి వచ్చినట్లు కనిపిస్తున్నాయి .. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు… మరోవైపు పార్టీ వ్యవహారాలకు తానే పవర్‌పాయింట్‌ అయ్యేలా ఎంపీ భరత్ స్కెచ్‌లు గీస్తున్నారు… ఆ క్రమంలోనే అధికారుల బదిలీల వ్యవహారంలో జోక్యం ద్వారా రెండు నియోజకవర్గాలపై ఎంపి తన ఆధిపత్యాన్ని చూపించారంటున్నారు … అధికారుల బదిలీల్లో తమ ప్రమేయానికి చెక్ పెడుతూ ఎంపీ వ్యవహరించిన తీరుపై రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఇప్పటికే బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎంపీ భరత్ కనుసన్నల్లో జరిగిన అధికారుల బదిలీల్లో పార్టీ వర్గాల్లో మరో గుసగుస సైతం వినిపిస్తోంది… ప్రస్తుతం రాజమండ్రి రూరల్ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చియ్యచౌదరి కోరిక మేరకే .. బదిలీల్లో భరత్‌ చక్రం తిప్పారంట … ఎన్నికలకు ఆరు నెలల క్రితం వరకూ టిడిపిలో ఉన్నభరత్ కుటుంబం… ఎమ్మెల్యే గోరంట్లకు సన్నిహితులు కావటం ఆ వాదనకు బలం చేకూరుస్తోంది… ఏదేమైనా అధికారుల బదిలీలతో రాజమండ్రి వైసీపీలో మొదలైన అంతర్గత విభేదాలు … ఎటు నుంచి ఎటు దారితీస్తాయో చూడాలి..