Home News Stories

పశ్చిమ టీడీపీలో టిక్కెట్ల పంచాయతీ…!

SHARE

పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం వేడెక్కుతోంది… నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తులు, వారికి వ్యతిరేకంగా అసమ్మతి నేతల ఆందోళనలతో తెలుగుదేశం పార్టీ కంచుకోటలో కాకాపుట్టుకొస్తుంది … ఒకరు కాదు ఇద్దరు కాదు అరడజనుకు పైగా నేతలపై అవీనితి ఆరోపణలతో పాటు అసంతృప్తి వెల్లువెత్తుతుండటంతో … వారి అభ్యర్ధిత్వాలను పెండింగ్‌లో పెట్టింది అధిష్టానం… దీంతో సిట్టింగులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంటే .. ఆశావాహులు అలుపెరగకుండా టికెట్‌ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ కంచుకోట పశ్చిమగోదావరిజిల్లాలో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది .. 2014 ఎన్నికల్లో వన్ సైడ్ గా జిల్లా ప్రజలు పార్టీకి పట్టం కట్టారు.. అయితే అక్కడి నేతల్లో పలువురు మాత్రం ప్రజలు, పార్టీ ప్రయోజనాలను పక్కపెట్టి కంటే సొంత అజెండాతో ముందుకుపోయారు… ఆ ఎఫెక్ట్‌ ఇప్పుడు వారిపై రిఫ్లెక్ట్‌ అవుతోంది .. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో .. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు చేసిన తప్పులన్నీ ఫోకస్‌ అవుతున్నాయి .. వారిపై ప్రజల్లో, పార్టీలో ఉన్న అసంతృప్తి సిట్టింగ్ సీటుకు ఎసరు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది…

అలాంటి నియోజకవర్గాల్లో కాకరేపుతున్న సెగ్మెంట్ నిడదవోలు, పోలవరం, గోపాలపురం ముందున్నాయి… నిడదవోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు తిరిగి టిక్కెట్ ఇచ్చే అంశాన్ని పెండింగ్ లో ఉంచారు… ఇప్పటికే అసమ్మతి నేతలు ఆనేత మాకొద్దంటూ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు గుప్పించారు.. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం ఇస్తూ.. ఇటు పార్టీని అటు కేడర్‌ని దెబ్బతీసారనేది శేషారావుపై ప్రధాన ఆరోపణ… దీంతో శేషారావుకు కాకుండా సామాన్య కార్యకర్తకు టిక్కెట్ కేటాయించినా గెలిపించుకు తీరతామని నియోజకవర్గ నేతలంతా పార్టీ అధినేతకి చెప్పుకొచ్చారు.

మరోపక్క పోలవరం నియోజకవర్గంలోను ఇదే పరిస్థితి… సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు టిక్కెట్ కేటాయించొద్దని నియోజకవర్గ నేతలు గళమెత్తుతున్నారు.. సదరు నేతలంతా ఎంపి మాగంటి బాబుకి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతామహలక్ష్మీకి ఫిర్యాదు చేయడంతో పోలవరంలోను రాజకీయం వేడెక్కింది…
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నియోజకవర్గం నుంచి అసమ్మతి నేతలు క్యూ కట్టడం ఇపుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది… అయితే ఇప్పటికి ముప్పై సార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సిఎం చంద్రబాబుకు లోకల్‌ లీడర్లు అప్పట్లోనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నిస్తోందిప్పుడు…

Venkateswara Rao Muppidi MLA,

ఇక గోపాలపురం నియోజకవర్గం నుంచి నేతలు భారీగా సీఎంను కలిసి తమ అసంతృప్తి వెళ్లగక్కారు … సిట్టింగుకు అవకాశం ఇస్తే తమతో పాటు చాలా మంది టిడిపి మద్దతుదారులు పార్టీకి దూరం అయ్యే అవకాశముందని విన్నవించుకున్నారు… ఎన్నికల సమయంలో కింది క్యాడర్ కు ఇచ్చే విలువ .. ఎన్నికలైన తర్వాత ఇవ్వకపోవడం .. సొంత కార్యకలాపాలకే పరిమితమవ్వడం వల్లే .. నిడదవోలు, గోపాలపురం, పోలవరం, కొవ్వూరు వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగులను మార్చడం ఖాయమని.. అందుకే టిడిపి అధినేత వివిధ నియోజకవర్గాల అభ్యర్ధుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారంటున్నారు… ఏదేమైనా గత ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన పశ్చిమలో ఈ సారి సైకిల్‌ ఎలా పరిగెడుతుందో?