Home News Politics

వెండితెర మీద వెలిగిపోతున్న టీడీపీ నేతలు…బయోపిక్ లో నటిస్తున్న నేతలెవరో తెలుసా?

SHARE

ఎన్టీఆర్ బయో పిక్… ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌… నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా ఒకటికి మూడు చిత్రాలు తెరకెక్కనున్నాయి.. వాటిలో బాలకృష్ణ ఎన్టీఆర్‌గా, దగ్గుబాటి రానా చంద్రబాబుగా నటిస్తున్న ఎన్టీఆర్ బయో పిక్ అందర్నీ ఆకర్షిస్తోంది .. దానికి సంబంధించి బయట ఏమో కాని టీడీపీ వర్గాల్లో మాత్రం విపరీతమైన ఆసక్తికర చర్చే జరుగుతోంది.

ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు..? ఎవరు ఏ పాత్రలు పోషిస్తారు..? అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు పసుపు పార్టీ నేతలు… షూటింగ్‌ స్టార్ట్ అయిన నాటి నుంచి ఏ క్యారెక్టర్‌కి ఎవరు సరిపోతారు? ఎవరైతే బాగుంటుంది అన్న ఊహాగానాలు కూడా మొదలెట్టేసారు

ఎన్టీఆర్ గెటప్పులో బాలయ్య ఫస్ట్ లుక్ అదిరిపోయేలా ఉండడమే కాదు.. అచ్చు గుద్దినట్టు ఎన్టీఆరే మళ్లీ దిగి వచ్చారా..? అనే రీతిలో బాలయ్య గెటప్ ఉండడంతో ఈ సినిమాపై సైకిల్ పార్టీ వర్గాలు మరింత అంచనాలు పెంచేసుకున్నాయి… దానికి తగ్గట్టుగానే క్రిష్ విడుదల చేసిన మరో ఫస్ట్ లుక్ చంద్రబాబునాయుడుది… ఈ పాత్రకు దగ్గుబాటి రానా నూటికి నూరు శాతం న్యాయం చేస్తారనే నమ్మకం రానా ఫస్ట్ లుక్ చూశాక కలిగిందంటున్నాయి తెలుగుదేశం వర్గాలు… నడక.. ఆహార్యం.. అంతా అప్పటి చంద్రబాబుకు డిట్టో అన్నట్టుగానే ఉన్నారు రానా.

ఎన్టీఆర్ బయో పిక్ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది… అసెంబ్లీ ప్రాంగణంలో బాలయ్య, రానాలపై షూటింగ్ జరిగింది… ఆ షూటింగ్‌కు సంబంధించి పార్టీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది… బాలయ్య రాజకీయాల్లోకి వచ్చాక.. చారిత్రాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తీశారు… ఈ మూవీలో తెలుగుదేశం ఎమ్మెల్సీ శమంతకమణికి అవకాశం కల్పించారు… అలాగే ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆరుపై బయో పిక్ చిత్రీకరణ జరుగుతున్న క్రమంలో గౌతమి పుత్ర శాతకర్ణిలో అవకాశం కల్పించినట్టే.. ఎన్టీఆర్ బయో పిక్లోనూ ఎవరికైనా అవకాశం కల్పించారా..? అన్న చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చాలా మంది ఎదురయ్యారు.. ఎన్టీఆర్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలను కూడా షూటింగులో భాగంగా చిత్రీకరించాల్సి ఉంటుంది. .. ఆ క్రమంలో పార్టీ సీనియర్ నేత.. ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య హైదరాబాదులో అసెంబ్లీ ప్రాంగణం పరిసరాల్లో కన్పించారు… దీంతో వర్ల రామయ్య ఏమైనా ఈ సినిమాలో నటిస్తున్నారా..? అనే ప్రచారం జరుగుతోంది… గతంలో కూడా ఒకటి రెండు డాక్యుమెంటరీలలో నటించిన అనుభవం వర్లకు ఉంది.

అంబేద్కర్ మీద తీసిన డాక్యుమెంటరీలో వర్ల అంబేద్కర్ పాత్రను పోషిస్తే.. ఎమ్మెల్యే అనిత వంటి వారు ఇతర పాత్రలు పోషించారు… ఇప్పుడూ ఇదే తరహాలో వర్ల రామయ్య ఎన్టీఆర్‌ బయోపిక్‌లోనూ ఏమైనా పాత్ర పోషిస్తున్నారా..? అలాగే అనిత కూడా ఏమైనా పాత్రను దక్కించుకున్నారా..? అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది… దీనికి తోడు వర్ల రామయ్య మీసం తీసేసి కన్పిస్తున్నారు… దీంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టు కన్పిస్తోంది.

ఇదే విషయాన్ని వర్ల రామయ్యను అడిగితే అటువంటిదేదీ లేదని నవ్వుతూ సమాధానాన్ని దాటేశారు…కానీ ప్రస్తుతం ఆయన వ్యవహరం చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ బయో పిక్ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో బలంగానే జరుగుతోంది…

ఎన్టీఆర్ పిలుపును అందుకుని ఎందరో కొత్త వారు.. రాజకీయాల్లోకి వచ్చారు… తొలిసారిగా ఎమ్మెల్యేలు అయ్యారు… ఎన్టీఆర్ ఫొటోనే పెట్టుబడిగా ఓట్లేయించుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టారు… ఇలా నాడు ఎమ్మెల్యేలు అయిన వారు.. ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లుగా చెలామణి అవుతున్నారు… నాడు ఎన్టీఆర్ పిలుపు అందుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారి పాత్రల్లో నటించడానికి టీడీపీ నుంచే కొందరిని సెలెక్ట్ చేసుకోబోతోన్నట్టు తెలుస్తోంది… మొత్తంగా చూస్తే.. ఎన్టీఆర్ బయో పిక్ ద్వారా టీడీపీలో కొందరికి వెండితెర మీద వెలిగిపోయే ఛాన్స్ దక్కుతుందన్న ప్రచారం మాత్రం టీడీపీ వర్గాల్లో యమ జోరుగా సాగుతోంది.