Home News Stories

వారెంట్ వార్ లో నేతల పోటీ !

SHARE

మాకేంటీ.. వారెంట్లేంటి..? అనికొందరి గొడవ… మాకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు రాలేదేంటి..? అనేది ఇంకొందరి డౌట్… వచ్చుంటే బాగుండేదని మరికొందరి ఆశ … ఇవీ ప్రస్తుతం టిడిపి నేతల హావభావాలు .. .. బాబ్లీ ప్రాజెక్టు ఉద్యమం విషయమై ధర్మబాద్ కోర్టు వారెంట్లు జారీ చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది…ఈ క్రమంలో బాబ్లీ ఎపిసోడ్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి.. లాఠీలు దెబ్బలు తిన్న కొందరి నేతల పేర్లు వారెంట్ల లిస్టులో మిస్‌ అయ్యాయి… దాంతో తమ పేరు లేదేంటంటూ ఊస్సూరుమంటున్నారంట సదురు నేతలు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వారెంట్ వార్ నడుస్తోంది… ఏకంగా సీఎం చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందంటూ రెండు రోజుల నుంచి రెండు రాష్ట్రాల టిడిపి నేతలు హోరెత్తిస్తున్నారు … దీని వెనుక కుమ్మక్కు రాజకీయముందని ఆరోపిస్తున్నారు.. ఈ వ్యవహరంపై నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.. సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం జోరుగా నడుస్తోంది…

వారెంట్లు.. నోటీసులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా తెలంగాణలో మరింత ఆసక్తికర చర్చ జరుగుతోంది… రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బాబ్లీ ఉద్యమం.. నోటీసులు.. వారెంట్లు అంటూ హోరెత్తిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ ఎడారి కాకుండా బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం… ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హీట్ పెరగడంతో.. ఈ ఎపిసోడును తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది టిడిపి అధినాయకత్వం.. తెలంగాణ కోసం, నాడూ పోరాడాం.. నేడూ పోరాడతామని చెప్పుకునేందుకు ఓ అవకాశం దక్కిందని భావిస్తున్నారు టీడీపీ తెలంగాణ నేతలు… ఆ క్రమంలో తమ అధినేతకు వారెంట్ ఎలా ఇస్తారంటూ శివాలెత్తుతున్నారు.

ఎవరికైతే కోర్టు వారెంట్లు ఇచ్చిందో.. వారు రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకునే పనిలో పడ్డారు… ఈ విధంగా వారెంట్లు జారీ చేసిన వారి జాబితాలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన హన్మంత్ షిండే, సాయన్న, ప్రకాశ్ గౌడ్ వంటి వారు ఉన్నారు… వారు కూడా తాము తెలంగాణ కోసం చేసిన పోరాటాల్లో ఇదొకటని గట్టిగా చెప్పుకోవచ్చని సంబరపడుతున్నారంట… అయితే ఈ పోరాటానికి ఆద్యుడు.. అప్పట్లో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ పేరు ఆ జాబితాలో ఎక్కడా లేదు… దీంతో అందరి పేర్లూ ఉన్నాయి.. తన పేరు ఎందుకు లేదంటూ ఎర్రబెల్లి తెగ మధనపడిపోతున్నారంట… అప్పట్లో అంతా తానే చేశానని.. చంద్రబాబుకు కూడా బాబ్లీ ప్రాజెక్టు సమస్య తీవ్రంగా ఉందని వివరించింది కూడా తానేనంటూ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారంట ఆయన.. ఇంత చేసినా.. వారెంట్లు జారీ చేసిన జాబితాలో తన పేరు లేకపోవడంతో ఢీలా పడిపోయారట. ఈ క్రమంలో వేరే లిస్ట్ ఏమైనా ఉంటుందా..? అని ఆరా తీస్తున్నట్టు సమాచారం.

మొత్తానికి వారెంట్ల వార్‌లో తాము భాగస్వామ్యం కాలేకపోయామేనని మధనపడిపోయే బ్యాచ్ తెలంగాణ రాజకీయాల్లో చాలా మందే ఉన్నట్టు కన్పిస్తోంది… బాబ్లీ ఎపిసోడ్‌ని తెలంగాన ప్రజలకు మర్చిపోలేరు .. ఇప్పుడు దానికి సంబంధించిన వారెంట్లు వస్తే పొలిటికల్ మైలేజ్ పెరిగి..ప్రస్తుతం తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఉపయోగపడకపోతుందా..? అని లెక్కలు వేసుకుంటున్నారంట ఆ నేతలు…