Home News Stories

వైసీపీ ఇంచార్జ్ ల మార్పు వెనక కథేంటి…?

SHARE

పార్టీ అధికారంలోకి రావాలంటే మార్పు తప్పదు. పార్టీ అధినేతగా ఎవరు ఉన్నా అదే దిశగా ఆలోచిస్తారు. పార్టీలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో… పార్టీకోసం కష్టపడే మనస్తత్వం కూడా అంతే అవసరం. గత నాలుగేళ్ల నుంచి పార్టీని లైట్ గా తీసుకున్న నేతలకు ఇప్పుడు వైసీపీలో చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీ నాలుగేళ్ల నుంచి ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఏదో మ..మ అనిపించారు తప్ప చిత్తశుద్ధితో చేయలేదు. ప్రజల్లోకి వెళ్లలేదు. తమను గెలిపించే నాయకుడు జగనే అని వారు నమ్మటం కూడా ఒక కారణమై ఉండొచ్చు. అయితే జగన్ పాదయాత్ర ప్రారంభమయినప్పటి నుంచి మాత్రం కొంత వేగం పెంచినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నివేదకల్లో మైనస్ మార్కులే దర్శనమిస్తున్నాయి.

అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎవరూ పెద్దగా తప్పుపట్టడం లేదు. ఈ దశలో అది పార్టీకి అవసరమని భావించే వారూ ఎక్కువగానే ఉన్నారు. కాకుంటే జగన్ నిర్ణయాలు తీసుకునే తీరును కొందరు ఆఫ్ ది రికార్డుగా తప్పుపడుతున్నారు. ఏదైనా నియోజకవర్గ ఇన్ ఛార్జిని తొలగించే ముందు, లేదా ఆ నియోజకవర్గంలో కొత్త నేతలను పార్టీలో జాయిన్ చేసుకునే టప్పుడు ఆ నియోజకవర్గాల ఇన్ ఛార్జులను సంప్రదించి ఉంటే బాగుండేది అని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

వారికి తెలియకుండానే నేతలను చేర్చుకోవడం, ఇన్ ఛార్జులుగా నియమించడం వంటి పరిణామాలు వైసీపీలో కొంత ఇబ్బందిని కలిగిస్తున్న మాట నిజమే. నిజానికి నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీలోకి వస్తున్నారన్న చర్చ రెండు నెలల నుంచి నలిగింది. అదే సమయంలో మేకపాటి కుటుంబాన్ని, వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణరెడ్డిని బరిలోకి దింపాలని జగన్ భావించినప్పుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని పిలిచి చర్చించి ఉంటే బాగుండేదంటున్నారు. ఏకపక్షంగా జగన్ నిర్ణయం తీసుకోవడంతోనే బొమ్మిరెడ్డి పార్టీని వీడాల్సి వచ్చిందంటున్నారు.

పాదయాత్రలోనే కలిసి అక్కడే జాయిన్ అయి ఇన్ ఛార్జి పదవిని దక్కించుకున్న నేతలను కూడా కొందరు సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. ఉదాహరణకు చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజనీకుమారి నేరుగా పాదయాత్రలో కలిసి నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవిని తెచ్చుకున్నారు. కనీసం ఆమె ముందుగా మర్రి రాజశేఖర్ ను సంప్రదించాల్సి ఉండేదంటున్నారు. అలాగే జగన్ కూడా మర్రి రాజశేఖర్ ను, రజనీకుమారిని కూర్చెబెట్టి కౌన్సిలింగ్ చేసినా ఈ అసంతృప్తుల తలనొప్పి వచ్చేది కాదన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.

లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధా విషయంలోనూ జగన్ అదే చేశారంటున్నారు. మాజీ పోలీసు అధికారి ఏసురత్నం పాదయాత్రలో కండువా కప్పుకుని వెంటనే ఇన్ ఛార్జిగా రంగప్రవేశం చేశారు. లేళ్ల అప్పిరెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడు. లేళ్లతో కనీసం ఫోన్ లోనైనా జగన్ ఒక మాట చెప్పి ఉంటే బాగుండేదన్నది లేళ్ల అనుచరుల మనోగతం. జగన్ పాదయాత్రలో ఉన్నప్పటికీ సీనియర్ నేతలకు ఈ బాధ్యతలను అప్పగిస్తే బాగుండేదని, దీనివల్ల లేనిపోని తలనొప్పులు ఎదుర్కొనాల్సి వస్తుందంటున్నారు వైసీపీ సీనియర్ నేతలు. ఇప్పటికైనా జగన్ నాలుగేళ్ల నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలను తప్పించాల్సి వస్తే వారితో మాట్లాడి ఒప్పించి చేయగలిగితే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నది గమనించాల్సిన విషయం.