Home News Stories

విశాఖలో దేశంలో భేజారెత్తిస్తున్న సర్వేలు…?

SHARE

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇపుడు ఒకటే టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ రాజకీయం ఎలా మారుతుందో, హైకమాండ్ వ్యూహాలతో ఎవరికి షాక్ తగులుతుందోనని నేతలు తెగ పరేషాన్ అవుతున్నారు. పలు రకాల సర్వేలను ఆధారం చేసుకుని గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తానని అధినేత చంద్రబాబు స్పష్టం చేయడంతో తమ్ముళ్ళు హడలిపోతున్నారు. సర్వేశ్వరులు ఎవరి కొంప ముంచుతారోనని బిత్తర చూపులు చూస్తున్నారు.

విశాఖ టీడీపీని ఓ ప్ర‌చారం బేజారెత్తిస్తోంది. అర్బన్ జిల్లాలో ఇద్దరు, రూరల్ జిల్లాలో ఇద్దరు సిట్టింగులకు సీట్లు పోతాయన్నదే ఆ ప్రచారం. ఆ నలుగురూ ఎవరన్నది అంతుపట్టకపోవడంతో ఎమ్మెల్యే తమ్ముళ్ళు ఎవరికి తోచిన లెక్కలు వారు వేసుకుంటున్నారు. తాము బాగానే పనిచేస్తున్నామని, తమ సీటుకు ఢోకా లేదని తృప్తి పడుతున్నారు. అయితే అదే సమయంలో హైకమాండ్ ఆలొచనలు ఎలా ఉంటాయోనని కూడా ఆలోచిస్తూ అంతర్మధనంతో తల్లడిల్లుతున్నారు.

ఇక విశాఖ జిల్లాలో ఈ మధ్యన యమ జోరుగా టీడీపీ సర్వేల మీద సర్వేలు జరిపిస్తోంది. ఈ సర్వేల అంతరార్ధం టీడీపీకి విజయావకాశాలతో పాటు ఎమ్మెల్యేల పనితీరు ఏంటన్నది తెలుసుకోవడమేనంటున్నారు. దాంతో జనాల నుంచి ఏ రకమైన సమాధానలు వెళ్ళాయోనని తమ్ముళ్ళు హడలెత్తిపోతున్నారు. ఎక్కడికక్కడ అంతా సర్దుబాటు చేసుకున్నా తెలియని భయం వెంటాడుతూండడంతో ఎమ్మెల్యేలు ఒకటికి పదిమారులు తమకు తామే ధైర్యం చెప్పుకుంటున్నారు.

ఇక చూస్తే విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ రావు మీద ఆరోపణలు ఓ లెక్కలో వచ్చాయని తెలుస్తోంది. ఆయన వివాదాలకు తరచూ కేంద్ర బిందువుగా మారుతున్నారని కూడా హై కమాండ్ అంతర్గత సర్వేలలో వెల్లడైందని సీటు గోవిందా అని రేసులో ఉన్న ఇతర నాయకులు ప్రచారం చేస్తున్నారు. అలాగే విశాఖలోని గాజువాక ఎమ్మెల్యే సీటుకు కూడా ఈసారి సున్నా చుడతారని, ఆయన పరిధిలో కూడా జనం సరిగ్గా పని చేయలేదనే చెబుతున్నారని అక్కడి తమ్ముళ్ళు అంటున్నారు.

జిల్లాలో చూసుకుంటే అనకాపల్లి, చోడవరం ఎమ్మెల్యేల పని తీరు బాగాలేదని హైకమాండ్ భావిస్తోందని కూడా చెబుతున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలలో సగానికి పైగా ఉన్న వారిపై ఏదో రకమైన ఆరపణలు ఉన్నాయని, అందువల్ల ఎవరికి సీటు పోతుదన్నది ఇపుడే చెప్పలేమని తల పండిన సీనియర్లు అంటున్నారు. మొత్తం మీద టీడీపీలో సర్వేలతో సీట్ల పై నేతల గోల ఓ రేంజ్ లో నడుస్తుంది.