Home News Politics

విజయనగరం కోటలో సంకుల సమరం…!

SHARE

ఉత్తరాంధ్రలో కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయనగరం ఒకటి. పూసపాటి రాజ వంశీయులు పాలించిన ఈ జిల్లా పూర్వం కళింగ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య‌ జరిగిన యుద్ధం చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచి ఉంటుంది. గతంలో బొబ్బిలి నియోజకవర్గంగా ఉండగా 2009 పున‌ర్విభజనలో జిల్లా కేంద్రమైన విజయనగరం పేరుతో ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. ఈ నియోజకవర్గ పరిది చూస్తే బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లుమర్ల, విజయనగరం సెగ్మెంట్లతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు సైతం ఈ లోక్‌సభ పరిధిలోనే ఉన్నాయి. నియోజకవర్గ ఓటర్లు మొత్తం 14 లక్షలు ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి చూస్తే టీడీపీ తరపున సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు మరో సారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి, విజయనగరం పార్లమెంట‌రీ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్‌ రంగంలో ఉన్నారు. జనసేన నుంచి ముక్కా శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు.

మూడు పార్టీలు పోటీ పడుతున్నా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే ఉందన్నది సుస్పష్టం. గత ఎన్నికల్లో బొబ్బిలి రాజవంశానికి చెందిన బేబి నాయనపై లక్ష ఓట్ల పై చిలుకు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన అశోక్‌ గజపతిరాజు కేంద్రంలో విమానాయాన శాఖా మంత్రిగా పని చేశారు. ఇక ఐదేళ్ల పాటు ఆయన తన రాజకీయ జీవితంలో ఉన్న క్లీన్‌ ఇమేజ్‌ను కంటిన్యూ చేశారు. తాను నియోజకవర్గంలో తన నిధుల ద్వారా ఎక్కడ ఎంత ఖర్చు చేసింది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ వివరించారు. ఖర్చుల వివరాల్లో తేడాలు ఉన్నా, ఎవరికైనా అనుమానాలు ఉన్నా తనకు ఫోన్‌ చెయ్యవచ్చని సెల్‌ నెంబర్‌ అందులో ఇచ్చి పారదర్శకతకు మరో సారి నిదర్శనంగా నిలిచారు. లోక్‌సభలో నూటికి నూరు శాతం హాజరు ఉన్న అతి తక్కువ మంది వ్యక్తుల్లో అశోక్‌ గజపతి ఒకరుకాగా సభలో నిర్వహించిన ఎలాంటి చర్చల్లోనూ ఆయన పాల్గొనకపోవడం మైనెస్సే. అదే టైమ్‌లో ఆయన క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న వ్యక్తిగా ఎలా ప్రశంసలు పొందారో కేంద్ర మంత్రి అయ్యాక ప్రజలకు అందుబాటులో లేరన్న అప్రతిష్ఠ కూడా మూటకట్టుకున్నారు.

స్థానికుడైనా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం మైనెస్‌. అలాగే ఓ కేంద్ర మంత్రిగా ఉండి కూడా వెనకపడిన విజయనగరాన్ని అభివృద్ధి చెయ్యలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు.ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విజయనగరం జిల్లా పార్లమెంట‌రీ పార్టీ వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌కు చివరి నిమిషంలో వైసీపీ సీటు కట్టపెట్టింది. యువకుడు కావడంతో యూత్‌వింగ్‌లో బెల్లానకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే అశోక్‌ గజపతిరాజులాంటి సీనియర్‌ నాయకుడిని బెల్లాన ఎంత వరకు ఎదుర్కొంటారన్నది సందేహం. జగన్‌ చేసిన పాదయాత్రతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఉన్న వేవ్‌ తనని గట్టెక్కిస్తుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న బెల్లాన చివరకు తన రాజకీయ గురువు అయిన బొత్స కోసం తన సీటును త్యాగం చేసి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

వాస్తవంగా చూస్తే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో వైసీపీ నాలుగైదు నియోజవర్గాల్లో చాలా బలంగా ఉండడంతో బెల్లాన అశోక్‌కు షాక్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్పష్టం అవుతోంది. చీపురుపల్లిలో బొత్స, గజపతినగరంలో బొత్స సోదరుడు అప్పల నరసయ్య గెలుపు బాటలో ఉన్నారు. ఇదే టైమ్‌లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎచ్చెర్ల, రాజాంలోనూ వైసీపీ బలంగా కనిపిస్తోంది. ఎచ్చెర్ల‌లో మంత్రి క‌ళా వెంక‌ట్రావు ఏటికి ఎదురీదుతున్నారు. అలాగే నెల్లిమర్లలో టీడీపీ నుంచి సీనియర్‌ నేత పత్తివాడ నారాయణ స్వామి నాయుడు పోటీ చేస్తున్నా అక్కడ వైసీపీ అభ్యర్థి బొడ్డుకొండ అప్పల్నాయుడు గట్టి పోటీ ఇస్తున్నారు. విజయనగరం సిటీలో స్వయంగా అశోక్‌ కుమార్తె ఆదితి టీడీపీ నుంచి పోటీలో ఉన్నా అక్కడ కూడా వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి దూకుడుతో టీడీపీ గెలుపు సులువు కాదంటున్నారు. ఏదేమైనా అశోక్‌ వ్యక్తిగత ఇమేజ్‌ను పక్కన పెడితే లోక్‌సభ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకతతో బెల్లాన అశోక్‌కు షాక్‌ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరి ఫైన‌ల్‌గా విజయనగరం రారాజు చూడాలి.