Home News

ఆ సీనియర్ లీడర్ పొలిటికల్ చాప్టర్ క్లోజేనా…!

ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి ఎన్నోపదవులు అధిరోహించారు … అలాంటి నేత ఒక్కసారి ఓడిపోయేసరికి ప్రత్యక్షరాజకీయాలకే గుడ్‌బై చెప్పేశారు .. తర్వాత ఆయన సోదరుడు సీన్‌లోకి వచ్చి పరుస ఓటములు చవిచూస్తున్నారు .. ఆ వారసత్వమే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పుట్టగతులుండవని బెంబేలెత్తున్నాయి పార్టీ శ్రేణులు … అందుకే ఆయన మాకొద్దు బాబోయ్‌ అని గగ్గోలు పెడుతున్నాయి.. అంతలా భయపెడుతున్న ఆ వారసుడి పై తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

యనమల రామకృష్ణుడు మునిసిపల్, ఆర్ధిక, వాణిజ్యపన్నుల శాఖల మంత్రిగా, స్పీకర్‌గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా ఇలా ఆయన చూడని పదవే లేదు.. టిడిపి ఆవిర్భావం నుంచి ఆయన టిడిపిలో ఒక వెలుగువెలుగుతూనే వస్తున్నారు … తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడుకు పెట్టని కోటలా ఉండేది.. ఒకప్పుడు టిడిపికి గ్యారంటీ సీట్లలో ఒకటి.. అక్కడ నుంచి 1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు అంటే డబుల్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు యనమల రామకృష్ణుడు …

తొలిసారి 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూహంతో ఓటమి పాలయ్యారంటా … చంద్రబాబుకి తలలో నాలుక గా వుండే యనమలకి వైఎస్‌ వ్యూహాత్మకంగా షాక్‌ ఇచ్చారన్న టాక్‌ ఉంది.. ఆ ఓటమితో మనస్థాపానికి గురైన యనమల ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు… నియోజకవర్గ బాధ్యతలు తమ్ముడు యనమల కృష్ణుడికి అప్పగించి గత రెండు పర్యాయాల నుంచి ఎమ్యెల్సీగా మండలికే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు… ఎమ్మెల్సీగానే టిడిపి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

రామకృష్ణుడు తుని పాలిటిక్స్‌ నుంచి సైడ్‌ అవ్వడంతో .. ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు తుని టిడిపి క్యాండెట్‌గా పోటీచేసి గత రెండు సార్లుగా ఓటమిపాలవుతూ వస్తున్నారు .. అన్ని పదవులు నిర్వహించినా సొంత నియోజకవర్గ అభివృద్ధికి యనమల రామకృష్ణుడు పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి జనంలో ఉందంటారు.. దానికి తోడు దూకుడుగా ఉండే ఆయన తమ్ముడిపై సదాభిప్రాయం లేకపోవడంతో వరుస ఓటములు తప్పడం లేదన్న అభిప్రాయం ఉంది.. ఆ క్రమంలో 2014 ఎన్నికల్లో 18 వేల ఓట్ల తేడాతో , 2019 ఎన్నికల్లో 24 వేల ఓట్ల తేడాతో యనమల రామకృష్ణుడి సోదరుడు ఓటమి మూటగట్టుకున్నారు …

ఏదైతేనేం 2009 నుంచి తునిలో టిడిపికి ఓటమి తప్పడం లేదు .. దాంతో టిడిపి నుంచి యనమల కుటుంబసభ్యులను కాకుండా … కొత్త వారిని రంగంలోకి దింపాలని డిమాండ్‌ చేస్తున్నారు తెలుగుతమ్ముళ్లు … యనమలకి మరో ఐదున్నరేళ్ళు ఎమ్యెల్సీ గా పదవీకాలం ఉందని, అధిష్టానం కావాలనుకుంటే ఆయనకు మరో ఛాన్స్‌ కూడా ఇవ్వవచ్చని .. ఇక ఆ కుటుంబసభ్యులను పక్కన పెట్టేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి ..

యనమల ఫ్యామిలీతో సంబంధం లేకుండా పార్టీ పూర్వవైభవానికి అవసరమైన చర్యలు చేపట్టాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి .. పాత వారికే దశాబ్దాలుగా టికెట్లు ఇస్తుండటంతో కొత్త నాయకులు ఫోకస్‌ అవ్వలేక.. సైలెంట్‌ అవుతున్నారని.. అలా ద్వితీయశ్రేణి నేతల్లో పెరిగిన నైరాశ్యం కారణంగానే తుని వంటి పట్టున్న నియోజకవర్గాలను కూడా చేజార్చుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది… కొత్త రక్తం ఎక్కిస్తే కానీ తునిలో తెలుగుదేశానికి భవిష్యత్తు లేదని తెలిసినా …. యనమల రామకృష్ణుడు అంగీకరిస్తే కానీ వారిని తప్పించే సాహసం
అధినేత చేయలేరని తమ్ముళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు…

యనమల తమ్ముడే నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగితే … రానున్న మున్సిపల్ , స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ భవిష్యత్తు ఏమిటో అన్న బెంగతో తలలు పట్టుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు … అయితే ప్రస్తుతం పార్టీలో వున్నవారే పక్క పార్టీల్లోకి పోతుండటంతో … అధినేత తుని బాధ్యతలు కొత్తవారికి అప్పగిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి …