Home News Stories

విశాఖ నార్త్ లో గంటాకి ఎదురులేదా…!

SHARE

విశాఖ జిల్లాలో హాట్ సీటు గా పేరున్న ఉత్తరం అసెంబ్లీలో రాజకీయాలు చరమాంకానికి చేరుకున్నాయి. ఇక్కడ నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్ధులుగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, వైసీపీ నుంచి కేకే రాజు ఉన్నారు. ఇక్కడ టీడీపీ, బీజేపీ మధ్య ప్రధానమైన పోరు అని భావించిన అది వైసీపీ వర్సెస్ టీడీపీగా మారుతోంది. మొదట్లో ఇక్కడ నెమ్మదిగా ఉన్న వైసీపీ ఇపుడు చురుగ్గా పావులు కదుపుతోంది. దాంతో మంత్రి కూడా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడుతోంది.

ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ బలమైన పార్టీ నేతలకు గేలం వేయడం అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ చేయడం ద్వారా మైండ్ గేం ఆడుతున్నాయి. జనసేన టికెట్ దక్కలేదని అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ నేత గుంటూరు నరసింహమూర్తి, ఆయన భార్య గత ఎన్నికలో కాంగ్రెస్ తర ఫున పోటీ చేసిన గుంటూరు భారతిలను వైసీపీ లాగేసింది. నిజానికి వారికి గంటా గేలం వేశారట. అయితే వైసీపీ తెలివిగా పావులు కదిపి లాగేసుకుంది. దీంతో గంటా మాస్టర్ మైండ్ ఉపయోగించి ఏకంగా వైసీపీలోని సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ని తన వైపుకు తిప్పుకున్నారు. ఈ పరిణామతో బిత్తరపోవడం వైసీపీ వంతు అయింది.

ఇక తైనాల విజయకుమార్ చివరి వరకూ వైసీపీ వైపు ఉన్నారు. ఆయనను పార్టీ ఎంతో గుర్తింపు ఇచ్చి పక్కన పెట్టుకుంది. కాంగ్రెస్ టైంలో వైఎస్సార్ ఆయనకు టికెట్ ఇచ్చి ఉత్తరం నుంచి ఎమ్మెల్యేని చేశారు. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయనకు గతసారి టికెట్ దక్కలేదు. ఈసారి కూడా వస్తుందని ఆశపడినా ఎమ్మెల్సీ ఇస్తామని ఆశపెట్టి పక్కన ఉంచారు. అయినా ఇన్నాళ్ళు గుంభనంగా ఉంటూ వచ్చిన తైనాలా ఒక్కసారిగా పార్టీ ఫిరాయించడంతో వైసీపీ నేతలు కంగారుపడుతున్నారు. ఇలాంటి విభీషణులు వైసీపీలో ఎంతమంది ఉన్నారో అని ఆరా తీస్తున్నారు.

ఇక్కడ చిత్రమేంటంటే తైనాలను నమ్మి పార్టీ ఆయనపై కీలకమైన బాధ్యతలు పెట్టింది. ఇపుడు ఆయన అన్ని గుట్లూ మట్లూ తెలుసుకుని వైరి శిబిరంలోకి జంప్ చేశారు. ఉత్తరంలో ఉన్న వైసీపీ వార్డు అధ్యక్షులలో మెజారిటీ ఆయన వర్గీయులే. ఇపుడు వారిని ఉంచాలో లేక తీయాలో తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తానికి ఇపుడు వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయినట్లైంది. చూడాలి మరెవరూ అటూ ఇటూ ఫిరాయిస్తారో.