Home News Stories

‘ఫ్యాన్’ చెంతకు చేరనున్న వెంకటగిరి రాజులు…!

SHARE

నెల్లూరు జిల్లాలో వెంకటగిరి రాజకీయాలను తరచి చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్ద ఆస్తి వెంకటగిరి రాజులే. అటువంటి వెంకటగిరి రాజులు మూడు దశాబ్దాల టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షాత్తూ చంద్రబాబునాయుడు ఫోన్ లో రాజులను సముదాయించినా ఫలితం లేదు. స్వయానా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజులను కలసి బుజ్జగించినా ప్రయోజనం లేదు. దీంతో వెంకటగిరి రాజులు త్వరలోనే వైసీపీలోకి వెళుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

వాస్తవానికి వెంకటగిరి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఈనియోజకవర్గంలో వెంకటగిరి రోజులు తొలి నుంచి తెలుగుదేశం పక్షాన నిలుస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 1985లో వి.బి. సాయికృష్ణ యాచేంద్ర టీడీపీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో వివిఆర్కే యాచేంద్ర ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వీరికి అవకాశం దక్కలేదు. అయినా వారు టీడీపీలోనే కొనసాగుతూ ఎన్నికల సమయంలో తమ మద్దతును టీడీపీ అభ్యర్థికి ప్రకటిస్తూ వారి విజయానికి కారణమవుతున్నారు. వెంకటగిరి రాజాల మద్దతు లేకుంటే మాత్రం ఇక్కడ గెలుపు ఎవరికైనా కష్టమే.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో మూడింటిలో గెలిస్తే అందులో ఒకటి వెంకటగిరి నియోజకవర్గం. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పైన రాజులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సైదాపురం మండలం కలిచేడు ప్రాంతంలో మైకా గనుల్లో మట్టితరలింపులో ఎమ్మెల్యే రాజాలను ఇబ్బందులకు గురి చేశారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో రాజులు టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తాము దానంగా ఇచ్చిన స్థలాన్ని కూడా ఎమ్మెల్యే తన వర్గం వారికి లీజుకివ్వడం రాజుల కోపానికి కారణమయింది.

అంతేకాకుండా గత దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం తమను వాడుకోవడం తప్ప తమకు ఉపయోగపడింది ఏమీ లేదని రాజులు గుర్రుగా ఉన్నారు. తమ కుటుంబాన్ని పూర్తిగా విస్మరించారని వారు మదన పడుతున్నారు. తాము పార్టీకి దశాబ్దాలుగా అండగా ఉంటే తమకు టిక్కెట్ ఇవ్వడం లేదని, ఎన్నికల సమయంలో మాత్రమే తాము గుర్తుకు వస్తామని రాజులు గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన ప్రతిపాదనను కూడా వీరు తిరస్కరించినట్లు తెలుస్తోంది. సర్వజ్ఞకుమార యాచేంద్ర వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ కూడా రాజాల రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. నేడో, రేపో వెంకటగిరి రాజులు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. రాజాలు పార్టీ మారితే వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీకి కష్టకాలమేనని చెప్పకతప్పదు.